Share News

Michaung effect: మిచౌంగ్ తుఫాను కారణంగా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

ABN , First Publish Date - 2023-12-04T07:14:23+05:30 IST

మైచాంగ్ తుఫాన్ కారణంగా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ప్రైవేట్ కంపెనీలను కోరింది. లేదంటే అవసరమైన మేర తక్కువ సిబ్బందితో మాత్రమే పని చేయాలని సూచించింది.

Michaung effect: మిచౌంగ్ తుఫాను కారణంగా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

చెన్నై: మిచౌంగ్ తుఫాను కారణంగా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ప్రైవేట్ కంపెనీలను కోరింది. లేదంటే అవసరమైన మేర తక్కువ సిబ్బందితో మాత్రమే పని చేయాలని సూచించింది. ముఖ్యంగా చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు జిల్లాల్లోని ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. మిచౌంగ్ తుఫాను ప్రభావంతో చెన్నై అంతటా వర్షాలు ప్రారంభమయ్యాయని, డిసెంబర్ 5 వరకు తీవ్రత మరింత పెరుగుతుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని చెంగల్‌పేట్, చాంచీపురం, తిరువళ్లూరుతోసహా ఇతర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు ఇప్పటికే కురిసిన వర్షాల కారణంగా చైన్నైలోని పలు మెట్రో స్టేషన్ల వద్ద నీరు నిలిచిపోయింది. సెయింట్ థామస్ మెట్రో స్టేషన్‌లో 4 అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో లోపలికి వెళ్లే మార్గం మూసుకుపోయింది. దీంతో ప్రయాణికులంతా ఆలందూరు మెట్రో స్టేషన్‌లో రైలు ఎక్కాలని అధికారులు సూచించారు.


వర్షం కారణంగా మెట్రో స్టేషన్‌ల వద్ద ఉండే ద్విచక్ర వాహనాల పార్కింగ్ ప్రాంతంలో అదనపు నీరు నిలిచిపోయింది. దీంతో ఆ నీటిని బయటికి పంపుతున్నారు. నీటి ఎద్దడి ఉన్నప్పటికీ ఉదయం 5 గంటలకు మెట్రో సేవలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. అయితే అనేక రహదారులు జలమయం కావడంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కోరింది. కాగా మైచాంగ్ తుఫాన్ నైరుతి బంగాళాఖాతం మీదుగా గత ఆరు గంటల్లో గంటకు 8 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా పయనిస్తోంది. ఇది పుదుచ్చేరికి తూర్పు-ఈశాన్యంగా 230 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 190 కిలోమీటర్లు, నెల్లూరుకు ఆగ్నేయంగా 310 కిలోమీటర్లు, బాపట్లకు ఆగ్నేయంగా 410 కిలోమీటర్లు, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మరోవైపు వర్షాల నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సన్నాహక చర్యలను సమీక్షించారు. తిరువళ్లూరు, చెన్నై, కాంచీపురం, చెంగెల్‌పేట్ జిల్లాల్లో వర్షాల కారణంగా నివాసాలను కోల్పోయిన మొత్తం 685 మందిని 11 సహాయక శిబిరాల్లో ఉంచినట్లు స్టాలిన్ చెప్పారు.

Updated Date - 2023-12-05T07:34:31+05:30 IST