Manipur : మణిపూర్‌లో అంతర్యుద్ధం.. భారత్‌ను బీజేపీ ఏ స్థాయికి దిగజార్చింది?.. : టీఎంసీ
ABN , First Publish Date - 2023-07-20T09:30:23+05:30 IST
మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) ఆరోపించారు. ఆ రాష్ట్రంలో అంతర్యుద్ధం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు ఓ పాత వీడియో బయటపడిన నేపథ్యంలో ఆమె స్పందిస్తూ, భారత్‌ను బీజేపీ ఇలా దిగజార్చిందని వ్యాఖ్యానించారు.
కోల్‌కతా : మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) ఆరోపించారు. ఆ రాష్ట్రంలో అంతర్యుద్ధం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు ఓ పాత వీడియో బయటపడిన నేపథ్యంలో ఆమె స్పందిస్తూ, భారత్‌ను బీజేపీ ఇలా దిగజార్చిందని వ్యాఖ్యానించారు. ఎన్డీయే ప్రచారం చేస్తున్న ‘భారత్’ను ప్రతిపక్షాల కూటమి ఇండియా (INDIA - Indian National Developmental Inclusive Alliance) పార్లమెంటులో తిప్పికొట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
మణిపూర్‌లో మెయిటీలు, కుకీల మధ్య మే 3 నుంచి ఘర్షణలు జరుగుతున్నాయి. సైన్యాన్ని మోహరించినప్పటికీ హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. సుమారు 100 మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోగా, కొందరు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
మహువా మొయిత్రా ఇచ్చిన ట్వీట్‌లో, మణిపూర్‌లో అంతర్యుద్ధం జరుగుతోందని, ఆ రాష్ట్రంలో యుద్ధ నేరాలు కనిపిస్తున్నాయని అన్నారు. మన దేశంలో ఇలా జరుగుతోందని మండిపడ్డారు. బీజేపీ భారత దేశాన్ని ఈ స్థాయికి దిగజార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
టీఎంసీ రాజ్యసభ సభ్యుడు సాకేత్ గోఖలే ఇచ్చిన ట్వీట్‌లో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) నాయకత్వం, మార్గదర్శకత్వంలో బీజేపీ నిర్వహిస్తున్న జాతి నిర్మూలన ఇది అని ఆరోపించారు.
మెయిటీలు, కుకీల మధ్య ఘర్షణలు ప్రారంభమైన రోజు నుంచి మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. ఇద్దరు కుకీ మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగించినట్లు కనిపిస్తున్న ఓ వీడియో బుధవారం బయటపడటంతో అందరూ ఖండిస్తున్నారు. ఈ బాధిత మహిళలపై సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసినట్లు కొందరు చెప్తున్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ దారుణాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత అమానుష సంఘటన అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి :
President: 6, 7 తేదీల్లో పుదుచ్చేరికి రాష్ట్రపతి
Central Govt: ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు..