Women Bill: మహిళల్ని మోసం చేస్తున్నారు.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై నిప్పులు చెరుగుతున్న విపక్షాలు

ABN , First Publish Date - 2023-09-19T19:10:29+05:30 IST

మంగళవారం కొత్త పార్లమెంట్ భవనంలో తొలి సెషన్‌లో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై సెప్టెంబర్ 20వ తేదీన చర్చ..

Women Bill: మహిళల్ని మోసం చేస్తున్నారు.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై నిప్పులు చెరుగుతున్న విపక్షాలు

మంగళవారం కొత్త పార్లమెంట్ భవనంలో తొలి సెషన్‌లో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై సెప్టెంబర్ 20వ తేదీన చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా.. మహిళల అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మహిళల అభివృద్ధి గురించి కేవలం మాట్లాడటం మాత్రమే సరిపోదని ఈ ప్రపంచం అర్థం చేసుకుందని.. ఇది సానుకూల దశ అని అన్నారు. ఈ బిల్లును స్వాగతిస్తూ.. కొన్ని ప్రతిపక్ష పార్టీలు తమ మద్దతు ప్రకటించాయి. అయితే.. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు మాత్రం నిప్పులు చెరిగాయి. వచ్చే ఎన్నికల్లో తమకు బూస్ట్ అవుతుందనే ఉద్దేశంతోనే.. బీజేపీ ఇన్నాళ్లూ ఈ బిల్లుని ఆలస్యం చేసిందని విమర్శించాయి.


ఈ బిల్లుపై ఆప్ ఎమ్మెల్యే అతిషి మాట్లాడుతూ.. మహిళల సమస్యల్ని బీజేపీ తన అస్త్రంగా మార్చుకోవాలని చూస్తోందని ఆరోపించారు. నిశితంగా చదివితే.. ఇది మహిళల్ని మోసం చేసే బిల్లు అని అర్థం చేసుకోవచ్చని ధ్వజమెత్తారు. 2029 ఎన్నికల ముందు వరకు ఈ బిల్లు అమల్లోకి వచ్చే అవకాశం లేకపోవడంతో.. ఢిల్లీ మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికితోడు.. మొదటి డీలిమిటేషన్ లేదా నియోజకవర్గాల పునర్నిర్మాణం తర్వాత మాత్రమే ఇది అమలు చేయబడుతుంది. అంతేకాదు.. ఇది 2027లో జరిగే జనాభా లెక్కలపై ఆధారపడి ఉంటుంది. దీంతో.. ఈ నిబంధనల్ని ఎందుకు చేర్చారని అతిషి ప్రశ్నించారు. దీనర్థం 2024 ఎన్నికల్లోపు మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం సాధ్యం కాదని స్పష్టమైపోయిందన్నారు. ఈ నిబంధనల్ని తొలగించి.. రిజర్వేషన్ బిల్లుని అమలు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ భిల్లుకు ఆప్ సూత్రప్రాయంగా మద్దతు ఇస్తుందన్న ఆమె.. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు.

అటు.. కాంగ్రెస్ పార్టీ ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు తమదేనని వాదిస్తోంది. ఈ బిల్లును 2010లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెట్టిందని, 2019లో ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ రాసిన లేఖలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారని కాంగ్రెస్ ఎత్తిచూపింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సైతం ఈ బిల్లు తమదేనని విలేకరులతో పేర్కొన్నారు. మరోవైపు.. ఈ బిల్లుని ఎన్నికల జుమ్లాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ దుయ్యబట్టారు. ఈ బిల్లు ఆశ చూపి.. కోట్లాదిమంది మహిళలు, అమ్మాయిల ఆశలపై నీళ్లు చల్లుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు. మహిళల హక్కులను పెంపొందించడం కోసం.. విద్యావంతులైన మహిళా అభ్యర్థులను ఎన్నుకోవాలని పార్టీలను కోరారు.

Updated Date - 2023-09-19T19:10:29+05:30 IST