Gongadi Trisha : అందుకే ఇక బిడ్డలొద్దనుకున్నాం
ABN , First Publish Date - 2023-02-06T00:33:32+05:30 IST
ఏ బంతినైనా బౌండరీకి తరలించే నైపుణ్యం... మన మట్టిలో పుట్టిన మరో మాణిక్యం... గొంగడి త్రిష. భద్రాద్రి నుంచి భారత జట్టు వరకు... దక్షిణాఫ్రికా పయనం నుంచి ప్రపంచ కప్ పైకెత్తే వరకు... తిరుగులేని ఆమె ఆటలో అలసటలేని రోజు లేదు.
ఏ బంతినైనా బౌండరీకి తరలించే నైపుణ్యం... మన మట్టిలో పుట్టిన మరో మాణిక్యం... గొంగడి త్రిష.
భద్రాద్రి నుంచి భారత జట్టు వరకు... దక్షిణాఫ్రికా పయనం నుంచి ప్రపంచ కప్ పైకెత్తే వరకు...
తిరుగులేని ఆమె ఆటలో అలసటలేని రోజు లేదు.
కల నెరవేర్చింది త్రిష అయినా...
ఆ కల కన్నది ఆమె తల్లితండ్రులు.
మహిళల అండర్-19 ప్రపంచకప్‌తో త్రిష తిరిగి వస్తున్న సందర్భంగా ఆమె తల్లి మాధవి
తన అనుభవాలు, అనుభూతులు ‘నవ్య’తో పంచుకున్నారు...
‘త్రిషకు ఆటలో ఎంఎస్ ధోనీ,
హాబీ్‌సలో డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. ఖాళీ సమయాల్లో డ్రాయింగ్ వేస్తుంటుంది. స్విమ్మింగ్ చేస్తుంది. బోర్ కొడితే టీవీలో కార్టూన్ ఫిలిమ్స్ చూస్తుంది. మాలాగానే తను కూడా కాలక్షేపాలు, షికార్లు వదిలేసింది. కానీ ఆట కోసం ఇవన్నీ త్యాగం చేశానని ఎప్పుడూ అనుకోదు. ఎప్పుడూ ఉండేది మైదానంలోనే కదా! అక్కడ క్రికెట్ ఆడే ఆడపిల్లలతో కాసేపు సరదాగా మాట్లాడుతుంటుంది.’
సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాలని...
ప్రపంచకప్ గెలిచిన వెంటనే త్రిష మాకు ఫోన్ చేసింది. మొట్టమొదటి అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ గెలిచినందుకు, టోర్నీతోపాటు ఫైనల్స్‌లో తను కీలక ఇన్నింగ్స్ ఆడినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. ముఖ్యంగా ‘అండర్-19’ ప్రపంచకప్ ఆడే అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుంది. ఒకసారి పాల్గొన్నవారు మళ్లీ ఆడకూడదన్న నిబంధన ఉంది. ‘నేను జట్టు సభ్యురాలిగా ఉన్నప్పుడు భారత్ కప్ గెలవడం ఎప్పటికీ మరిచిపోలేని మధుర జ్ఞాపకం. అయితే ఇక్కడితోనే ఆగిపోయేది లేదు. నా ప్రస్తుత లక్ష్యం భారత సీనియర్ జట్టులో స్థానం సంపాదించడం. ఆ జట్టు తరుఫున మళ్లీ ప్రపంచ కప్ ఆడాలి. కప్ గెలవాలి. అప్పటి వరకు విశ్రమించేది లేదు’ అంటూ తను ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పింది. అంతేకాదు... మిథాలీలాగా సుదీర్ఘ కాలం భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనేది తన కల. అంతటి ప్రతిభ త్రిషలో ఉంది. త్వరలోనే తనను సీనియర్ జట్టులో చూస్తామని ఆశిస్తున్నాం.
‘‘పిల్లలు పుట్టిన తరువాత వారి భవిష్యత్తు గురించి కలలు కనడం సహజం. కానీ మేం అలాకాదు. అబ్బాయి పుట్టినా... అమ్మాయి పుట్టినా తనను క్రికెటర్‌ను చేయాలని ముందే అనుకున్నాం. అమ్మాయి పుట్టింది. ఆ క్షణమే మావారు రామిరెడ్డి నిర్ణయించుకున్నారు... ఎలాగైనా మా అమ్మాయిని భారత క్రికెట్ జట్టులో చూడాలని! భారత మాజీ క్రికెటర్ మిథాలీరాజ్ మాకు స్ఫూర్తి. మావారి కలనే నా కలగా మార్చుకున్నాను. మిథాలీలా గొప్ప క్రికెటర్‌ను చేయాలనే లక్ష్యంతోనే మేము త్రిషను పెంచాం. సాధారణంగా అందరూ ఆరేడేళ్ల తరువాత క్రికెట్ శిక్షణ మొదలుపెడతారు. కానీ మేం త్రిషతో రెండేళ్లప్పుడే బ్యాట్ పట్టించాం. ఎందుకంటే ఇది భారత దేశం. నూట నలభై కోట్ల జనాభా. అందులోనూ క్రికెట్. లక్షల్లో పోటీ పడుతుంటారు. వాళ్లందరినీ దాటుకొని, మా అమ్మాయి భారత జట్టుకు ఆడాలంటే ఎంత త్వరగా సాధన మొదలుపెడితే అంత మంచిదని భావించాం. అందుకే తనకు రెండేళ్లప్పుడే ఆటను పరిచయం చేశాం. తన ఏకసంధాగ్రాహి కావడంతో మా పని మరింత సులువైంది. తరువాత అదే తనకు బలమైంది.
అడిగింది కొనిపెడుతూ...
త్రిషకు అప్పట్లో చిన్న ప్లాస్టిక్ బ్యాట్ ఉండేది. దాంతో చీపురుతో ఊడ్చినట్టు స్వీప్ షాట్స్ కొట్టేది. ప్లాస్టిక్ బాల్‌తో అండర్‌ఆర్మ్ త్రోస్ వేసి ఆడించేవాళ్లం. ఆ బ్యాట్ ఇప్పటికీ ఉంది. మా ఆయనైతే మొదట్లో ఆటపై ఆసక్తి పెంచడానికి రోజూ ఏదో ఒకటి కొని ఇస్తుండేవారు. ఇన్ని బంతులు ఆడితే డ్రాయింగ్ బుక్స్, స్కెచ్‌పెన్స్ లాంటివేవో కొనిపెడతానని చెప్పేవారు. తను సరేననేది. మాట ఇచ్చినట్టుగానే ఆయన షాప్‌కు తీసుకువెళ్లి కొనేవారు. త్రిష కూడా కాదనకుండా చెప్పినన్ని బంతులు ఆడేది. అలా ఆరంభంలో యాభై బంతులు ఆడించేవారు. తరువాత వంద... రెండొందలు... చివరకు వెయ్యి బంతులు ఆడే వరకు తీసుకువెళ్లారు. రోజూ తనకు బహుమతిగా ఏదో ఒకటి కొంటూనే వచ్చాం.
తొలి కోచ్ ఆయనే...
మా అమ్మాయికి మూడున్నరేళ్లు వచ్చేసరికి చిన్న చెక్క బ్యాట్ కొని ఇచ్చాం. ప్లాస్టిక్ బాల్ పక్కనపెట్టి, టెన్నిస్‌బాల్‌తో త్రోస్ వేసేవాళ్లం. మావారే తనకు తొలి కోచ్. ఆయన ఒకప్పుడు రాష్ట్ర స్థాయి హాకీ క్రీడాకారుడు. క్రికెట్ కూడా ఆడతారు. భద్రాచలంలో మావారికి జిమ్ ఉండేది. ఐటీసీకి ఫిట్‌నెస్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. తనతో త్రిషను జిమ్‌కు తీసుకువెళ్లి త్రోడౌన్స్ వేసి, బ్యాటింగ్ సాధన చేయించేవారు. ఆరేళ్ల వరకు ఆయనే కోచింగ్ ఇచ్చారు.
హైదరాబాద్‌కు మకాం...
అయితే మరో స్థాయికి వెళ్లాలంటే ఈ కోచింగ్ సరిపోదు. మరిన్ని మ్యాచ్‌లు కూడా అడించాలన్న ఉద్దేశంతో 2013లో, అంటే పాపకు ఏడేళ్ల వయసులో మేము భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు వచ్చాం. మంచి కోచింగ్ కావాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. దాని కోసం మా ఊళ్లో జిమ్, నాలుగు ఎకరాల పొలం అమ్మేశాం. పాప భవిష్యత్తు ముందు మాకు ఏవీ ఎక్కువ కాదనుకున్నాం. హైదరాబాద్‌లో సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో చేర్పించాం. అక్కడ అందరూ టాప్ కోచ్‌లు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మంచి నైపుణ్యం సంపాదించింది త్రిష. ఏడాది తిరిగేలోపే తెలంగాణ ఇంటర్ డిస్ర్టిక్ట్ టోర్నీ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆడింది. ఎనిమిదేళ్ల వయసులో అండర్-16 రాష్ట్ర జట్టుకు ఎంపికైంది. అందరిలో గుర్తింపు, ఇవన్నీ చూశాక తనకు ఆటపై ఆసక్తి, ఇష్టం మరింత ఎక్కువయ్యాయి. భారత జట్టుకు ఆడాలన్న పట్టుదల పెరిగింది.
రోజుకు ఎనిమిది గంటలు...
మైదానమే త్రిషకు స్కూల్. ఉదయం రెండు గంటలు వర్కవుట్స్, రెండు గంటలు ప్రాక్టీస్ చేస్తుంది. మధ్యాహ్నం విశ్రాంతి. మళ్లీ సాయంత్రం రెండు గంటలు ఫిట్‌నెస్, ప్రాక్టీస్... నాలుగు సెషన్లలో రోజుకు ఎనిమిది గంటలు శ్రమిస్తుంది. అదే ఒక బడిలా అయిపోయింది. మొదట్లో శ్రీనివాస్‌గారు, ఆ తరువాత ఇక్బాల్ కోచింగ్ సెంటర్‌లో ఇక్బాల్ గారు శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ గారి ఆధ్వర్యంలో త్రిష సాధన చేస్తోంది. ఆయనే తన క్రికెట్ షెడ్యూల్ అంతా చూస్తున్నారు. అయితే చదువు దెబ్బతినకూడదని రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ట్యూషన్ పెట్టాం. భద్రాచలంలో ఉన్నప్పుడు సెయింట్ పాల్స్ స్కూల్లో నాలుగో తరగతి వరకు చదివింది. ఇక్కడికి వచ్చాక శ్రీచైతన్యలో పదో తరగతి పూర్తి చేసింది. ప్రస్తుతం సైనిక్‌పురి భవన్స్ కాలేజీలో ఇంటర్ (సీఈసీ) సెకండ్ ఇయర్ చదువుతోంది.
ప్రపంచ కప్‌లో...
మా అమ్మాయిని క్రికెటర్‌ను చేయాలన్న స్ఫూర్తి రగిలించింది మిథాలీరాజ్. పదమూడేళ్లకే ఆమెతో కలిసి మా అమ్మాయి ‘సీనియర్ చాలెంజర్స్’ ఆడింది. ఆ తరువాతే తను న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపికైంది. అక్కడి నుంచి అండర్-19 ప్రపంచ కప్ జట్టులో స్థానం సంపాదించింది. ఫైనల్స్‌లో రాణించి జట్టు విజయంలో ప్రముఖ పాత్ర పోషించింది. ఇప్పుడు ప్రపంచ కప్‌తో తిరిగి వస్తోందంటే... మా గుండె ఆనందంతో ఉప్పొంగుతోంది. స్వతహాగా త్రిష ఓపెనరే అయినా ఏ స్థానంలోనైనా ఆడగలనని నిరూపించుకుంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకొనే బ్యాట్స్‌ఉమన్‌గా పేరు సంపాదించింది.
ఆ బాధ్యత నాదే...
నేను, మావారు కలిసి మా అమ్మాయిని కోచింగ్‌కు తీసుకువెళ్లేవాళ్లం. ఆయనకు కుదరనప్పుడు నేను వెళతాను. చిన్నప్పుడు నిద్ర లేపి, గ్లాసుడు పాలు ఇచ్చి, షూస్ వేసి పంపించేదాన్ని. కోచింగ్‌కు క్రమం తప్పకుండా వెళ్లాల్సిందే. ఆయన కాస్త గారాబం చేస్తారు కానీ, ఆ విషయంలో నేను అస్సలు ఊరుకోను. ఎందుకంటే తనకు ప్రతి రోజూ విలువైనదే. ఒక్కరోజు సాధన చేయకపోయినా ఆటపై ప్రభావం పడుతుంది. తన కోసం మేము కూడా పెళ్లిళ్లు, పేరంటాల వంటి శుభకార్యాలకు వెళ్లడం మానేశాం. మా బంధువులు, స్నేహితులు మమ్మల్ని అర్థం చేసుకున్నారు. ఇక త్రిషకు న్యూట్రిషనిస్ట్, డైటిస్ట్ నేనే. ఉదయం లేవగానే డ్రాగన్ ఫ్రూట్, కివీ, దానిమ్మ, ఆపిల్ కలిపిన బౌల్, దాంతోపాటు మూడు ఎగ్‌వైట్, బాదం ఇస్తాను. మధ్యాహ్నం కినోవా రైస్‌తో ఫిష్ కర్రీ గానీ, చికెన్ కర్రీ గానీ ఉంటుంది. సాయంత్రం ఒకరోజు ఓట్స్, ఒకరోజు దోశ, చపాతీ, బ్రెడ్ లాంటివి కర్రీతో ఇస్తా. ప్రొటీన్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి. అన్నీ ఇంట్లోనే రెడీ చేస్తాను. తనకు చికెన్ బాగా ఇష్టం.
ఒక్కరితోనే సరి...
మాకున్నది ఒక్కతే అమ్మాయి. మా ఇద్దరి జీవితం తనే. తన కోసం, తనను భారత క్రికెటర్‌గా చూడడం కోసం మేం ఒక్కరితోనే ఆపేశాం. ఆర్థికంగా ఇబ్బందులు పడినా... ఏ రోజూ బాధపడలేదు. వెనకడుగు వేయలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి మెరుగుపడింది. ఐదేళ్లుగా ‘ఆర్క్ కన్‌స్ట్రక్షన్స్’ గుమ్మిడి రామిరెడ్డి గారు త్రిషకు స్పాన్సర్ చేస్తున్నారు. ఆయనతోపాటు ఈమధ్యే ‘డీఈషా- నిర్మాణ్ ఆర్గనైజేషన్’, ‘మెగా ఇంజనీరింగ్’వాళ్లు కూడా కొంతవరకు సాయం అందిస్తున్నారు.’’
హనుమా