Ulcer : చాలా వరకూ అల్సర్ సమస్యను గ్యాస్, ఎసిడిటీ సమస్యగా పొరపాటు పడతాం.. ఈ అల్సర్ సమస్య ఎక్కడ మొదలవుతుందంటే..!
ABN , First Publish Date - 2023-03-17T10:04:48+05:30 IST
ఈ నిర్లష్యం వల్ల ఇవి అల్సర్లుగా తీవ్రమైన పుండ్లుగా మారే అవకాశం ఉంటుంది.

తిన్నంత తిని అరిగించుకోవడం ఇప్పటి రోజుల్లో అందరికీ సాధ్యంకాని పని. అయితే తినే ఆకాస్తన్నా ఒంటబట్టకపోతే కూడా కష్టమే. ఆహారం తీసుకున్న కాసేపటికే త్రేన్పులు, కడుపులో మంట, వాంతులు కావడం, గ్యాస్ ఎగదన్నడం వంటి లక్షణాలు ఇప్పటిరోజుల్లో చాలామందిలో చూస్తూనే ఉన్నాం అసలు ఈ ఇబ్బంది ఎందుకు వస్తుందో తెలుసుకుందాం.
కడుపులో అల్సర్ల కారణంగా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అల్సర్ల సమస్య తలెత్తడానికి అనేక కారణాలున్నాయి. హెలికోబాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియా కారణంగా కడుపులో ఉండే సున్నితమైన మ్యూకస్ మెంబరైన్ అనే సున్నితమైన పొర దెబ్బతింటుంది. కడుపులో పుండ్లు ఏర్పడి, జీర్ణాశయంలో ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్ సాంద్రత ఎక్కువవడం వల్ల కూడా ఈ పొర దెబ్బతింటుంది. చాలా మంది ఈ అల్సర్ల సమస్యను గ్యాస్, ఎసిడిటీ సమస్యగా భావిస్తారు. ఈ నిర్లష్యం వల్ల ఇవి అల్సర్లుగా తీవ్రమైన పుండ్లుగా మారే అవకాశం ఉంటుంది. చికిత్స తీసుకోవడం చాలా అవసరం.
1. హెలికోబాక్టర్ పైలోరీ అనే బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ వల్ల కూడా అల్సర్ల సమస్య తలెత్తుతుంది.
2. కీళ్లనొప్పుల కోసం చాలాకాలంగా మందులు వాడే వారిలో అల్సర్ల సమస్య ఉంది.
3. మానసిక ఒత్తిళ్లు, నిద్రలేమి కూడా అల్సర్లను తీవ్రం చేస్తాయి. అందుకే ఒత్తిడి నుంచి బయటపడడానికి యోగా, ధ్యానం చేయడం అవసరం.
4. మలబద్దకం అల్సర్లను అధికం చేస్తుంది. కాబట్టి పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల మలవిసర్జనలో ఇబ్బందులు తగ్గుతాయి.
జాగ్రత్తలు
1. ఆహారాన్ని బాగా నమిలి తిన్నప్పుడు లాలాజలం బాగా ఉత్పన్నమవుతుంది. దీనికి ఆమ్లాన్ని తగ్గించే గుణం ఉంది.
2. ఆహారాన్ని బాగా నమిలి తినడం మంచిది.
3. అల్సర్ వల్ల కడుపులో మరీ నొప్పిగానో లేదా మంటగానో ఉన్నప్పుడు బాగా నీరు తాగాలి.
4. అల్సర్ ఉన్నవాళ్లు ఏదీ అతిగా ఉండకూడదు. ఉప్పు, కారం, మసాలాలు, పులుపు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోకూడదు.
5. పొగ తాగడం వల్ల పేగుల్లో ఉండే మ్యూకస్ పొర పలుచబడి ఆమ్లం సులభంగా ప్రభావం చూపిస్తుంది. అందుకే ధూమపానానికి దూరంగా ఉండాలి.
6. మద్యం, టీ, కాఫీలు కూడా బాగా తగ్గించాలి.
7. కడుపులో మరీ మంటగా ఉన్నప్పుడు మజ్జిగ తీసుకోవచ్చు. అలాగే తేనె తీసుకోవడం ఉత్తమం.
8. కొన్ని ఆహార పదార్థాలు అల్సర్లను అధికం చేస్తాయి. అలా పడనివేవో గుర్తించి వాటికి దూరంగా ఉండాలి.