NTR: ఆ కోరికను అలా తీర్చుకున్న ఎన్టీఆర్‌

ABN , First Publish Date - 2023-01-08T00:11:11+05:30 IST

మహా భారతాన్ని తెలుగులో అందించిన నన్నయ, తిక్కన, ఎర్రన తర్వాత మనం గర్వంగా చెప్పే సరస్వతీ వరప్రసాది శ్రీనాథుడు. తెలుగుతనం ఆయన కవితా ధనం.

NTR: ఆ కోరికను అలా తీర్చుకున్న ఎన్టీఆర్‌

మహా భారతాన్ని తెలుగులో అందించిన నన్నయ, తిక్కన, ఎర్రన తర్వాత మనం గర్వంగా చెప్పే సరస్వతీ వరప్రసాది శ్రీనాథుడు. తెలుగుతనం ఆయన కవితా ధనం. తెలుగు జనం ఆయన జీవన వనం. తెలుగు వీరుల పౌరుషాన్ని కవితలో పలికించిన శ్రీనాథుడి పాత్ర పోషించాలనేది ఎన్టీఆర్‌ చిరకాల వాంఛ. 1966లో భారత్‌ ఫిల్మ్స్‌ సంస్థ జి. రామినీడు దర్శకత్వంలో ‘ భక్త పోతన’ చిత్రాన్ని నిర్మించింది. గుమ్మడి అందులో పోతన గా నటించారు. ఆ సినిమాలో శ్రీనాథుడి పాత్రకు మొదట ఎన్టీఆర్‌ను అడిగారు. రచయిత సముద్రాల రాఘవాచార్య రికమండేషన్‌ అది. ఆరు నెలలు సమయం తనకు కావాలని, ఆ ఆరు నెలల్లో కవిగారు తన వెంట ఉండడమో, లేక తనే ఆయనతో వుండడమో చేస్తానని ఎన్టీఆర్‌ చెప్పారు. ఔ పోసన పట్టడం దగ్గర నుంచి అన్నీ ఆ ఆరు నెలల కాలంలో నేర్చుకొని బ్రాహ్మణత్వం ఆపాదించుకొంటానని, ఆ తర్వాత గుండు కొట్టించుకొని నటిస్తానని, రెండు నెలల్లో సినిమా పూర్తి చేద్దామని ఎన్టీఆర్‌ దర్శక నిర్మాతలకు చెప్పారు. ఒక పక్క గ్లామర్‌ హీరో గా నటిస్తున్నా , శ్రీనాథుడి పాత్ర కోసం గుండు కొట్టించుకుని నటించడానికి ఆయన సిద్ధమయ్యారు కానీ ‘భక్త పోతన’ చిత్ర దర్శక నిర్మాతలు ఆ సాహసం చెయ్యలేక పోయారు ‘అదంతా ఎందుకండీ.. మీకు పిలక విగ్గు పెట్టిస్తాం..’అన్నారు. దాంతో ఎన్టీఆర్‌ కు కోపం వచ్చి .‘ఆహా.. మంచి సలహా ఇచ్చారు. ఆ పాత్ర నేను చెయ్యను. మీరు వెళ్ళవచ్చు’ అని వాళ్ళని పంపించేశారు. అప్పటి నుంచి శ్రీనాథుడు పాత్ర ఆయన్ని వెంటాడుతూనే ఉంది. సినిమాలకు దూరంగా జరిగి, రాజకీయాల్లోకి వెళ్లి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా శ్రీనాథుడి కథను సినిమాగా తీయాలని ఎన్టీఆర్‌ ప్రయత్నించారు. 1983 లో స్వీయ దర్శకత్వంలో ఆ సినిమా తీయాలనుకొన్నారు. జేవి రాఘవులు సంగీత దర్శకత్వంలో డాక్టర్‌ సి. నారాయణ రెడ్డి రాసిన కొన్ని పాటలను రికార్డ్‌ చేశారు కూడా. అయితే రాజకీయ పరమైన ఒత్తిడులు, ముఖ్యమంత్రి పదవిలో ఉండగా సినిమాల్లో నటించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించక పోవడం.. ఇత్యాది కారణాల వల్ల ఆ చిత్ర నిర్మాణం వాయిదా పడింది.

yt.jpg

ఏడాది తర్వాత అంటే 1984 డిసెంబర్‌ 29న ఈ సినిమా కోసం మళ్లీ పాటలు రికార్డ్‌ చేశారు. అంతకుముందు జే వి రాఘవులు స్వరపరిచిన పాటలు ఎన్టీఆర్‌ కు నచ్చలేదు. అందుకే తిరిగి వాటిని పెండ్యాల నాగేశ్వరరావు సంగీత దర్శకత్వం లో గాయకుడు రామకృష్ణ తో పాడించి రికార్డ్‌ చేయించారు. ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’ పేరుతో స్వీయ దర్శకత్వంలో చిత్రాన్ని నిర్మించాలని, అందులో శ్రీనాథుడి పాత్ర తనే పోషించాలని ఎన్టీఆర్‌ గట్టిగా నిర్ణయించుకొన్నారు. ఈ సినిమాకు నారాయణ రెడ్డి మాటలు, పాటలు రాశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు నెలల్లో అనుమతి వస్తుందని, అది రాగానే షూటింగ్‌ ప్రారంభించాలని ఆ సమయంలో ఎన్టీఆర్‌ భావించారు. అయితే 1985 మార్చి 9న ఎన్టీఆర్‌ మూడో సారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించడంతో సినిమాల గురించి ఆలోచించే తీరిక ఆయనకు దొరకలేదు. చివరకు ఏడేళ్ల తర్వాత బాపు దర్శకత్వంలో ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’ చిత్రం నిర్మించి, అందులో నటించి, తన కోరిక తీర్చుకున్నారు ఎన్టీఆర్‌.

ఈ సినిమా తీస్తే జనం చూడరని బాపు, రమణ చెప్పినా ఆయన వినిపించుకోలేదు. తనకు ఆర్ధిక నష్టం వచ్చినా పరవాలేదు కానీ శ్రీనాధుడి పాత్ర పోషించాల్సిందే అని ఎన్టీఆర్‌ గట్టి పట్టు పట్టారు. అప్పటి వరకూ 320 పాత్రలతో మహా నటుడిగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్‌ శ్రీనాధుడి పాత్ర కోసం అంతలా తపించడం బాపు, రమణలకు ఆశ్చర్యం కలిగించింది. వారు కూడా ఈ చిత్ర నిర్మాణం ఒక మంచి అవకాశంగా భావించి, అంకిత భావంతో పని చేశారు. మూడు కోట్ల రుపాయల బడ్జెట్‌ తో శ్రీనాథ కవిసార్వభౌముడు చిత్రం తయరైంది. 1992 లో చిత్రం విడుదలైంది. ఎన్టీఆర్‌ అభిమానులు, బాపు చిత్రాల కోసం ఆశగా ఎదురు చూసే ప్రేక్షకులు మాత్రమే ఈ సినిమా చుశారు. మిగిలిన వాళ్ళెవరూ థియేటర్‌ పరిసర ప్రాంతాల్లో కనిపించలేదు.

Updated Date - 2023-01-08T00:11:12+05:30 IST