మరో ఆరు రోజులు
ABN , Publish Date - Mar 31 , 2025 | 04:50 AM
ఉపవాసాలు, దానధర్మాలు, ప్రత్యేక నమాజ్‌లు, ఆరాధనలతో రంజాన్ మాసం ముగిసింది. తనపట్ల భక్తిని, నమ్మకాన్ని మరింత పటిష్టపరచుకొనే అవకాశాన్ని విశ్వాసులకు అల్లాహ్ అనుగ్రహించాడు. దీనికి కొనసాగింపుగా... రంజాన్ మాస ఉపవాసాలను...

ఉపవాసాలు, దానధర్మాలు, ప్రత్యేక నమాజ్‌లు, ఆరాధనలతో రంజాన్ మాసం ముగిసింది. తనపట్ల భక్తిని, నమ్మకాన్ని మరింత పటిష్టపరచుకొనే అవకాశాన్ని విశ్వాసులకు అల్లాహ్ అనుగ్రహించాడు. దీనికి కొనసాగింపుగా... రంజాన్ మాస ఉపవాసాలను పూర్తి చేసిన తరువాత... తదుపరి మాసమైన షవ్వాల్‌లో ఆరు రోజులు ఉపవాసాలు చేసే సంప్రదాయం ఉంది. సాధారణంగా... ‘ఈద్-ఉల్-ఫితర్’ జరుపుకొన్నాక... రెండో రోజు నుంచి ఈ ఉపవాసాలను పాటిస్తారు. ఎవరైతే రంజాన్ ఉపవాసాలు చేసి, ఆ తరువాత షవ్వాల్ మాసంలో ఆరు రోజులు ఉపవాసాలు ఉంటారో... వారు ఏడాదంతా ఉపవాసాలు చేసినట్టేనని దైవ ప్రవక్త మహమ్మద్ తెలిపారు. రంజాన్ ఉపవాసాలను, షవ్వాల్ ఉపవాసాలను పాటించిన వారు తల్లి గర్భంలోంచి అప్పుడే పుట్టినంత పవిత్రులవుతారని, వారు ఎప్పుడూ ఉపవాసాలు పాటిస్తున్నవారిగా పరిగణన పొందుతారని హదీస్ గ్రంథం చెబుతోంది. ఎల్లప్పుడూ ఉపవాసం పాటించడం గురించి తనకు ఎదురైన ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు దైవ ప్రవక్త సమాధానం ఇస్తూ ‘‘రంజాన్ ఉపవాసాలతో పాటు తరువాతి నెలలోని (ఆరు రోజుల) ఉపవాసాలను కూడా పాటించు. అలాగే బుధ, గురువారాల్లో ఉపవాసం ఉండు.
దీనివల్ల నువ్వు ఎల్లప్పుడూ ఉపవాసాలు పాటించేవాడిగా పరిగణన పొందుతావు’’ అని చెప్పారు. ‘‘ఎవరైనా రంజాన్ మాసమంతా ఉపవాసాలు ఉంటే... అతనికి పది నెలల పుణ్యం వస్తుంది. షవ్వాల్‌లోని ఆరు రోజుల ఉపవాసాల వల్ల అరవై రోజుల పుణ్యం లభిస్తుంది. ఈ విధంగా పన్నెండు నెలలు... అంటే ఏడాది కాలం ఉపవాసాలు చేసినంత పుణ్యం వారికి దక్కుతుంది’’ అని దివ్య గ్రంథాలు పేర్కొంటున్నాయి. కాగా, ‘‘రంజాన్ మాసంలో చేసిన ఉపవాసాల్లో ఏవైనా పొరపాట్లు జరిగితే... షవ్వాల్ ఉపవాసాల ద్వారా ఆ పొరపాట్లను అల్లాహ్ మన్నిస్తాడు. నమాజ్‌లలో ఏర్పడిన లోపాలను తొలగిస్తాడు’’ అని పూర్వ ఉలేమాలు (ఇస్లాం గురువులు) స్పష్టం చేశారు.
మహమ్మద్ వహీదుద్దీన్
ఇవి కూడా చదవండి:
ప్రభుత్వ స్కీంలో కోటి రూపాయలు సంపాదించడం ఎలా..నెలకు ఎంత సేవ్ చేయాలి..
గోల్డ్‌కు గట్టి పోటీ ఇస్తున్న వెండి..ఏడాదిలో ఎంత పెరిగిందో తెలుసా..