Maui fires: అగ్రరాజ్యంలో మరో ప్రకృతి విపత్తు.. అగ్ని కీలల్లో చిక్కుకున్న హవాయి ద్వీపం.. 36మంది మృతి!

ABN , First Publish Date - 2023-08-11T07:16:57+05:30 IST

పసిఫిక్‌ సముద్రంలోని హవాయి ద్వీపంలో కార్చిచ్చు తీవ్ర కలకలం రేపుతోంది. మాయి కౌంటీలో పర్యాటకానికి పేరుగాంచిన లహైనా అగ్నికీలల్లో చిక్కుంది.

Maui fires: అగ్రరాజ్యంలో మరో ప్రకృతి విపత్తు.. అగ్ని కీలల్లో చిక్కుకున్న హవాయి ద్వీపం.. 36మంది మృతి!

హవాయి ద్వీపంలో కార్చిచ్చు

కాలిపోయిన భవనాలు

లాస్‌ఏంజెల్స్‌, ఆగస్టు 10: పసిఫిక్‌ సముద్రంలోని హవాయి ద్వీపంలో కార్చిచ్చు తీవ్ర కలకలం రేపుతోంది. మాయి కౌంటీలో పర్యాటకానికి పేరుగాంచిన లహైనా అగ్నికీలల్లో చిక్కుంది. ‘దోరా’ తుఫాను ప్రభావంతో దావానలం వేగంగా వ్యాపిస్తోంది. మంగళవారం సాయంత్రం నుంచి మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. మొత్తం 36 మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో భవనాలు పూర్తిగా కాలిపోయాయి. ప్రాణాలను రక్షించుకునేందుకు పలువురు పిల్లలతో సహా పసిఫిక్‌ సముద్రంలోకి దూకారు. వీరిలో 14 మందిని కోస్ట్‌ గార్డ్స్‌ రక్షించారు.

కాగా, లక్షన్నర గ్యాలన్ల నీటితో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. లహైనాలో మొత్తం 16 రహదారులను మూసివేశారు. జాతీయ రహదారిని మాత్రమే తెరిచి ఉంచి సహాయ చర్యలు చేపడుతున్నారు. దీని ద్వారానే వేలమందిని తరలించారు. 11 వేల మంది పర్యాటకులను మాయికి తీసుకొచ్చామని, 271 భవనాలు దగ్ధమయ్యాయని అధికారులు తెలిపారు. 2 వేల ఎకరాల్లో మంటలు వ్యాపించినట్లు చెప్పారు. ‘‘మేం చూసినవాటిలో ఇదే మహా విపత్తు. మొత్తం లహైనా క్షణాల్లో కాలిపోయింది’’ అని స్థానికుడు ఒకరు పేర్కొన్నారు.

Hawaii.jpg

పెద్దపెద్ద హోటళ్లకు నెలవు

అమెరికాలో చివర (50)గా ఏర్పడిన రాష్ట్రం హవాయి. ఈ ద్వీపాల పశ్చిమ దిక్కున ఉండే లహైనా విలాసవంతమైన హోటళ్లతో పర్యాటకానికి పేరుగాంచింది. మాయి విమానాశ్రయం నుంచి పర్యాటకుల ను తరలిస్తున్నారు. కాగా, అమెరికా నేషనల్‌ గార్డ్స్‌, నౌకా దళం, మెరైన్‌, కోస్ట్‌ గార్డ్స్‌ను హవాయికి పంపారు. దావానాలానికి నిర్దిష్ట కారణం ఏమిటతో తేలలేదు. వేసవిలో ఎండిపోయిన వృక్ష సంపదకు అంటుకున్న నిప్పు బలమైన గాలుల కారణంగా విస్తృతంగా వ్యాపించిందని అధికారులు భావిస్తున్నారు.

Updated Date - 2023-08-11T07:16:57+05:30 IST