TANA సేవలు మరింత విస్తృతం చేస్తాం: తానా అధ్యక్షుడు నిరంజన్‌ శృంగవరపు

ABN , First Publish Date - 2023-07-14T16:38:28+05:30 IST

అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం నూతన అధ్యక్షునిగా నిరంజన్‌ శృంగవరపు పదవీ బాధ్యతలు చేపట్టారు.

 TANA సేవలు మరింత విస్తృతం చేస్తాం: తానా అధ్యక్షుడు  నిరంజన్‌ శృంగవరపు

ఎన్నారై డెస్క్: అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(TANA) నూతన అధ్యక్షునిగా నిరంజన్‌ శృంగవరపు పదవీ బాధ్యతలు చేపట్టారు. 2023-25 సంవత్సరానికిగాను తానా అధ్యక్షునిగా ఆయన వ్యవహరిస్తారు. తన రెండేళ్ళ పదవీకాలంలో తానా టీమ్‌తో కలిసి తెలుగు రాష్ట్రాల్లో తానా సేవలను మరింత విస్తృతపరుస్తానని నిరంజన్‌ శృంగవరపు పేర్కొన్నారు. ఉచిత కంటి చికిత్స శిబిరాలు, క్యాన్సర్‌ శిబిరాలు, రైతులకు అవసరమైన రక్షణ పరికరాలు, ఈఎన్‌టి, ఇతర చికిత్సల కోసం వైద్యశిబిరాలను ఏర్పాటు చేయడంతోపాటు, పేద విద్యార్థులు ఇబ్బందులు పడకుండా వారు చదువును కొనసాగించేందుకు వీలుగా స్కాలర్‌‌షిప్‌‌లను, మహిళలకు కుట్టు మిషన్లు, వికలాంగులకు ట్రై సైకిళ్ళు వంటి వాటిని పెద్దఎత్తున పంపిణీ చేస్తామని నిరంజన్‌ తెలిపారు. అమెరికాలోని తెలుగు కమ్యూనిటీతోపాటు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారికి తానా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటుందని ఆయన చెప్పారు.

2.jpg

కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ పరిధిలోని రాజానగరంకు చెందిన నిరంజన్‌ శృంగవరపు తానాలో అంచెలంచెలుగా ఎదిగారు. తానా ఫౌండేషన్‌ చైర్మన్‌గా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలను చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కోవిడ్‌ సమయంలో ఆయన ఫౌండేషన్‌ ద్వారా కోట్లాదిరూపాయలతో నిత్యావసర సరుకులను ఇతర సహాయ కార్యక్రమాలను ఆయన అందించారు. తానాలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించిన అనుభవంతో తానా అధ్యక్షునిగా మరింతగా తెలుగురాష్ట్రాల్లోని వారితోపాటు దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారికి కూడా తానా ద్వారా సహాయం అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

Updated Date - 2023-07-14T16:38:31+05:30 IST