Sr.NTR Satha Jayanthi: అమెరికాలో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి.. ఎన్నారైల సమక్షంలో మహానాడు..!

ABN , First Publish Date - 2023-05-01T18:32:41+05:30 IST

ఎన్టీఆర్ జన్మదినాన్ని ఆత్మగౌరవ దినోత్సవంగా ప్రకటించాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని జాక్సన్ విల్లే నగరంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 12వ మహానాడు జరిగింది.

Sr.NTR Satha Jayanthi: అమెరికాలో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి.. ఎన్నారైల సమక్షంలో మహానాడు..!

ఎన్టీఆర్ జన్మదినాన్ని ఆత్మగౌరవ దినోత్సవంగా ప్రకటించాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని జాక్సన్ విల్లే నగరంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 12వ మహానాడు జరిగింది. జాక్సన్ విల్లే ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షులు ఆనంద్ తోటకూర ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కటింగ్ చేశారు. శ్రీశ్రీ జయంతిని పురస్కరించుకుని మహాప్రస్థానంలోని గేయాలను గుర్తుచేసుకుంటూ ఆయనకు నివాళులు అర్పించారు. మహానాడును పురస్కరించుకుని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆన్ లైన్ ద్వారా ప్రసంగించారు.

ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. ‘తెలుగువారికి గుర్తింపు, గౌరవం తీసుకువచ్చిన ఎన్టీఆర్ జయంతి మే 28న ప్రభుత్వపరంగా నిర్వహించాలి. సినీ, రాజకీయ రంగంలో ఆయన ధృవతారగా వెలుగొందారు. రాజమహేంద్రవరంలో మే 27, 28,29 తేదీల్లో మహానాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున హాజరుకావాలి..’ అని బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు.

ఆ తర్వాత ప్రసంగించిన అయ్యన్నపాత్రుడు.. బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు.. 9 నెలల్లోనే పార్టీని స్థాపించి అధికారం చేపట్టడం ద్వారా చరిత్రలో నిలిచిపోయారని ఆయన స్పష్టం చేశారు. పేద ప్రజల కోసం సంక్షేమానికి రూపకల్పన చేశారన్నారు. నేడు దేశంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలన్నింటికి ఎన్టీఆరే ఆధ్యుడని గుర్తు చేశారు.

ఈ సందర్భంగా మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ... ఎన్టీఆర్ కీర్తి అజరామరమని వ్యాఖ్యానించారు. అమరుడైన అన్న ఎన్టీఆర్‌కు శతవసంత నీరాజనాలు అర్పిద్దామని పిలుపునిచ్చారు. ఈ ఏడాది మే నెలలో వంద నగరాల్లో ఎన్టీఆర్ శతవసంతాల వేడుకలు ఘనంగా జరపాలని ఎన్ఆర్ఐ టీడీపీ యూఎస్ఏ అధ్యక్షులు జయరాం కోమటి పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమాన్ని అందరూ చిత్తశుద్ధితో విజయవంతం చేయాలని కోరారు. ఏడాది పాటు జరిగిన కార్యక్రమాలను సమాహారం చేస్తూ సావనీర్‌ను రూపొందిస్తున్నామన్నారు.

ఆనంద్ తోటకూర మాట్లాడుతూ.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రను చూసి ప్రభుత్వం భయపడుతోందని ఎద్దేవా చేశారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో లోకేష్ పాదయాత్రను కొనసాగిస్తున్నారన్నారు. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయం కావాలని ఆనంద్ తోటకూర ఆకాంక్షించారు. జాక్సన్ విల్లే ఎన్ఆర్ఐ టీడీపీ సౌత్ ఫ్లోరిడా ప్రాంత ప్రతినిధి అనిల్ యార్లగడ్డ మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి పిరికిపంద చర్య అనీ.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచి సంస్కృతి కాదని వ్యాఖ్యానించారు.

NTR-2.jpg

జాక్సన్ విల్లే ఎన్ఆర్ఐ టీడీపీ ఎగ్జిక్యూటివ్ కమిటీ కోశాధికారి సుమంత్ ఈదర మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రక అవసరం ఉందన్నారు. ఇందుకు ప్రవాసాంధ్రులు తమవంతు పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. సాయి బొల్లినేని మాట్లాడుతూ... ఎన్టీఆర్ అంటే వ్యక్తి కాదనీ.. ఒక శక్తి అనీ వ్యాఖ్యానించారు. ఆయన క్రమశిక్షణ ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కావాలన్నారు. సినీ, రాజకీయ రంగంలో ఎన్టీఆర్ సాధించిన విజయాలు మరెవరికీ సాధ్యం కావన్నారు. ఈ కార్యక్రమంలో కొలికపూడి శ్రీనివాసరావు, అడుసుమల్లి శ్రీనివాసరావు, సుచిత్ర యార్లగడ్డ, శ్రీలక్ష్మీ మన్నె, బాబు కొర్రపాటి, ఆనంద్ వక్కలగడ్డ తదితరులు ప్రసంగించారు.

జాక్సన్ విల్లే ఎన్ఆర్ఐ టీడీపీ సిటీ కౌన్సిల్ సభ్యులు గోపీకృష్ణ కుంట్ల, రాజేష్ మాదినేని, హరీష్ కుమార్ వీరవల్లి, అజయ్ చెరుకూరి, నాగేశ్వరరావు సూరే, గోపీ కడియాల, సుమన్ కాట్రగడ్డ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన కమిటీ సభ్యులతో మన్నవ సుబ్బారావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఓర్లాండో నుంచి రవికుమార్ రావి, ఈశ్వర్ కానుమూరి, మురళీ కృష్ణ రావి పాటు పెద్దఎత్తున ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారి అదితి తోటకూర పాటలు పాడి అందరినీ ఆకట్టుకున్నారు.

( ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి )

Updated Date - 2023-05-01T18:40:31+05:30 IST