Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అరెస్ట్.. విడుదల..
ABN , First Publish Date - 2023-08-25T07:35:32+05:30 IST
2020 నాటి అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఫలితాల్లో జోక్యం, కుట్ర తదితర కేసులలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గురువారం జార్జీయా (Georgia) లోని ఫుల్టన్ కౌంటీ జైలు వద్ద పోలీసులకు లొంగిపోయారు.
Donald Trump Arrest: 2020 నాటి అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఫలితాల్లో జోక్యం, కుట్ర తదితర కేసులలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గురువారం జార్జీయా (Georgia) లోని ఫుల్టన్ కౌంటీ జైలు వద్ద పోలీసులకు లొంగిపోయారు. ఈ సందర్భంగా పోలీసులు ట్రంప్ తాలూకు ప్రత్యేక ఫొటోను కూడా విడుదల చేశారు. ఆ తర్వాత 2లక్షల డాలర్ల బాండ్‌ను సమర్పించి బెయిల్ తీసుకున్నారు. దీనికి ఆయనకు అట్లాంటా ఫుల్టన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ఫాని విల్లీస్ అనుమతించారు. ఈ బెయిల్ ప్రక్రియ జరిగిన 20 నిమిషాల పాటు ట్రంప్ జైలులోనే ఉన్నారు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు.
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. "ఇక్కడ జరిగింది న్యాయాన్ని అపహాస్యం చేయడమే. నేనేమీ తప్పు చేయలేదు." అని అన్నారు. అలాగే "ఇది అమెరికాకు నిజంగా విచారకరమైన రోజు, ఇది ఎప్పటికీ జరగకూడదని" చెప్పుకొచ్చారు. అనంతరం ఆయన తన ప్రత్యేక విమానంలో న్యూజెర్సీ (New Jersey) లోని తన ఇంటికి వెళ్లిపోయారు. కాగా, జార్జీయా ఎన్నికల వివాదానికి సంబంధించి ఈ ఏడాదిలోనే ఆయన నాలుగు సార్లు అరెస్ట్ కావడం గమనార్హం. ఇక ఇంతకుముందు అరెస్ట్ అయిన సందర్భంలో కూడా ట్రంప్ తాను ఏ తప్పు చేయలేదని, ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని, డెమెుక్రట్స్ తనపై కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు.