Anupam Kher: ప్రకాష్ రాజ్ విమర్శలకు కౌంటర్.. అబద్ధం చెబుతూ జీవితం గడపాలనుకుంటే..
ABN , First Publish Date - 2023-02-18T15:15:28+05:30 IST
బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సినిమా ‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files). లో బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. కొన్ని రోజుల క్రితం నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఈ మూవీని తీవ్రంగా విమర్శించారు.
బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సినిమా ‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files). లో బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. కొన్ని రోజుల క్రితం నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఈ మూవీని తీవ్రంగా విమర్శించారు. ఈ విమర్శలపై తాజాగా నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher) స్పందించారు. ‘‘ప్రజలు తమ హోదాను బట్టి మాట్లాడుతుంటారు. కొంత మంది జీవితాంతం అబద్ధాలు చెబుతూనే ఉంటారు. మరి కొంత మంది మాత్రం ఎప్పుడు నిజాలే మాట్లాడుతారు. నా జీవితాంతం ఎప్పుడు నేను నిజాలే చెప్పాను. అబద్ధం చెబుతూ జీవితం గడపాలనుకుంటే అది వారిష్టం’’ అని అనుపమ్ ఖేర్ చెప్పారు.
కేరళలో జరిగిన ఓ ఈవెంట్‌లో ప్రకాష్ రాజ్ ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రంపై విమర్శలు గుప్పించారు. అదో చెత్త చిత్రం అని చెప్పారు. వివేక్ అగ్నిహోత్రి వంటి వారు దేశ ప్రజలను ప్రతిసారి పిచ్చోళ్లను చేయలేరని పేర్కొన్నారు. ‘‘...‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాను నిర్మించడం సిగ్గుచేటు. ఇంటర్నేషనల్ జ్యూరీ కూడా చిత్రంపై ఉమ్మేసింది. అయినప్పటికీ, ఆ సినిమా డైరెక్టర్ మాత్రం ఆస్కార్ తనకేందుకు రావడం లేదంటున్నారు. ఆయనకు ఆస్కార్ కాదు కదా భాస్కర్ అవార్డు కూడా రాదు. అటువంటివన్ని పనికి రాని చిత్రాలు’’ అని ప్రకాష్ రాజ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలకు ఆ సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి కూడా కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్‌ను అంధకార్ రాజ్ అని పేర్కొన్నారు.
కశ్మీరీ పండిట్స్‌పై 1990లో జరిగిన హత్యకాండను ఆధారంగా చేసుకుని ‘ది కశ్మీర్ ఫైల్స్’ ను రూపొందించారు. ఆ కాలంలో కశ్మీరీ పండిట్స్ ఎదుర్కొన్న ఇబ్బందులను సినిమాలో చూపించారు. ఈ మూవీలో దర్శన్ కుమార్, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) దర్శకత్వం వహించారు. అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి, వివేక్ అగ్నిహోత్రి, జీ స్టూడియోస్ కలసి ఐ యామ్ బుద్ధ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై నిర్మించాయి.