Viral Video: విమానాశ్రయంలో షాకింగ్ ఘటన.. లగేజీ బెల్ట్‌పై పొరపాటున ఎక్కిన పిల్లాడు.. చివరకు ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2023-11-24T15:46:57+05:30 IST
ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ చిన్నారి పొరపాటున వెళ్లి లగేజీ కన్వేయర్ బెల్ట్‌పైకి ఎక్కేశాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బెల్ట్‌ను ఆఫ్ చేసి చిన్నారిని కాపాడారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: చిన్నతనం అంటేనే తెలిసీతెలియనితనం..అల్లరి..! కొత్త విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం చిన్నారులను క్షణం కూడా కుదురుగా ఉండనీయదు. తమకు వింతగా అనిపించిన వాటివైపు బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెళ్లిపోతారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా లేకపోతే చివరకు ప్రమాదాల్లోనూ పడతారు. తల్లిదండ్రులు పిల్లలతో కలిసి రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే..ఊహించని ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ జనాలను హెచ్చరించే వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది (Child accidentally lands on conveyor belt). వీడియోలో చిన్నారి ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొన్నాడో చూసి నెటిజన్లు హడలిపోయారు.
ఎయిర్‌పోర్టులో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్‌గా(Viral Video) మారింది. నాలుగైదేళ్ల వయసున్న ఓ కుర్రాడు ఎయిర్‌పోర్టులో ఊహించని పని చేశాడు. తల్లిదండ్రులు లగేజీ చెక్ చేసుకుంటూ బిజీగా ఉన్న సమయంలో ఆ చిన్నారి..లగేజీని తరలించే కన్వేయర్ బెల్ట్‌పై ఎక్కేశాడు. ఆ తరువాత దానిపై అలాగే కూర్చుండిపోయాడు. దీంతో, అతడు వేర్‌హౌస్‌లోకి వెళ్లిపోయాడు.
అప్పటికే, అక్కడున్న సిబ్బంది బాలుడిని గమనించి కన్వేయర్ బెల్ట్ ఆపేశారు. ఆ తరువాత ఇద్దరు సిబ్బంది కన్వేయర్ బెల్ట్‌పైకి ఎక్కి బిడ్దను రక్షించారు. ఇక వీడియోను చూసిన నెటిజన్లు కూడా టెన్షన్ పడిపోయారు. బాలుడు సురక్షితంగా బయటపడటం చూసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. వీడియోకు కామెంట్స్ కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు వంటి జనసమ్మర్దం అధికంగా ఉన్న ప్రాంతాలకు పిల్లలతో కలిసి వెళ్లినప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అనేక మంది అభిప్రాయపడ్డారు.