Women's Day 2023 : చూపులేదని బాధపడలేదు.. ఆర్థిక ఇబ్బందులే వైకల్యాన్ని జయించేలా చేసాయి..!
ABN , First Publish Date - 2023-03-08T10:30:36+05:30 IST
సలీష్ చిన్నతనం అందరిలానే రంగురంగుల కలలతో మొదలైంది. అది తన పదవతరగతి వరకేనని ఊహించి ఉండదు.
పట్టుదల ఆమె వైకల్యాన్ని జయించేలా చేసింది. అన్నీ సవ్యంగా ఉన్నవాళ్ళే జీవితంలో నిలదొక్కుకుని ఓ స్థాయికి రావడానికి చాలా కష్టపడుతున్న సమయంలో ఆమె సంకల్పం అందరికీ స్పూర్తిగా నిలిచింది. ఆమె కథను తెలుసుకోవాలంటే తన చిన్ననాటి నుంచి మొదలు పెట్టాలి. త్రిస్సూర్ నివాసి గీతా సలీష్ చిన్నతనం అందరిలానే రంగురంగుల కలలతో మొదలైంది. అది తన పదవతరగతి వరకే నని ఆమె కూడా బహుశా ఊహించి ఉండదు. గీత సలీష్ పదో తరగతిలోకి వచ్చాకా అరుదైన జన్యుపరమైన వ్యాధి సోకే వరకూ అందరిలానే చాలా సంతోషంగా జీవితాన్ని గడిపేసింది. రెటినిటిస్ పిగ్మెంటోసా కారణంగా పూర్తిగా కంటి చూపును కోల్పోయింది గీత. అయినా ధైర్యాన్ని మాత్రం విడవలేదు.
ఇంత కఠినమైన జీవితాన్ని గడపడానికి సిద్ధపడిన గీతా సలీష్ తన 39 సంవత్సరాల వయస్సులో ఆన్‌లైన్ ఫుడ్ వెంచర్‌ను ఎలా నడిపింది అనేది ఆమె పట్టుదల గట్టిగా చెపుతుంది. అంధత్వం ఉన్నప్పటికీ, గీత చదువుపై ఆసక్తి కనబరిచింది, బ్రెయిలీ నేర్చుకుని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తన స్థితిని ప్రేమతో అర్థం చేసుకున్న సలీష్ కుమార్‌ను వివాహం చేసుకుంది. ఈ జంట నగరంలో ఒక చిన్న ఆర్గానిక్ రెస్టారెంట్‌ను కొద్దిరోజులు నడిపారు.
ఈ ఆర్గానిక్ రెస్టారెంట్‌లో కూరగాయలతో పాటు, సేంద్రీయ పదార్థాలతో తయారు చేసిన ఆహారాలను, పానీయాలను కూడా విక్రయిస్తారు. అయితే గీతా దంపతులు అద్దెకు తీసుకున్న స్థలాన్ని ఖాళీ చేయాల్సి వచ్చినపుడు మాత్రం గీత కొన్ని రోజులు వ్యాపారాన్ని పక్కన పెట్టి పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే గడిపింది. అయితే కొద్ది రోజుల్లోనే మరో పని వెతుక్కుందామని ఎంత ప్రయత్నించినా కూడా ఏదీ కలిసిరాలేదు. అలాంటి సమయంలోనే భర్త సలీష్ కుమార్ సొంత వ్యాపారం ఆలోచన చేశాడు.
ఇది కూడా చదవండి: చేనేత పరిశ్రమ అంతరించిపోకూడదనే ఉద్దేశంతోనే... ఇదంతా !
లాక్‌డౌన్ సమయంలో, 'ఆన్‌లైన్ వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకున్నప్పుడు మళ్ళీ మధ్యలో వదిలేసిన ఆహార వ్యాపారాన్నే ప్రారంభించాలని అనుకున్నారు. అలా 2020లో తన భర్తతో కలిసి ‘గీతాస్ హోమ్ టు హోమ్’ని ప్రారంభించారు. ఈ బ్రాండ్ ద్వారా ఇంట్లో తయారు చేసిన నెయ్యి, ఊరగాయలు వంటి ఉత్పత్తులను అందిస్తుంది. గీతాస్ హోమ్‌లో కుర్కు మీల్ అనేది ప్రత్యేకించి పసుపు, ఖర్జూరం, బాదం, కొబ్బరి పాలు, బెల్లం కలిపిన పేస్ట్ లాంటి మిశ్రమాన్ని మూడు సంవత్సరాల పాటు పరిశోధించిన తర్వాత తయారు చేశారు. ఇది పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ మంచిది. ఆరోగ్యకరమైనది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 500 గ్రాముల బాటిల్ ధర రూ. 600 కాశ్మీర్ నుండి కూడా ఆర్డర్లు అందుకుంటున్నారు. ఈ ప్రత్యేకమైన ఫుడ్ ప్రోడక్ట్ తోనే గీతాస్ హోమ్ మంచి ఆదరణ పొందింది.
ఈరోజు, గీత తమ వెబ్‌సైట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విక్రయించే ఈ ఉత్పత్తుల ద్వారా నెలకు దాదాపు రూ. 50,000 సంపాదిస్తూ, ఓ సక్సెస్ వ్యాపారవేత్తగా వైకల్యాన్ని జయించిన వ్యక్తిగా ఎందరో స్త్రీలకు ఆదర్శంగా నిలిచింది.