Viral: ఒక్క రోజులో రూ.24,281 కోట్ల సంపాదన.. ఒకప్పుడు అంబానీ కంటే ధనవంతుడైన ఆ వ్యక్తి ఎవరో తెలుసా..?
ABN , First Publish Date - 2023-08-19T19:57:37+05:30 IST
హిండెన్ బర్గ్ తుఫానును తట్టుకుని నిలబడిన పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మళ్లీ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. శుక్రవారం ఆయన నికర సంపద విలువ ఏకంగా రూ.24281 కోట్ల మేర పెరిగింది. ప్రపంచంలోని తొలి 20 మంది అత్యంత సంపన్నుల జాబితాలో ఆయనకు మళ్లీ స్థానం దక్కింది.
ఇంటర్నెట్ డెస్క్: కొద్ది కాలం క్రితం వరకూ భారతీయ అపరకుబేరుల్లో ఆయన పేరు మారుమోగిపోయింది. దేశంలోనే రెండో అత్యంత సంపన్నుడిగా వెలుగొందారు. కానీ, ఆ తరువాత ఊహించని ఉపద్రవం ఎదురైంది. మార్కెట్లో వెల్లువెత్తిన ఆరోపణలు ఆయన పరపతిని అమాంతం దిగజార్చాయి. కానీ, ఆ తుఫానును ఆయన తట్టుకుని నిలబడ్డారు. పరిస్థితులకు ఎదురీది మళ్లీ విజయం సాధించారు. శుక్రవారం ఆయన నికర సంపద ఏకంగా రూ.24281 కోట్ల మేర పెరిగింది(Networth increased by Rs 24281 crores). ఈ వ్యక్తి ఎవరో చూచాయిగా పాఠకులకు ఈపాటికి తెలిసే ఉండాలి. ఆయననే అదానీ సంస్థల అధినేత గౌతమ్ అదానీ(Gautam Adani).
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం శుక్రవారం అదానీ నికర సంపద ఏకంగా 2.92 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. ఫలితంగా, ప్రపంచంలోని తొలి 20 మంది అత్యంత సంపన్నుల్లో ఆయన చోటుదక్కించుకున్నారు(Adani in Worlds top 20 billionaires list). టాప్ 10 స్థానాల్లోని అపరకుబేరుల సంపదలో క్షీణత నమోదైతే అదానీ మాత్రం లాభాలు గడించడం గమనార్హం.
మార్కెట్ నిపుణుల ప్రకారం, శుక్రవారం అదానీ సంస్థల నికర విలువ రూ.11 లక్షల కోట్లకు చేరుకుంది. ఫిబ్రవరి తరువాత ఆ కంపెనీల విలువ ఇంతలా పెరగడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో అదానీ వ్యక్తిగత సంపద కూడా 63.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారత్, ఆసియా ఖండాల్లో రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ తరువాతి స్థానం గౌతమ్ అదానీదే!
కొన్ని నెలల క్రితం గౌతమ్ అదానీ ప్రపంచంలోని రెండో అత్యంత సంపన్నుడిగా నిలిచి రికార్డు సృష్టించారు. ముఖేశ్ అంబానీని వెనక్కు నెట్టి మరీ ఈస్థానం కైవసం చేసుకున్నారు. కానీ జనవరి 24 హిండెన్ బర్గ్ నివేదిక ఆయనకు ఊహించని షాకిచ్చింది. అదానీ సంస్థల్లో షేర్ల ధరల్లో అవకతవకలు, ఆర్థికలావాదేవీల్లో అక్రమాలు జరుగుతున్నాయని హిండెన్ బర్గ్ సంచలన ఆరోపణణ చేసింది. ఫలితంగా ఆయన తన నికర మార్కెట్ విలువలో ఏకంగా 56.7 బిలియన్ డాలర్లు కోల్పోవాల్సి వచ్చింది. కానీ, నాటి క్లిష్ఠ పరిస్థితుల నుంచి క్రమంగా కోలుకుంటున్న అదానీ మళ్లీ తన పరుగు ప్రారంభించారు.
గౌతమ్ ఆదానీ సారథ్యంలోని అదానీ గ్రూప్ ఎయిర్‌పోర్టులు, విద్యుత్ ఉత్పత్తి, హరిత వనరుల అభివృద్ధికి సంబంధించిన రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 1988లో ఓ కమోడిటీస్ ట్రేడింగ్ సంస్థగా అదానీ గ్రూప్ ప్రయాణం ప్రారంభమైంది. నాటి నుంచి అదానీ గ్రూప్ గౌతమ్ అదానీ సారథ్యంలో కొత్త కొత్త రంగాలకు విస్తరిస్తూ వేగంగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ముంద్రా పోర్టు నిర్వహణ అదానీ గ్రూప్ చేతుల్లోనే ఉంది. అంతేకాకుండా, అదానీ గ్రూప్ దేశంలోనే రెండో అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారు. ఇక పునరుత్పాదక ఇంధన రంగంలో 70 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టే దిశగా అదానీ వడివడిగా అడుగులు వేస్తున్నారు.