Health Tips: చలికాలంలో వచ్చే సమస్యే ఇది.. అరటిపండ్లతో ఇలా చేయండి చాలు.. కాళ్లకు పగుళ్లు ఉంటే మటాష్..!
ABN , First Publish Date - 2023-10-31T16:02:45+05:30 IST
పాదాలు పగిలినప్పుడు అడుగు తీసి అడుగు వెయ్యాలంటేనే నరకం కనిపిస్తుంది. కానీ ఈ చలికాలంలో పాదాల పగుళ్లు మాయం చేయడానికి అరటిపండ్లు భలే ఉపయోగపడతాయి.
చలికాలం కేవలం చలినే కాదు బోలెడు చర్మసంబంధ సమస్యలను కూడా వెంటబెట్టుకొస్తుంది. కాళ్లు చేతుల చర్మం పగలడం, పెదవుల పగుళ్లు, పెదవుల మూలలు చీలడం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కాలి పాదాలు మరొక ఎత్తు. శరీరంలో బయటకు బహిర్గతం అయ్యే ప్రాంతం కాళ్లే. ఈ కారణంగా కాళ్లు చలికాలంలో చాలా దారుణంగా ప్రభావితం అవుతాయి. కాలి మడమలు పొడిగా మారిపోవడం, చీలడం, కొన్ని సార్లు రక్తం రావడం కూడా జరుగుతుంది. ఇలాంటి సమయాల్లో అడుగు తీసి అడుగు వెయ్యాలంటేనే నరకం కనిపిస్తుంది. కానీ ఈ చలికాలంలో పాదాల పగుళ్లు మాయం చేయడానికి అరటిపండ్లు భలే ఉపయోగపడతాయి. కేవలం అరటిపండ్లే కాదు ఇంట్లోనే ఉండే పదార్థాలను ఉపయోగించి పాదాల పగుళ్లు(cracked heals) ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుంటే..
అరటిపండ్ల(Banana)లో విటమిన్ -ఎ, విటమిన్-బి6, విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికే కాదు చర్మ ఆరోగ్యానకి కూడా చక్కగా ఉపయోగపడతాయి. పొడిబారిన చర్మానికి జీవాన్ని ఇచ్చి తిరిగి తేమగా మారుస్తాయి. రెండు అరటిపండ్లు తీసుకుని మెత్తని పేస్ట్ చేయాలి. ఈ అరటిపండ్ల గుజ్జును పగిలిన పాదాల మీద అప్లై చేయాలి. 20 నిమిషాల సేపు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రమైన నీటితో కడిగేయాలి. దీన్ని క్రమం తప్పకుండా చేస్తూంటే కొన్ని రోజుల్లోనే పాదాల పగుళ్ళు పోయి పాదాలు నాజూగ్గా మారతాయి.
Hair Health: తలదువ్విన ప్రతీసారి ఇంతింత జుట్టు రాలుతోందా..? కొబ్బరి నూనెనే వాడండి కానీ..!
పాదాల పగుళ్ళు తగ్గించుకోవడానికి కేవలం అరటిపండు మాత్రమే కాదు..ఇంకా ఇతర పదార్థాలు కూడా ఉపయోగించవచ్చు.
పగిలిన మడమల మీద తేనెను(honey) అప్లై చేస్తే పగుళ్లు చాలా తొందరగా మాయమవుతాయి. తేనె చర్మానికి తేమను అందించడం వల్ల పగుళ్ళను తగ్గించగలుగుతుంది.
వేడినీటిలో కొద్దిగా వెనిగర్(vinegar) వేయాలి. ఈ నీటిలో పాదాలను నానబెట్టాలి. దీనివల్ల పగిలిన పాదాల చర్మం తిరిగి సాధారణంగా మారుతుంది.
ఆలివ్ నూనె(Olive oil) పాదాల పగుళ్ళకు ప్రభావవంతంగానే పనిచేస్తుంది. ఆలివ్ నూనెను పాదాలు పగిలిన ప్రాంతంలో రాసి బాగా రుద్దాలి. ఈ నూనె చర్మాన్ని రిపేర్ చేస్తుంది. పగుళ్లు తగ్గిస్తుంది.
కేవలం చలికాలంలో కాకుండా చాలా రోజులనుండి పగుళ్లు వేధిస్తున్నట్టైతే పాదాలకు రాత్రి పడుకునే ముందు పాదాలను నీటితో శుభ్రం చేసుకోవాలి. తరువాత పాదాలకు గోరువెచ్చని నూనె రాయాలి. పాదాలు బయటి వాతావరణానికి గురికాకుండా సాక్సులు ధరించాలి. ఇలా చేస్తే పాదాల పగుళ్లు తొందరగా తగ్గుతాయి.