Linkage of rivers: నదుల అనుసంధానం నెరవేరేనా?.. తమిళనాడులో ఇంత జరిగిందా?

ABN , First Publish Date - 2023-03-06T22:10:19+05:30 IST

దేశంలో నదుల అనుసంధానం డిమాండ్‌‌కు కారణం ఏమిటి?. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ప్రతిపాదనకు మూలం ఎక్కడ?. అనే ఆసక్తికర అంశాలను ఒకసారి పరిశీలిద్దాం..

Linkage of rivers: నదుల అనుసంధానం నెరవేరేనా?.. తమిళనాడులో ఇంత జరిగిందా?

ప్పుడప్పుడు వార్తల్లో నిలిచి కనుమరుగయ్యే ‘నదుల అనుసంధానం’ (Linkage of rivers) అంశం మరోసారి సీరియస్‌‌గా తెరపైకి వచ్చింది. దక్షిణాది రాష్ట్రాల్లో కీలకమైన గోదావరి - కావేరి నదుల (Godavari-Kaveri Rivers) అనుసంధానానికి నిర్ణయించిన కేంద్రం.. అందుకయ్యే ఖర్చులో 75 శాతాన్ని రాష్ట్రాలపైనే మోపాలని యోచిస్తోందనే రిపోర్టులు.. ఈ మేరకు రాష్ట్రాల సమ్మతి కోసం ఎన్‌డబ్ల్యూడీఏకు (National Water Development Agency) చెందిన నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్‌ భేటీ ఈ చర్చకు కారణమయ్యాయి. అత్యంత ముఖ్యమైన ఈ సమావేశంలో రాష్ట్రాల వైఖరి ఏవిధంగా ఉండబోతోందనే విషయం పక్కనపెడితే.. నదుల అనుసంధానానికి సంబంధించిన క్రియాశీలకమైన అడుగుగా దీనిని పరిగణించాల్సి ఉంటుందనే వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో నదుల అనుసంధానం ప్రతిపాదన ఎప్పటి నుంచి ఉంది?, దీనికి కారణాలు ఏమిటి?. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ప్రతిపాదనకు మూలం ఎక్కడ?. అనే ఆసక్తికర అంశాలను ఒకసారి పరిశీలిద్దాం..

150 ఏళ్లుగా నలుగుతున్న అంశం...

దేశంలో నదుల అనుసంధానం ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. దాదాపు 150 ఏళ్లుగా ఈ ప్రతిపాదన వినిపిస్తూనే ఉంది. అంతరాష్ట్ర జలరవాణా మెరుగుదలకు దక్షిణ భారతంలోని నదులన్నింటినీ అనుసంధానిస్తే బావుంటుందని తొలిసారి 19వ శతాబ్ధం చివరిలో నాటి మద్రాసు ప్రెసిడెన్సీ ఇంజినీర్ సర్ ఆర్థర్ కాటన్‌ భావించారని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత నదీ జలాల పరిష్కారం, నేలకోత నివారణ, పర్యాటక అభివృద్ధి వంటి డిమాండ్ల దృష్ట్యా జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వంలో (Jawaharlal Nehru) జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన కేఎల్ రావు 1972లో గంగా-కావేరీ (Ganga-kaveri) అనుసంధాన ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.

తదానంతరం పలు ప్రతిపాదనలు, పరిణామాల నేపథ్యంలో నదుల అనుసంధానం సాధ్యాసాధ్యాలపై పరిశీలనకు 1982లో జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యుడీఏ) ఏర్పాటయ్యింది. 1999లో ఒక జాతీయ కమిషన్‌ ఏర్పాటైంది. ద్వీపకల్పంలో నదీజలాల బదిలీ చేపట్టాల్సిన అవసరం లేదని, హిమాలయ ప్రాంతంలో నదుల అనుసంధానానికి సంబంధించి మరింత లోతుగా అధ్యయనం జరపాల్సి ఉంటుందని కమిషన్ అభిప్రాయపడింది. ఇక నదుల అనుసంధానంపై మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి ఆసక్తి కనబరిచారు. సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం కేంద్ర విద్యుత్ మంత్రి సురేశ్ ప్రభు సారథ్యంలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. అయితే 2004లో ఎన్‌డీఏ గద్దె దిగి యూపీఏ అధికారంలోకి రావడంతో నదుల అనుసంధానం అటకెక్కింది.

Untitled-5.jpg

దక్షిణాదిలో తమిళనాడు డిమాండ్..!

నదుల అనుసంధానంతో అంతర్రాష్ట్ర నదీజలాల సమస్యలు పరిష్కారం అవుతాయనేది ప్రధాన వాదన. ఈ భావనను దక్షిణాదిలో తమిళనాడు (Tamilanadu) ఎక్కువగా విశ్వసిస్తోంది. కావేరీ నదీ (Kaveri river) జలాల పంపకం విషయంలో కర్ణాటకతో (Karnataka) సుధీర్ఘ వివాదం దృష్ట్యా నదుల అనుసంధానమే పరిష్కార మార్గమని తమిళనాడు మేధావి వర్గాలు భావిస్తున్నాయి. కొన్ని ముఖ్యమైన పరిణామాలు ఈ ఆలోచనకు బీజం వేశాయని చెప్పొచ్చు.

ముఖ్యంగా కావేరి నదీ జలాల పంపిణీ విషయంలో ‘కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్’ తీర్పును అమలు పరచాల్సిందేనంటూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత (Jaya Lalitha) స్వయంగా ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా ఆమె నిరసన తెలిపారు. మరోవైపు సూపర్‌స్టార్ రజనీకాంత్‌‌‌ కూడా నదీ జలాల వివాద సెగను ఎదుర్కోవాల్సి వచ్చింది. తన సొంత రాష్ట్రమైన కర్ణాటకతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలనే డిమాండ్లు తమిళనాడులో బలంగా వినిపించాయి. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యను తానెలా తీర్చగలని భావించిన రజనీకాంత్ (RajaniKanth).. తమిళనాడుకు మద్దతుగా, కావేరి నదీ జలాల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ 2002లో నిరాహార దీక్ష చేశారు. 9 గంటల అనంతరం విరమించారు. ఇలా అనేక పరిణామాలు నదీ జలాల విషయంలో తమిళనాడు అన్యాయం జరుగుతోందనే వాదన అక్కడ మేధావి వర్గాల్లో బలపడింది. నదుల అనుసంధానమే ఈ సమస్యకు పరిష్కార మార్గమనే భావన ఏర్పడింది. అందుకే దక్షిణాదిలో నదుల అనుసంధానం డిమాండ్‌కు తమిళనాడే ప్రధాన కారణమనే అభిప్రాయాలున్నాయి.

Untitled-6.jpg

ఏ నాటికి జరుగునో!

దేశంలో నదుల అనుసంధానం డిమాండ్ దశాబ్దాలుగా బలంగా వినిపిస్తున్నా.. ఆ దిశగా ఇప్పటికీ చెప్పుకోదగ్గ అడుగులేమీ పడలేదు. ప్రతిపాదనలు, ప్రణాళికలకే పరిమితమవుతున్నాయి. అంతకుమించి ముందుకెళ్లకపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఒక రాష్ట్రానికి సమ్మతమైతే మరో రాష్ట్రం వ్యతిరేకించడం, న్యాయపరమైన చిక్కులు ముందడుగు పడకుండా చేస్తున్నాయి.

మరోవైపు నదుల అనుసంధానం ఆర్థిక వనరులతో ముడిపడి అంశం కావడం మరో ముఖ్య కారణంగా ఉంది. చిన్నాచితకా ప్రాజెక్టులకే వేల, లక్షల కోట్ల రూపాయలు ఖర్చువుతున్న పరిస్థితులు చూస్తుంటే నదుల అనుసంధానం అంత సులువు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా వెలువడిన రిపోర్టులే ఇందుకు ఉదాహరణగా పేర్కొనొచ్చు. గోదావరి - కావేరి నదుల అనుసంధానం మొదటి విడత ఖర్చులో 75 శాతం వాటాను రాష్ట్రాలే భరించాలే కేంద్రం ప్రతిపాదించనుందనే రిపోర్టులు వెలువడ్డాయి. ఒకవేళ ఇదే నిజమైతే నదుల అనుసంధానం ప్రణాళికలకే పరిమితమయ్యినా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే రాష్ట్రాలన్నీ అప్పుల కోసం కేంద్రం వద్ద చేతులు చాస్తున్న పరిస్థితులు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. ఇక నదుల అనుసంధానానికి ఎంత వరకు ఖర్చు పెట్టగలవో ఊహించవచ్చు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టుకు సుమారు లక్షన్నర కోట్ల మేర ఖర్చయ్యిందని లెక్కలు చెబుతున్నాయి. దీనిని బట్టి నదుల అనుసంధానానికి అయ్యే ఖర్చు ఏ స్థాయిలో ఉంటుందో, దాంట్లో అధిక భాగం రాష్ట్రాలే భరించడమనేది ఎంతవరకు సాధ్యమో ఇట్టే ఊహించవచ్చు.

Updated Date - 2023-03-06T22:15:38+05:30 IST