Tree: ఈ చెట్టు నడుస్తుంది
ABN , First Publish Date - 2023-03-05T10:35:58+05:30 IST
‘చెట్టు నడుస్తుంది’ అని అంటే ఎవరైనా సరే వింతగానే చూస్తారు. కానీ ‘సోక్రటియ ఎక్సోరియా’ చెట్టును చూస్తే మాత్రం నమ్మాల్సిందే. దీన్ని ‘వాకింగ్ పామ్’ అని కూడా పిలుస్తారు...

‘చెట్టు నడుస్తుంది’ అని అంటే ఎవరైనా సరే వింతగానే చూస్తారు. కానీ ‘సోక్రటియ ఎక్సోరియా’ చెట్టును చూస్తే మాత్రం నమ్మాల్సిందే. దీన్ని ‘వాకింగ్ పామ్’ అని కూడా పిలుస్తారు. ‘ఈ పామ్ ట్రీ ఎలా నడవగలుగుతుంది’ అంటే కాళ్ల లాంటి వేర్ల సహాయంతో. మర్రిచెట్టు ఊడల్లా పామ్ ట్రీ వేర్లు ఉంటాయి. మొక్కజొన్నకు భూమి ఉపరితలం పై కొన్ని వేర్లు వస్తాయి కదా! అలా ఈ పామ్ ట్రీకి వేర్లు ఉంటాయి. ఈ వేర్ల సహాయంతో మొక్క సూర్యరశ్మి వచ్చే వైపు నెమ్మదిగా కదులుతుంది. నడిచే క్రమంలో వెనక వైపు వేరు పైకి లేస్తుంది. తరువాత ఆ వేరు ఎండి రాలిపోతుంది. అదే సమయంలో ముందుకు కదిలే దిక్కులో కొత్త వేర్లు పుట్టుకొస్తుంటాయి. ఈ ప్రక్రియ రోజూ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వేర్లే చెట్టు కాళ్లలా నడిచేందుకు సహాయపడుతుంటాయి.
మధ్య అమెరికా, దక్షిణ అమెరికాలోని అడవుల్లో ఈ పామ్ ట్రీ కనిపిస్తుంది. రోజులో రెండు నుంచి మూడు సెంటీమీటర్ల మేర ఈ చెట్టు నడుస్తుంది. అయితే పామ్ ట్రీ నడవడం అనేది అబద్ధం అని దానిపై లోతైన అధ్యయనం చేసిన పరిశోధకులు అంటున్నారు. పామ్ ట్రీ ప్రధాన వేరు ఉన్న చోటే ఉంటోందని, పక్కనున్న వేర్లే ఒకవైపు ఎండిపోవడం, మరోవైపు కొత్తవి రావడం వల్ల కదులు తున్నట్లు భావిస్తుంటారని అంటున్నారు. పర్యాటకులను ఆకర్షించడం కోసం టూరిస్ట్ గైడ్‌లు వాకింగ్ పామ్‌ల గురించి కాస్త అతిగా ప్రచారం చేస్తున్నారనే వాళ్లు కూడా ఉన్నారు. ఏమైనా నడిచే చెట్టుగా ఈ పామ్ ట్రీ వార్తల్లో నిలుస్తోంది.