TATA IPL 2023: దారుణంగా పడిపోతున్న టీవీ ప్రకటనలు!
ABN , First Publish Date - 2023-04-28T20:26:00+05:30 IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)కు ఉన్న క్రేజే వేరు. మ్యాచ్ స్టార్ట్ కావడానికి ముందే
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)కు ఉన్న క్రేజే వేరు. మ్యాచ్ స్టార్ట్ కావడానికి ముందే అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు. దీనిని క్యాష్ చేసుకునేందుకు వ్యాపార సంస్థలు పోటీ పడుతుంటాయి. ప్రకటనల కోసం బారులు తీరుతాయి. అయితే, ఈసారి మాత్రం ప్రకటనదారులు (Advertisers) వెనక్కి తగ్గుతున్నట్టు బార్క్ (BARC) తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఈ సీజన్‌లో తొలి 29 మ్యాచ్‌లతో పోలిస్తే ఇప్పుడు టీవీలో వచ్చే ప్రకటనలు 42 శాతం తగ్గిపోయాయి. ఈసారి ఐపీఎల్ ఇప్పటి వరకు టీవీల్లో 47 ప్రకటనదారులను మాత్రమే ఆకర్షించగలిగింది. గత సీజన్‌లో ఈ సంఖ్య 81గా ఉంది.
ఐపీఎల్ సందర్భంగా గతేడాది టీవీల్లో ప్రకటనలు ఇచ్చిన వారు ఈసారి మాత్రం ఆ ఊసే ఎత్తకపోవడం గమనార్హం. బ్రాండ్లు, కేటగిరీల వారీగా కూడా ఈసారి టీవీ ప్రకటనలు తగ్గిపోయాయి. ఈ సీజన్‌లో 37 కేటగిరీల్లో మాత్రమే టీవీ ప్రకటనలు కనిపిస్తున్నాయి. గతేడాది తొలి 19 మ్యాచుల్లో 57 కేటగిరీల్లో టీవీ ప్రకటనలు వచ్చాయి. అంటే ఈసారి 35 శాతం తగ్గిపోయాయి.
గతేడాది ఐపీఎల్‌లో 136 బ్రాండ్లు ప్రకటనల్లో కనిపించగా, ఈసారి 86 బ్రాండ్లు మాత్రమే ప్రకటనలకు ఆసక్తి చూపాయి. అంటే ఈసారి 36 శాతం బ్రాండ్లు ప్రకటనలు విరమించుకున్నాయి. గతేడాది టీవీలో సందడి చేసిన బ్రాండ్లు ఈసారి కనిపించలేదు. అంతేకాదు, టీవీలో ఐపీఎల్‌ను వీక్షించే వారి సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. అదే సమయంలో డిజిటల్ వ్యూయర్‌షిప్ మాత్రం రికార్డులు బద్దలుగొడుతోంది. చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య గత వారం జరిగిన మ్యాచ్ సందర్భంగా జియో సినిమాలో వ్యూయర్‌షిప్ 2.4 కోట్లు దాటిపోయింది.