IPL 2023: ‘ఇంపాక్ట్ ప్లేయర్..’ ఐపీఎల్ లో మిగతా మార్పులూ పెద్ద ఇంపాక్టే

ABN , First Publish Date - 2023-04-01T19:28:05+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) పదహారో సీజన్ ఘనంగా ప్రారంభమైంది. 15 సీజన్లు దిగ్విజయంగా ముగిసిన ఈ లీగ్ లో నిరుటి కంటే మిన్నగా అన్నట్లు

IPL 2023: ‘ఇంపాక్ట్ ప్లేయర్..’ ఐపీఎల్ లో మిగతా మార్పులూ పెద్ద ఇంపాక్టే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) పదహారో సీజన్ ఘనంగా ప్రారంభమైంది. 15 సీజన్లు దిగ్విజయంగా ముగిసిన ఈ లీగ్ లో నిరుటి కంటే మిన్నగా అన్నట్లు ఈ ఏడాది చాలా మార్పులు జరిగాయి. వాటిలో ప్రధానమైనది ‘ఇంపాక్ట్ ప్లేయర్’(Impact Player). అయితే, వినడానికి కొత్తగా ఉన్నప్పటికీ ఇదేమీ కొత్త విధానమేమీ కాదు. ఇదే తరహాలో 2005లోనే వన్డేల్లో ఈ విధానం అమలు చేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC). అప్పట్లో దాని పేరు ‘సూపర్ సబ్ స్టిట్యూట్’. విశేషమేమంటే.. భారత తొలి సూపర్ సబ్ స్టిట్యూట్ తెలుగు వాడైన బ్యాట్స్ మన్ వై.వేణుగోపాలరావు. ఈ విశాఖపట్టణం కుర్రాడు అప్పట్లో టీమిండియాకు కొన్ని మ్యాచ్ ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఇంకో విశేషం ఏమంటే.. ప్రపంచ క్రికెట్ లో తొలి సూపర్ సబ్‌స్టిట్యూట్ ఆటగాడు భారత సంతతికి చెందిన విక్రమ్ సోలంకి (Vikram Solanki). ఇంగ్లండ్ కు కొన్ని మ్యాచ్ ల్లో ఇతడు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సూపర్ సబ్‌స్టిట్యూట్ విధానం పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఏడాది వ్యవధిలోనే దానిని

ఐసీసీ ఉపసంహరించుకుంది. ఇప్పుడా విధానాన్ని టి20లకు తగినట్లుగా మార్చి‘ఇంపాక్ట్ ప్లేయర్’ పేరిట తీసుకొచ్చారు.

ఈ మార్పులూ..

టెస్టు క్రికెట్ లో ‘వైడ్ బాల్’ ప్రకటనలో కాస్త బౌలర్ పక్షపాతం ఉంటుంది. క్రీజుకు చాలా దూరంలో వెళ్తేనే గాని వైడ్ ఇవ్వరు. కానీ, వన్డే, టి20ల్లో అలా కాదు. బ్యాట్స్ మన్‌కు ఆన్ సైడ్ కొద్దిగా దూరంగా వెళ్లినా, ఆఫ్ సైడ్ ఇంకాస్త దూరంగా బంతి పడినా వైడ్ ప్రకటిస్తారు. నో బాల్ ప్రకటన ఎక్కడైనా ఒకటే అనుకున్నా.. పరిమిత ఓవర్ల క్రికెట్ లో మరీ ముఖ్యంగా టి20ల్లో ‘‘నో బాల్’’ ఎంత కీలకమో చెప్పేందుకు అనేక ఉదాహరణలున్నాయి. ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో వైడ్‌, నో బాల్‌ విషయంలో అంపైర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేసే అవకాశం కల్పించారు. ఉదాహరణకు.. బౌలర్ ఒక ఓవర్ లో రెండో బౌన్సర్ వేసినా, బంతి వైడ్ వెళ్లినట్లు అనిపించినా బ్యాట్స్ మన్ రివ్యూ కోరవచ్చు.

గుజరాత్ కు లాభం.. చెన్నైకి చేదు

చైన్నై పేసర్ తుషార్ దేశ్ పాండే, గుజరాత్ బ్యాట్స్ మన్‌సాయి సుదర్శన్ వీరిద్దరూ ఐపీఎల్ లో ‘‘తొలి ఇంపాక్ట్ ప్లేయర్లు’’గా చరిత్రలో నిలిచిపోనున్నారు. శుక్రవారం అహ్మదాబాద్ లో జరిగిన సీజన్ తొలి మ్యాచ్ లో వీరిని ఇంపాక్ట్ ప్లేయర్లుగా

వాడుకున్నాయి. వీరిద్దరిలోనూ దేశ్‌పాండే తొలి ఇంపాక్ట్‌ ప్లేయర్‌. దీనికి పరోక్షంగా తెలుగు ఆటగాడు అంబటి రాయుడే కారణం. చెన్నై ఇన్నింగ్ అనంతరం.. గుజరాత్‌ ఇన్నింగ్స్‌ కు ముందు రాయుడు స్థానంలో తుషార్‌ వచ్చాడు. రెండో ఓవర్లోనే బౌలింగ్‌ కు

దిగాడు. బ్యాటింగ్‌లో రాయుడు 12 పరుగులు చేశాడు. కానీ, దేశ్ పాండే ఎంపిక తప్పయింది. అతడు 3.2 ఓవర్లలోనే 51 పరుగులిచ్చాడు. హోరాహోరీ మ్యాచ్ లో మిగతా బౌలర్లంతా కట్టుదిట్టంగా బంతులేసినా.. గుజరాత్ బ్యాట్స్ మన్ దేశ్ పాండేను టార్గెట్ చేసుకుని పరుగులు పిండుకున్నారు. కాగా, గుజరాత్‌ కూడా ఇంపాక్ట్‌ ప్లేయర్‌ విధానాన్ని వాడుకుంది. ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడ్డ న్యూజిలాండ్ బ్యాట్స్మన్ కేన్ విలియమ్సన్‌ స్థానంలో తమిళనాడుకు చెందిన ఎడమ చేతి వాటం బ్యాట్స్ మన్ సాయి

సుదర్శన్‌ నుదింపింది. కాగా, కీపర్ సాహా ఔటైన తర్వాత వచ్చిన సాయి (17 బంతుల్లో 22, 3 ఫోర్లు).. మరో ఓపెనర్ శుబ్ మన్ గిల్ తో చక్కటి భాగస్వామ్యం నెలకొల్పాడు. మ్యాచ్ లో ఈ నిర్ణయమే ఫలితాన్ని నిర్దేశించింది అనడంలో సందేహం లేదు.

ఇదే తేడా?

ఇంపాక్ట్ ప్లేయర్ విధానంలో భాగంగా మ్యాచ్‌ ప్రారంభానికి ముందే తుది జట్టు (11 మంది)తో పాటు ఐదుగురు సబ్‌ స్టిట్యూట్‌లను ప్రకటించాలి. వీరి నుంచి ఒకరిని ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఎంచుకోవచ్చు. ఇక్కడే సబ్ స్టిట్యూట్ విధానానికి ఇంపాక్ట్

ప్లేయర్ పద్ధతికి తేడా ఉంది. సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డింగ్‌ మాత్రమే చేస్తాడు. జట్టులో 10 మంది మాత్రమే బ్యాటింగ్‌ కు వచ్చే వీలుంటుంది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ గా మాత్రం మరో బ్యాటర్‌ను తీసుకునే అవకాశం దక్కింది. గుజరాత్ విలియమ్సన్ స్థానంలో

సుదర్శన్ ను తీసుకోగా, రాయుడు బౌలింగ్ చేయడు కాబట్టి.. పనికొస్తాడని భావించి దేశ్ పాండేను ఎంపిక చేసుకుంది చెన్నై. ఇక గుజరాత్‌ ఇన్నింగ్స్‌ 14వ ఓవర్లో శుభ్‌మన్‌ గిల్ నోబ్‌ కోసం, 18వ ఓవర్లో వైడ్‌ కోసం విజయ్‌ శంకర్‌ రివ్యూలు కోరారు. ఈ రెండూ వృథా వారు కోరుకున్న ఫలితం ఇవ్వలేదు.

ఈసారి ఈ మార్పులూ కీలకమే..

ఈ సారి లీగ్ లో కొత్తగా వచ్చిన మరో మార్పు.. టాస్ తర్వాత తుది జట్టులో మార్పు. ఆఖరుగా మనసు మారడమో, పిచ్ పై అంచనా మారడమో జరిగితే ఈ విధానంలో ఆటగాడిని మార్చుకునే అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. తొలి మ్యాచ్ లో దీనిని

ఇరు జట్లూ ఉపయోగించుకోలేదు. కాగా, 2000లో కొవిడ్ నేపథ్యంలో లీగ్ అంతా యూఏఈలో జరిగింది. 2021లో సెకండ్ వేవ్ నేపథ్యంలో సగం భారత్ లో, సగం యూఏఈలో జరిగాయి. పది జట్లతో 2022లో పూర్తిస్థాయిలో మనదేశమే ఆతిథ్యం ఇచ్చినా.. కేవలం 6 వేదికల్లోనే మ్యాచ్ లు జరిగాయి. ఈసారి మాత్రం 12 స్టేడియాల్లో మ్యాచ్ లు జరగబోతున్నాయి. ఇంకో విశేషం ఏమంటే.. ఈసారి ఇంటా బయటా మ్యాచ్‌లు. గతంలోనూ ఇలాగే జరిగినా 2019 తర్వాత కొవిడ్ ప్రభావంతో ఆపేశారు. తాజాగా ప్రతి జట్టుకు సొంతగడ్డపై ఆడే చాన్స్ రానుంది.

గ్రూప్ లు మారాయి

లీగ్ లో 10 జట్లను ఈసారి ఏ, బీ గ్రూప్ లుగా విభజించారు అంటే ఒక జట్టు.. తమ గ్రూప్ లోని మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అటువైపు గ్రూప్ లోని జట్టుతో రెండు మ్యాచ్ లు ఆడుతుంది. మొత్తమ్మీద 14 మ్యాచ్ లు అన్నమాట. సమీకరణాల ప్రకారం చూసినా.. పోటీ ప్రకారం లెక్కేసినా ఇది కూడా ప్రభావవంతమైన మార్పే.

అనవసరంగా కదిలారో 5 పరుగులు ఉఫ్

ఈసారి టోర్నీలో ఫీల్డింగ్ జట్టు ఒళ్లు దగ్గరపెట్టుకోవాల్సిన నిబంధన ఇది. బౌలర్ బంతి వేసేటప్పుడు వికెట్ కీపర్ కానీ, ఫీల్డర్ కానీ వేరే ఉద్దేశంలో కదిలారో.. ఫీల్డింగ్ జట్టుకు 5 పెనాల్టీ పాయింట్లు పడతాయి. అంతేకాదు.. ఆ బంతిని డెడ్ గానూ ప్రకటిస్తారు.

ఇక నిర్ణీత సమయంలోగా ఓవర్లను పూర్తి చేయకున్నా శిక్షనే. ఇలాంటప్పుడు సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లను బదులు.. నలుగురిని మాత్రమే ఉంచేందుకు అనుమతిస్తారు. అసలే టి20..అందులోనూ బ్యాటింగ్ స్వర్గధామాలైన భారత పిచ్ లు. ఇలాంటప్పుడు ఓవర్ల కోటా పూర్తి చేయలేక.. సర్కిల్ బయట నలుగురే ఫీల్డర్లను ఉంచే పరిస్థితి వస్తే ఆ జట్టు సంకటంలో పడినట్లే.

Updated Date - 2023-04-01T19:28:14+05:30 IST