IPL 2023: చెన్నై సూపర్ కింగ్స్ తర్వాతి కెప్టెన్ ఎవరో చెప్పేసిన టీమిండియా మాజీ క్రికెటర్
ABN , First Publish Date - 2023-04-04T16:38:26+05:30 IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2023) లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) ఓ
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2023) లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) చెలరేగుతున్నాడు. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో చెలరేగిపోయిన గైక్వాడ్ 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 92 పరుగులు చేశాడు. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్(LSG)తో జరిగిన మ్యాచ్‌లో 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేసి వరుసగా రెండో అర్ధ సెంచరీ సాధించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ దీప్‌దాస్ గుప్తా (Deep Dasgupta) తాజాగా మాట్లాడుతూ.. చెన్నై సూపర్ కింగ్స్‌కు వచ్చే సీజన్‌లో గైక్వాడ్ సారథ్యం వహించడం ఖాయమని జోస్యం చెప్పాడు.
‘ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీప్‌దాప్ గుప్తా మాట్లాడుతూ.. గైక్వాడ్ టెక్నిక్, హిట్టింగ్‌పై ప్రశంసలు కురిపించాడు. అతడి ఆటను చూస్తూ ఎంజాయ్ చేయొచ్చన్నాడు. గైక్వాడ్ మూడేళ్లుగా చెన్నైకి ఆడుతున్నాడని, ధోనీ నుంచి కెప్టెన్సీని స్వీకరించే వాళ్లలో ముందు అతడే ఉంటాడని అన్నాడు.
చెన్నై ఫ్రాంచైజీ తమ ఫిలాసఫీ ప్రకారం తర్వాతి కెప్టెన్ ఫిట్‌గా ఉండాలని కోరుకుంటోందని, తన వరకు చెప్పాలంటే ఆ ఫిలాసఫీకి తగిన ఫిట్‌నెస్ గైక్వాడ్ ఇప్పటికే కలిగి ఉన్నాడని దీప్‌దాస్ పేర్కొన్నాడు.
గత సీజన్‌లో తప్పు చేసిన సీఎస్‌కే
చెన్నై సూపర్ కింగ్స్ గత సీజన్‌లో హడావుడిగా రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ ఇచ్చి ఘోరమైన తప్పు చేసింది. కెప్టెన్సీ పాత్రలో ఇమడలేకపోయిన జడేజా ఒడ్డున పడ్డ చేపలాగా కొట్టుకున్నాడు. సీజన్ మధ్యలో కాడిపడేశాడు. దీంతో ధోనీ మళ్లీ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది. ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్‌పైనా చెన్నై భారీగా ఖర్చు చేసింది. అతడికి కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. అలాగే, దీపక్ చాహర్, మొయిన్ అలీ కూడా చాలా కాలంగా చెన్నైకి ఆడుతున్నారు కాబట్టి వీరు కూడా రేసులో ఉన్నట్టే.