World Cup: ప్రపంచకప్‌లో ఒకే గ్రూపులో భారత్, పాకిస్థాన్.. మ్యాచ్ జరిగేది ఎక్కడంటే..?
ABN , Publish Date - Dec 21 , 2023 | 12:22 PM
India vs Pakistan: ప్రపంచకప్ మొత్తం ఒక ఎత్తయితే భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ ఒక ఎత్తు. ప్రపంచకప్ టోర్నీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా గత అక్టోబర్‌లో ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచే ఇందుకు సాక్ష్యం.
ప్రపంచకప్ మొత్తం ఒక ఎత్తయితే భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ ఒక ఎత్తు. ప్రపంచకప్ టోర్నీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా గత అక్టోబర్‌లో ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచే ఇందుకు సాక్ష్యం. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌ను చూడడానికి లక్ష 30 వేల మంది స్టేడియానికి తరలివచ్చారు. త్వరలోనే ప్రపంచకప్ టోర్నీలో దాయాదుల పోరును చూసే అవకాశం క్రికెట్ అభిమానులకు మరోసారి రానుంది. మరో 6 నెలల్లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూపులో ఉన్నాయని సమాచారం. ఇదే నిజమైతే లీగ్ దశలోనే చిరకాల ప్రత్యర్థులు తలపడనున్నాయి. న్యూయార్క్‌లోని ఐసెన్‌హోవర్ పార్క్‌లో ఈ మ్యాచ్ జరగనుందని తెలుస్తోంది. కాగా 2007 వన్డే ప్రపంచకప్ తర్వాతి నుంచి ఏ ప్రపంచకప్ జరిగిన ఐసీసీ నిర్వహకులు భారత్, పాకిస్థాన్ జట్లను ఒకే గ్రూపులో ఉంచుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మ్యాచ్‌తో టోర్నీకి కూడా మంచి హైప్ వస్తోంది.
ఆస్ట్రేలియా వేదికగా 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు లీగ్ దశలోనే తలపడ్డాయి. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. టీమిండియా విజయంలో విరాట్ కోహ్లీ కీలకపాత్ర పోషించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఒకే ఒకసారి ఓడింది. మిగతా అన్ని సార్లు టీమిండియానే గెలిచింది. అలాగే చిరకాల ప్రత్యర్థులైనా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు కూడా ఒకే గ్రూపులో ఉండనున్నాయని సమాచారం. అయితే వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా వెస్టిండీస్, అమెరికా వేదికగా వచ్చే ఏడాదిలో జూన్ 4 నుంచి 30 మధ్య టీ20 ప్రపంచకప్ జరగనుంది. అమెరికాలోని డల్లాస్‌లో గల గ్రాండ్ ప్రైరీ, ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ కౌంటీ, న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ వేదికలో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఇక ఇంగ్లండ్ జట్టు తమ మ్యాచ్‌లన్నింటిని వెస్టిండీస్‌లోనే ఆడనుందని సమాచారం. కాగా రాబోయే టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు తలపడనున్నాయి. 10 జట్లు తమ మ్యాచ్‌లను అమెరికాలో ఆడనున్నాయి.