RR vs PBKS: కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ గెలుపు.. ప్లే-ఆఫ్ ఆశలు సజీవం..

ABN , First Publish Date - 2023-05-20T00:13:12+05:30 IST

ఐపీఎల్ ప్లే-ఆఫ్స్ రేస్‌లో భాగంగా జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 4 వికెట్ల తేడాతో..

RR vs PBKS: కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ గెలుపు.. ప్లే-ఆఫ్ ఆశలు సజీవం..

ధర్మశాల: ఐపీఎల్ ప్లే-ఆఫ్స్ రేస్‌లో భాగంగా జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ ప్లే-ఆఫ్స్ ఆశలను ఒక్క సిక్స్ కొట్టి ధ్రువ్ జురెల్ సజీవంగా నిలిపాడు. రాజస్థాన్ రాయల్స్ తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో పంజాబ్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ జట్టు 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. పంజాబ్ జట్టు 50 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ శామ్ కరన్ 49 పరుగులు, జితేష్ శర్మ 44 పరుగులు, షారూక్ ఖాన్ 41 పరుగులతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించారు. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆదిలోనే బట్లర్ డకౌట్ కావడంతో షాక్ తగిలింది. అయినప్పటికీ మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 50 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించాడు. దేవ్‌దత్ పడిక్కల్ కూడా 51 పరుగులతో రాణించడం గమనార్హం.

రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. 2 పరుగులకే ఔట్‌గా వెనుదిరిగాడు. అయితే.. హెట్మయిర్ 46 పరుగులతో జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. హెట్మయిర్ వికెట్ పడటంతో రాజస్థాన్ జట్టు అభిమానుల్లో కాస్త ఆందోళన కనిపించినప్పటికీ ధ్రువ్ జురెల్ ఒక్క సిక్స్‌తో జట్టుకు గెలుపును అందించాడు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ హెట్మయిర్‌కు దక్కింది. పంజాబ్ బౌలర్లలో రబడకు రెండు వికెట్లు దక్కగా, శామ్ కరన్, అర్ష్‌దీప్ సింగ్, ఎల్లిస్, రాహుల్ చాహర్‌కు తలో వికెట్ దక్కింది. రాజస్థాన్ బౌలర్లలో నవదీప్ సైనీ 3 వికెట్లతో రాణించడం గమనార్హం. బౌల్ట్, జంపాకు చెరో వికెట్ దక్కింది. దీంతో పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐదో స్థానానికి చేరింది.

Updated Date - 2023-05-20T00:13:30+05:30 IST