'Red Card': టీ20 క్రికెట్‌లో ‘రెడ్ కార్డ్’
ABN , First Publish Date - 2023-08-14T02:39:25+05:30 IST
టీ20 క్రికెట్‌లో స్లో ఓవర్ రేట్ అనే జాఢ్యం ఏడాదికేడాది పెరిగిపోతుంది. దీన్ని కట్టడి చేసేందుకు కఠిన నిబంధనలు అమలు చేయాలని కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) నిర్వాహకులు నిర్ణయించారు.

స్లో ఓవర్ రేట్ నియంత్రణకు సీపీఎల్‌లో అమలు
న్యూఢిల్లీ: టీ20 క్రికెట్‌లో స్లో ఓవర్ రేట్ అనే జాఢ్యం ఏడాదికేడాది పెరిగిపోతుంది. దీన్ని కట్టడి చేసేందుకు కఠిన నిబంధనలు అమలు చేయాలని కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) నిర్వాహకులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఫుట్‌బాల్ తరహాలో రెడ్ కార్డును ప్రవేశపెట్టారు. ఆఖరి (20వ) ఓవర్ నిర్ణీత సమయానికి మొదలవకపోతే ఫీల్డింగ్ జట్టుకు రెడ్ కార్డ్ చూపిస్తారు. అప్పుడు ఓ ఆటగాడు (కెప్టెన్ ఎంపిక చేస్తాడు) మైదానం వీడాల్సివుంటుంది. నిర్ణీత సమయానికి 18వ ఓవర్ ప్రారంభమవకపోతే ఒక ఫీల్డర్‌ను, 19వ ఓవర్ కూడా ఆలస్యమైతేఇద్దరు ఫీల్డర్లను ఇన్నర్ సర్కిల్‌లోకి తీసుకొచ్చే నిబంధన ఈపాటికే అమలులో ఉంది. ఇప్పుడు రెడ్‌కార్డ్‌తో మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. ఒకవేళ బ్యాటర్లు సమయం వృథా చేస్తే దాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని అంపైర్లు రెండుసార్లు హెచ్చరిస్తారు. ఆ తర్వాత నుంచి వార్నింగ్ ఇచ్చిన ప్రతిసారి పెనాల్టీ కింద 5 పరుగుల కోత విధిస్తారు. సీపీఎల్ గురువారం నుంచి జరగనుంది.