Share News

REVANTH : కేసీఆర్‌పై చర్యలేవి?

ABN , First Publish Date - 2023-11-05T02:41:27+05:30 IST

‘‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక ఆర్థిక ఉగ్రవాది. ఆయన కుటుంబం ఒక ఆర్థిక ఉగ్రవాద కుటుంబం. ప్రాజెక్టుల నిర్మాణ ఒప్పందంలో ఒక రేటును నిర్ణయించారు.

REVANTH : కేసీఆర్‌పై చర్యలేవి?

ఆయన ధనదాహానికి కాళేశ్వరం బలి..

సీబీఐ దర్యాప్తు జరిపించాలి

ప్రాజెక్టు అంచనాలు పెంచేసి దోచేశారు

డొల్లతనాన్ని కేంద్ర కమిటీయే బయటపెట్టింది

మోదీ మేడిగడ్డను ఎందుకు సందర్శించరు?

ఎల్‌అండ్‌టీపై చర్యలకు వెనకాడుతున్నారేం!?

ద్రోహులు ఒక్కటైతున్నారన్న వ్యాఖ్యలపై ఫైర్‌

ఐతే కోదండరాం కూడా తెలంగాణ ద్రోహా?

అలా అంటే జనం చెప్పుతో కొడతరు: రేవంత్‌

హైదరాబాద్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక ఆర్థిక ఉగ్రవాది. ఆయన కుటుంబం ఒక ఆర్థిక ఉగ్రవాద కుటుంబం. ప్రాజెక్టుల నిర్మాణ ఒప్పందంలో ఒక రేటును నిర్ణయించారు. పనులు ప్రారంభించిన తర్వాత రివైజ్డ్‌ పేరిట అంచనాలను పెంచేశారు. ఆపై కమీషన్లను దండుకున్నారు. ఉదాహరణకు.. సీతారామ ప్రాజెక్టుకు ఒప్పంద సమయంలో నిర్మాణ వ్యయం రూ.270 కోట్లు. తర్వాత రివైజ్డ్‌ అంచనాల కింద దానిని రూ.500 కోట్లకు పెంచారు. ఈ ప్రాజెక్ట్‌ కాంట్రాక్ట్‌ను కేసీఆర్‌ బంధువుకు చెందిన ప్రతిమ సంస్థకు ఇచ్చారు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా రూ.80 వేల కోట్లు అగ్రిమెంట్‌లో పెట్టి రివైజ్డ్‌ పేరిట రూ.1.50 లక్షల కోట్లకు అంచనాలను పెంచేశారు. ఈ ఆర్థిక ఉగ్రవాద కుటుంబాన్ని శిక్షించాలి’’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. గాంధీ భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ ధనదాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైందని అన్నారు. మేడిగడ్డ బరాజ్‌ డొల్లతనాన్ని కేంద్ర కమిటీ బయట పెట్టిన నేపథ్యంలో.. కాళేశ్వరానికి కర్త, కర్మ, క్రియ అన్నీ తానేనని చెప్పుకొంటున్న కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం దోపిడీపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. ‘‘మేడిగడ్డ బరాజ్‌ను ప్రణాళిక ప్రకారం డిజైన్‌ చేయలేదు. డిజైన్‌ ప్రకారం నిర్మాణం, నిర్వహణ లేదు. అందుకే మేడిగడ్డ కుంగింది. కేసీఆర్‌ పాపం పండింది’’ అని వ్యాఖ్యానించారు. తన మేధస్సుతో కాళేశ్వరం నిర్మాణం జరిగిందన్న కేసీఆర్‌.. ఇప్పుడు మేడిగడ్డ పిల్లర్లు కుంగడాన్ని చిన్నదిగా చూపించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిర్మాణంలో నాణ్యత పాటించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఇంత జరిగినా కాళేశ్వరంపై సీఎం కేసీఆర్‌ నోరు ఎందుకు మెదపట్లేదని నిలదీశారు. నిర్మాణంలో లోపాలు, అవినీతి జరిగిందనే వివరాలను ప్రభుత్వం దాచిపెడుతోందని, బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నారని కేంద్ర సర్కారును ప్రశ్నించారు.

ఎల్‌అండ్‌టీపై చర్యలకు ఎందుకు వెనకడుగు!?

మేడిగడ్డ బరాజ్‌ను నిర్మించిన ఎల్‌అండ్‌టీ కంపెనీపై చర్యలు తీసుకోవడానికి కేసీఆర్‌ ఎందుకు వెనకాడుతున్నారని రేవంత్‌ ప్రశ్నించారు. డిజైన్లలో లోపాలు ఉన్నాయని, అవినీతి జరిగిందని కేంద్ర ప్రభుత్వానికి తెలిసినా ఎందుకు విచారణ జరిపించట్లేదని ప్రశ్నించారు. బాధ్యులపై తక్షణమే క్రిమినల్‌ కేసులు పెట్టాలన్నారు. నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ అడిగిన ప్రశ్నలకు కేసీఆర్‌ సమాచారం ఇవ్వడం లేదని, కేంద్రమూ కేసీఆర్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణకు చెందని అధికారులతో కమిటీ వేసి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని పరిశీలించాలని, దాని ఆధారంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వెనక ఉన్న మంత్రి హరీశ్‌ రావు, సీఎం కేసీఆర్‌లను వెంటనే పదవుల నుంచి తొలగించాలన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి పరిధిలో ఉండే కమిటీనే తప్పు జరిగిందని చెప్పినప్పుడు.. అవినీతిని వదలబోనని చెప్పే ప్రధాని మోదీ మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు.

‘‘కేంద్ర కమిటీ ఇచ్చిన నివేదికపై చర్యలు తీసుకోవాలంటే.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక తీసుకుంటామని బీజేపీ నాయకులు చెబుతున్నారు. అంటే, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే వరకూ విచారణ జరిపేది లేదని చెప్పదల్చుకున్నారా?’’ అని నిలదీశారు. ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీ.. కూలిన ప్రాజెక్టును చూసేందుకు ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్‌ తమ తప్పును సరిదిద్దుకోవడం మానేసి.. తనను, రాహుల్‌ గాంధీనీ తిడుతున్నారన్నారు. కాగా.. తెలంగాణను దెబ్బతీయడానికి ద్రోహులంతా ఒక్కటై కాంగ్రెస్‌ ముసుగులో వస్తున్నారంటూ మంత్రి హరీశ్‌ రావు చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘అంటే.. కోదండరాం కూడా తెలంగాణ ద్రోహి అయిండా? ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నందుకే జనాలు చెప్పులతో కొడుతున్నరు. కోదండరాంను తెలంగాణ ద్రోహి అంటే జనం చెప్పుతో కొడతరు’’ అని స్పష్టం చేశారు. తొలుత, టీడీపీతో పొత్తు పెట్టుకున్నదే బీఆర్‌ఎస్‌ అని, కేఏ పాల్‌ కూడా పోటీ చేయట్లేదని, ఆయన బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లా అని ప్రశ్నించారు. డిసెంబరు 9 తర్వాత కాళేశ్వరం బాధ్యుల తాట తీస్తామని హెచ్చరించారు. ప్రాజెక్టు అంచనాలు, పెంచిన వ్యయం, ఖర్చు.. ఈ మూడు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-11-05T03:13:23+05:30 IST