జిల్లా ఆసుపత్రిలో సౌకర్యాల లేమి

ABN , First Publish Date - 2023-10-06T22:13:29+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నా, క్షేత్రస్థాయిలో పలు సమస్యలు రాజ్యమేలుతున్నాయి. అరకొర వసతులతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తు న్నాయి. ప్రతీ ఇంట్లో కుటుంబ సభ్యులు జ్వరాల బారినపడ్డారు.

జిల్లా ఆసుపత్రిలో సౌకర్యాల లేమి

మంచిర్యాల, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నా, క్షేత్రస్థాయిలో పలు సమస్యలు రాజ్యమేలుతున్నాయి. అరకొర వసతులతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తు న్నాయి. ప్రతీ ఇంట్లో కుటుంబ సభ్యులు జ్వరాల బారినపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరకొర వసతుల కారణంగా ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా జనాలు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వేలల్లో బిల్లులు చెల్లిస్తూ జేబులు గుళ్ల చేసుకోవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే అదునుగా ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీకి తెరలేపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంగా ఏర్పడ్డప్పటికి ప్రభుత్వ పరంగా వైద్య చికిత్సలకు ప్రజలు నోచుకోవడం లేదు. శనివారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో వైద్యపరమైన సమస్యలపై దృష్టి సారించాలని ప్రజలు వేడుకొంటున్నారు.

వర్షాలతో నీట మునుగుతున్న ఎంసీహెచ్‌ భవనం

జిల్లా కేంద్రంలోని గోదావరి రోడ్డులో గల మాతా శిశు ఆరోగ్య కేంద్రం భారీ వర్షాలతో నీట మునుగుతోంది. భవనం ఎప్పుడు సేవలు అందిస్తుం దో... ఎప్పుడు మూసివేస్తారో... తెలియని పరిస్థితులు ఉన్నాయి. దీంతో బాలింతలు, గర్బిణిలు ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి సమీపం లో రూ.17.80 కోట్లతో వంద పడకల సామర్ధ్యంతో అన్ని హంగులతో ఎంసీహెచ్‌ భవనాన్ని నిర్మించగా గతేడాది మార్చి 4వ తేదీన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రారంభించారు. అవసర మైన అధునాతన పరికరాలను ఏర్పాటు చేశారు. మూడు నెలల పాటు గర్బిణిలు, బాలింతలు, శిశువులకు చికిత్స సజావుగా సాగింది. గతేడాది జూలైలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆసుపత్రి భవనం పూర్తిగా నీట మునగగా కోట్ల రూపాయల విలువ చేసే పరికరాలు, సామగ్రి నీటిపాలయ్యాయి. మూడు రోజులపాటు నీటిలో మునిగి ఉండడంతో భవనం తలుపులు, కిటికీలు ఊడిపోయాయి. బాత్రూంలలో బురద కూరుకుపోయి పనికి రాకుండా పోయాయి. చికిత్స పొందుతున్న వారిని అదే నెల 13న రాత్రికి రాత్రే ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. జనరల్‌ ఆసుపత్రిలో రోగుల సంఖ్యకు సరిపడా సౌకర్యాలు లేకపోవడంతో తిరిగి ఎంసీహెచ్‌ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని అధికారు లు భావించారు. మూడు నెలల అనంతరం మరమ్మతులు చేసి వినియో గంలోకి తీసుకువచ్చారు. అయితే ఈయేడు జూలైలో కురిసిన భారీ వర్షాలకు మళ్లీ భవనం నీట మునిగింది. ఇటీవల మరమ్మతులు పూర్తి చేసి రోగులను తరలించారు. అయితే ప్రతీసారి వరదలు వచ్చినప్పుడల్లా ఎంసీహెచ్‌ మునిగే అవకాశం ఉన్నందున దానికి శాశ్వత పరిష్కారం చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

జీజీహెచ్‌లో సౌకర్యాల లేమి....

ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతోంది. అంతకు ముందు ఏరియా ఆసుపత్రి స్థాయిలో రోగులకు సేవలందించిన భవనంలోనే జిల్లా ఆసుపత్రి, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేశారు. జనరల్‌ ఆసుపత్రిగా మారినప్పటి నుంచి వైద్యులు, ఇతర సిబ్బందికి కొరత లేకపోయినా భవనం స్థాయి రోగుల సంఖ్యకు సరిపడా లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. వంద పడకల ఆసుపత్రిగా ఉన్న సమయంలో అందిన విఽధంగానే 250 పడకల స్థాయిలోనూ చికిత్స అందించడం రోగులకు శాపంగా మారింది. సాధారణంగా జీజీహెచ్‌లో నిత్యం సగటున 400 వరకు ఓపీ నమోదు అవుతోంది. రెగ్యులర్‌ పేషంట్‌లకు తోడు మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని మహిళలకు కూడా చికిత్స అందిస్తుండడంతో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఆసుపత్రి వరండాల్లోనూ బెడ్‌లు ఏర్పాటు చేసి చికిత్స అందించాల్సిన పరిస్ధితి నెలకొంది. ఆసుపత్రిలోని వివిధ విభాగాలకు ప్రత్యేక వార్డులు లేకపోవ డంతో ఒకే చోట అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నారు. పేషంట్‌ల సంఖ్యకు సరిపడా సౌకర్యాలు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. బాత్రూంలు, తాగు నీటి సౌకర్యం సక్రమంగా లేకపోవ డంతో ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రి పక్కనే ఉన్న సులబ్‌ కాంప్లెక్స్‌కు వెళ్లాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి. తాగు నీటి కోసం ఐబీ చౌరస్తాలో ఉన్న నీటి కుళాయి వద్దకు వెళ్తున్నారు.

వైద్య కళాశాలలో నియామకాలు ఎప్పుడు..?

ప్రభుత్వ వైద్య కళాశాలలోనూ సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కళాశాల ప్రారంభమై రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయిలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకం పూర్తికాలేదు. దీంతో వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా తయారైంది. కళాశాలలో మొత్తం 148 మంది సిబ్బంది అవసరం ఉండగా, ప్రస్తుతం 74 మంది టీచింగ్‌, 44 మంది నాన్‌ టీచింగ్‌ సిబ్బంది ఉన్నారు. మరో 30 సిబ్బంది అవసరం కాగా, రెండు సంవత్సరాలుగా నియామకానికి నోచుకోవడం లేదు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శనివారం జిల్లాలో పర్యటిస్తుందున్న వైద్య కళాశాల, ఆసుపత్రి సమస్యలపైనా దృష్టి సారించాలని వైద్య విద్యార్థులు, ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2023-10-06T22:13:29+05:30 IST