Congress: ఆ నియోజకవర్గంలో.. ఏ రౌండ్‌లోనూ హస్తానికి దక్కని ఆధిక్యం
ABN , First Publish Date - 2023-12-05T10:33:53+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్(Congress)కు అనుకూల పవనాలు వీచినా అంబర్‌పేట నియోజకవర్గంలో
హైదరాబాద్: (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్(Congress)కు అనుకూల పవనాలు వీచినా అంబర్‌పేట నియోజకవర్గంలో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ సినీనటి విజయశాంతి(Movie actress Vijayashanti), కర్నాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్(DK Shivakumar)లు రోడ్‌షో నిర్వహించినా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మూడు సార్లు ఈ నియోజకవర్గంలో పర్యటించినా మాజీమంత్రి కుందూరు జానారెడ్డి ఎన్నికల ప్రచారం చేసినా, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ప్రత్యేక దృష్టి పెట్టినా నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించలేదు. 1989లో ఫలితాలే తిరిగి పునరావృతమవుతాయని నేతలు భావించి, మాజీ కార్పొరేటర్లు గరిగంటి శ్రీదేవీ రమేష్, పులి జగన్, దిడ్డి రాంబాబులు పార్టీలో చేరినా ఎన్నికల్లో అంత ప్రభావం కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సి.రోహిణ్‌రెడ్డికి 18,004 ఓట్లు రావడం ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురిచేసింది. 1978లో పూర్వ హిమాయత్‌నగర్ నియోజకవర్గం, 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో అంబర్‌పేట నియోజకవర్గం ఏర్పడగా కేవలం 1989లో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. ప్రతి ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. 2014లో వి.హనుమంతరావు ఎమ్మెల్యేగా పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు.
ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థి కొద్ది ఓట్ల తేడాతో డిపాజిట్ కోల్పోయే ప్రమాదం నుంచి బయటపడ్డారు. నియోజకవర్గంలో ఉన్న 5 డివిజన్లలో ఏ డివిజన్‌లో కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ రాలేదు. ఎన్నికల ఫలితాలలో 18 రౌండ్లలో ఏ రౌండ్‌లో కూడా 1500 ఓట్లు సాధించలేదు. ఈ నియోజకవర్గంలో ఉన్న మైనారిటీలు, రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయలేదనే విమర్శలు వస్తున్నాయి. ఓటు చీలిపోతే బీజేపీ అభ్యర్థికి అనుకూలిస్తుందని భావించిన మైనారిటీలు బీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది. దీనివల్ల కాంగ్రెస్ మైనారిటీలపై పెట్టుకున్న ఆశలు ఫలించలేదు. ఈ నియోజకవర్గంలో 52.50 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. ముఖ్యంగా యువత ఓటుకు దూరంగా ఉండడం వల్ల కాంగ్రెస్ నష్టం జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆరు గ్యారంటీ పథకాలను గడపగడపకు తీసుకెళ్లడంలో వైఫల్యం చెందడం వల్లే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ నేతలు అసంతృప్తిగా ఉండడం కూడా ఆ పార్టీకి కొంత మేరకు నష్టం జరిగింది.