INTUC, AITUC : అసెంబ్లీలో దోస్తీ.. సింగరేణిలో కుస్తీ!
ABN , Publish Date - Dec 23 , 2023 | 05:07 AM
అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని విజయం సాధించిన కాంగ్రెస్, సీపీఐ.. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో మాత్రం పరస్పరం తలపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో పరస్పరం..
తలపడుతున్న ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ
బీఆర్‌ఎస్ యూటర్న్.. పోటీ చేద్దామంటూ ప్రకటన
రాజీనామా చేసిన నేతలు వెనక్కి రావడంపై సందిగ్ధం
గోదావరిఖని, డిసెంబరు 22: అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని విజయం సాధించిన కాంగ్రెస్, సీపీఐ.. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో మాత్రం పరస్పరం తలపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నెల 27న జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్‌టీయూసీ, సీపీఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీ ఎవరికి వారుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు సంఘాలు కలిసి పోటీ చేసే వాతావరణం ఇప్పటికే భగ్నమైంది. ఐఎన్‌టీయూసీతో కలిసి ఎన్నికలకు వెళ్లేలా ఏఐటీయూసీని ఒప్పించాలన్న సీపీఐ ప్రయత్నం విఫలమైంది. ఈ అంశంపై కాంగ్రె్‌సతో సంప్రదించే వాతావరణం ఉందని సీపీఐ నేతలు చెప్పినా.. బేషరతుగా కలిసివస్తే ఆహ్వానిస్తామే తప్ప.. ఐఎన్‌టీయూసీతో పొత్తు ఉండదని ఏఐటీయూసీ స్పష్టం చేసింది. దీంతో సింగరేణి ఎన్నికల విషయంలో కాంగ్రెస్, సీపీఐ మధ్య చర్చలు గానీ, ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ మధ్య పొత్తుగానీ ఉండవని తేలిపోయింది. ఈ రెండు సంఘాల పరిస్థితి ఇలా ఉంటే.. ప్రస్తుతం సింగరేణి గుర్తింపు కార్మిక సంఘంగా కొనసాగుతున్న, సింగరేణిలో అతి బలమైన కార్మిక సంఘంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఒక్కసారిగా సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ యూనియన్ అధ్యక్షుడు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేస్తూ యూనియన్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు లేఖ పంపించారు. పిట్ కమిటీ నుంచి సెంట్రల్ కమిటీ దాకా సుమారు 3వేల మంది కార్మికులు, నాయకులతో పటిష్ఠంగా, బలపడి ఉన్న సంఘానికి ఇంత పెద్ద కుదుపు రావడం సింగరేణిలో ఇదే మొదటిసారి. దీంతో టీబీజీకేఎస్ రెండవ, మూడవ శ్రేణి నాయకులు ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీల్లోకి వలస వెళుతున్నారు.
సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో తమ యూనియన్ పోటీ చేయడంపై పార్టీ అధినేత కేసీఆర్‌కు ఆసక్తి లేదని, మనం పోటీలో ఉండడం లేదని కవిత చెప్పిన విషయాన్ని జీర్ణించుకోలేని టీబీజీకేఎస్ నాయకత్వం మూకుమ్మడిగా రాజీనామా చేసింది. ఊహించని ఈ పరిణామంతో బీఆర్‌ఎస్ అధిష్ఠానం మనసు మార్చుకుంది. సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో టీబీజీకేఎస్ పోటీ చేస్తుందని, కార్మికులు యూనియన్‌ను గెలిపించాలని కోరుతూ కల్వకుంట్ల కవిత శుక్రవారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలై అధికారం కోల్పోవడం, 2018, 2023 ఎన్నికల్లోనూ కోల్‌బెల్ట్ ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలవడాన్ని జీర్ణించుకోలేకనే బీఆర్‌ఎస్ నాయకత్వం టీబీజీకేఎస్ పట్ల, సింగరేణి ఎన్నికల పట్ల నిరాసక్తతతో ఉన్నట్లు తెలుస్తోంది. సింగరేణి ఎన్నికలకు అక్టోబరు మొదటి వారంలోనే నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయింది. అర్హత కలిగిన సంఘాలు, గుర్తుల కేటాయింపు కూడా జరిగింది. ఆ తరువాత డిసెంబరు 27వ తేదీకి ఎన్నికలకు వాయిదా పడ్డాయి. తిరిగి అప్పటి షెడ్యూల్ మేరకే ఎన్నికలను ఆర్‌ఎల్‌సీ నిర్వహిస్తోంది. దీంతో తాము పోటీలో లేమని టీబీజీకేఎస్ ఇప్పుడు చెప్పినా.. ఎన్నికల బ్యాలెట్‌లో మాత్రం ఆ సంఘం పేరు ఉంటుంది. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లోనే తిరిగి పోటీ చేస్తామంటూ ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, టీబీజీకేఎ్‌సకు రాజీనామా చేసిన వెంకట్రావు.. కాంగ్రె్‌సలో పుట్టి పెరిగి ఐఎన్‌టీయూసీకి 20 ఏళ్లపాటు నాయకత్వం వహించిన వ్యక్తి. రేపో మాపో ఆయన తిరిగి కాంగ్రెస్, ఐఎన్‌టీయూసీ గూటికి చేరే అవకాశం ఉంది. ఇక రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచిచూడాలి.