Share News

HYD: ఆ నియోజకవర్గంలో.. గెలుపు, ఓటముల్లో వారే కీలకం

ABN , First Publish Date - 2023-11-09T10:06:00+05:30 IST

అంబర్‌పేట(Amberpet) నియోజకవర్గంలో ప్రతి ఎన్నికల్లో బీసీ ఓటర్లు అభ్యర్థుల గెలుపు, ఓటముల్లో ప్రధాన

HYD: ఆ నియోజకవర్గంలో.. గెలుపు, ఓటముల్లో వారే కీలకం

- అంబర్‌పేటలో బీసీలు, మైనార్టీలు అధికం

- నియోజకవర్గంలో 1.70 లక్షల బీసీల ఓట్లు

- వారు ఎవరికి మద్దతు ఇస్తే వారిదే విజయం

బర్కత్‌పుర/నల్లకుంట(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): అంబర్‌పేట(Amberpet) నియోజకవర్గంలో ప్రతి ఎన్నికల్లో బీసీ ఓటర్లు అభ్యర్థుల గెలుపు, ఓటముల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. బీసీ కులాలు ఏ పార్టీకి మద్దతు ఇస్తాయో ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తూ వస్తున్నారు. 1978 నుంచి 2018 వరకు జరిగిన ఎన్నికల్లో వారి మద్దతునే ఆయా పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. 1978లో హిమాయత్‌నగర్‌ నియోజకవర్గం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీకాంతమ్మ విజయం సాధించింది. 1983లో నారాయణరావుగౌడ్‌, 1985లో ఆలె నరేంద్ర, 1989లో వి.హనుమంతరావు, 1992లో ఆలె నరేంద్ర, 1994, 1999 సి.కృష్ణాయాదవ్‌ విజయం సాధించారు. 2004, 2009, 2014లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జి.కిషన్‌రెడ్డి విజయం సాధించారు. 2018లో బీసీ వంజర కులానికి చెందిన కాలేరు వెంకటేష్‌ గెలిచారు.

fff.jpg

1.70 లక్షల బీసీ సామాజిక వర్గాల ఓట్లు

నియోజకవర్గంలో మొత్తం 2,74, 911 ఓట్లు ఉండగా, వాటిల్లో 1.70 లక్షల బీసీ సామాజిక వర్గాల కు చెందిన ఓట్లు ఉన్నాయి. యాదవులు 26 వేలు, గౌడ కులస్థులు 25 వేలు, పద్మశాలీలు 20 వేలు, ముదిరాజ్‌లు 10 వేలు, గంగపుత్రులు 20 వేలు, మున్నూరుకాపులు 18 వేలు, విశ్వకర్మలు 12 వేలు, గొల్ల కురుమలు 3 వేలు, కుమ్మరులు 5 వేల వరకు ఓటర్లు ఉన్నారు. ఎస్సీలు 25వేలు, ఎస్టీలు 6 వేల ఓట్లు ఉన్నాయి. బీసీలలోని ఇతర కులాలకు చెందిన మరో 30 వేల ఓటర్లు ఉన్నారు. ఈ మైనారిటీ ఓట్లు 48,563 వరకు ఉన్నాయి. ఈ కులాల ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను శాసించనున్నాయి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు దాదాపు 20 వేల వరకు ఉన్నాయి. బ్రాహ్మణుల ఓట్లు కూడా దాదాపు 10 వేల వరకు ఉన్నాయి. ఈ ఓట్లు కూడా ప్రస్తుత ఎన్నికల్లో ప్రధానం కానున్నాయి. ప్రస్తుతం ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌, బీజేపీ నుంచి యాదవ కులానికి చెందిన సి.కృష్ణాయాదవ్‌ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన డాక్టర్‌ సి.రోహిణ్‌రెడ్డి బరిలో ఉన్నారు. మూడు ప్రధాన పార్టీలకు బీసీల ఓట్లే కీలకంగా మారాయి. కర్నాటక, గుజరాత్‌, రాజస్థాన్‌, మహరాష్ట్ర రాష్ట్రాలకు చెందిన ఓటర్లు కూడా కూడా ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీసీలు, మైనారిటీలు, అగ్రవర్ణాలు, ఎస్సీ, ఎస్టీలు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఏ పార్టీని ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.

Updated Date - 2023-11-09T10:38:42+05:30 IST