PODU LANDS: పోడు పట్టాల పంపిణీ నేడే

ABN , First Publish Date - 2023-06-30T02:30:09+05:30 IST

పోడు భూములను సాగుచేసుకుంటున్న గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం హక్కు పట్టాలు పంపిణీ చేయనుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి సీఎం కేసీఆర్‌ శుక్రవారం కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పోడు పట్టాలను పంపిణీ చేయనున్నారు.

PODU LANDS: పోడు పట్టాల పంపిణీ నేడే

ఆసిఫాబాద్‌ జిల్లాలో అర్హులైన గిరిజనులకు హక్కు పత్రాలు అందజేయనున్న సీఎం

హక్కులు సరే.. కేసుల సంగతేంటి?

రాష్ట్రంలో 3 వేలకు పైగా ‘పోడు’ కేసులు

కేసులన్నీ ఎత్తేయాలని గిరిజనుల డిమాండ్‌

గిరిజనేతరులకు పోడు పట్టాలు లేనట్లే?

రాష్ట్రవ్యాప్తంగా 1.79 లక్షల దరఖాస్తులు

హైదరాబాద్‌/భూపాలపల్లి, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): పోడు భూములను సాగుచేసుకుంటున్న గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం హక్కు పట్టాలు పంపిణీ చేయనుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి సీఎం కేసీఆర్‌ శుక్రవారం కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పోడు పట్టాలను పంపిణీ చేయనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అర్హులైన గిరిజనులకు పోడు పట్టాలను అందజేయనున్నారు. ఇందులో భాగంగా 1.51 లక్షల మందికి పట్టాలను పంపిణీ చేయనున్నారు. పోడు పట్టాలు వస్తున్నందుకు సంతోషంగానే ఉన్నా.. తమపై నమోదైన కేసుల పరిస్థితి ఏంటని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఏపీలో, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా భారీగా కేసులు నమోదయ్యాయని గిరిజనులు, గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్న భూములకు హక్కులు కల్పించకపోగా, సాగు చేసుకుంటున్నారన్న కారణంగా కేసులు నమోదు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3వేలకు పైగా కేసులునమోదు చేశారని సంఘాలు చెబుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నిజామాబాద్‌, నల్లగొండ జిల్లాల్లోనే ఎక్కువగా నమోదయ్యాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్‌కు చెందిన గిరిజన మహిళల అరెస్టు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చిన్న పిల్లల తల్లులపైనా కేసులు పెట్టి, రిమాండ్‌ పేరిట రోజుల తరబడి జైల్లో ఉంచారు. ఇలా రాష్ట్రంలోని పోడు భూములను సాగు చేసుకుంటున్న చాలా మంది గిరిజనులపై కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం ఇప్పుడు పోడు భూములకు హక్కు పట్టాలు ఇస్తున్నా.. కేసుల గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. దీంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. పోడు కేసులు పరిష్కారం కాకపోవడంతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభు త్వం పోడు భూములకు హక్కు పట్టాలు ఇచ్చేందుకు క్యాబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసినట్లుగానే గిరిజనులపై నమోదైన కేసులన్నింటినీ పూర్తిగా ఎత్తేసేలా చర్యలు తీసుకునేందుకూ కమిటీని నియమించాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. గిరిజనులపై కేసులన్నింటినీ బేషరతుగా ఎత్తేయాలని పోడు పోరాట కమిటీ కన్వీనర్‌ భూక్యా వీరభద్రం, గిరిజన సంఘం నేత శ్రీరాంనాయక్‌లు ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు.

గిరిజనేతరుల పోడు గోడు!

పోడు పట్టాల పంపిణీలో ప్రభుత్వం అంతరాలు సృష్టిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. హక్కు పత్రాల పంపిణీకి గిరిజనులను మాత్రమే ఎంపిక చేయడంతో ఏడున్నర దశాబ్దాలుగా భూములు సాగు చేసుకుంటున్న గిరిజనేతరులు ఆందోళన చెందుతున్నారు. హక్కు పత్రాల పంపిణీకి గిరిజనులైతే 2005 డిసెంబరు 13కు ముందు నుంచి కాస్తులో ఉండాలని, గిరిజనేతరులు మూడు తరాలు (75 ఏళ్లకు పైగా) కాస్తు లో ఉండాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. అంటే గిరిజనేతరులకు 1930 కంటే ముం దు నుంచి అటవీ ప్రాంతంలో నివసిస్తున్నట్లుగా ఆధారాలు ఉండాలి. అయితే 1951కి ముందు నిజాం పాలనలో తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రత్యేక నివాస పత్రాలూ ఇవ్వలేదని గిరిజనేతరులు వాపోతున్నారు.

అయినప్పటికీ తమ తాత, ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న భూమి పై ఉన్న ఆధారాలతో చాలామంది దరఖాస్తులు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4.70లక్షల ఎకరాల పోడు భూముల కోసం 1.79 లక్షల మంది గిరిజనేతరులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో సీఎం కేసీఆర్‌ పోడు పట్టాలు పంపిణీ చేయనున్న కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోనే ఎక్కువగా ఉన్నా యి. భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌, కామారెడ్డి, మంచిర్యాల తదితర జిల్లాల్లో గిరిజనేతరులు అత్యధికంగా పోడు పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అన్ని అర్హతలు ఉన్నా, తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మరోవైపు గిరిజనేతరుల ఆక్రమణలో ఉన్న భూములకు, అందిన దరఖాస్తులకు పొంత న లేకపోవడం వల్లే ప్రభుత్వం వారికి పట్టాలు ఇచ్చే అంశాన్ని పక్కనపెట్టిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చాలా ఏళ్ల నుంచి పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనేతరుల అధీనంలో మూడెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నట్లు అటవీ అధికారులు పేర్కొంటున్నారు. మొత్తం మీద ప్రభుత్వం గిరిజనులకు మాత్రమే పట్టాలు ఇవ్వాలని నిర్ణయించడంతో గిరిజనేతరులకు లేనట్టేనా? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

నేడు కేసీఆర్‌ ఆసిఫాబాద్‌ పర్యటన

జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ శుక్రవారం కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. గిరిజన, ఆదివాసీలకు పోడు పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన అక్కడి నుంచే శ్రీకారం చుడతారు. షెడ్యూల్‌ ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు కేసీఆర్‌ ఆసిఫాబాద్‌ చేరుకుంటారు. జిల్లా కేంద్రంలోని కొమురం భీమ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి గోండు వీరుడికి నివాళులర్పిస్తారు. తర్వాత బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కోట్నక్‌ భీమ్‌ రావు విగ్రహాన్ని ఆవిష్కరించి పుష్పాంజలి ఘటిస్తారు. ఆ తర్వాత జిల్లా పోలీసు కార్యాలయాన్ని, ఆసిఫాబాద్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం లబ్ధిదారులకు పోడు పట్టాలను అందజేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. మహబూబాబాద్‌లో నిర్వహించే పోడు పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొంటారు.

Updated Date - 2023-06-30T02:30:09+05:30 IST