TS High Court: గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు పిటిషన్ రేపటికి వాయిదా

ABN , First Publish Date - 2023-09-26T15:41:33+05:30 IST

హైదరాబాద్: గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు పిటిషన్ విచారణను తెలంగాణ హైకోర్టు రేపటి (బుధవారం)కి వాయిదా వేసింది. టీఎస్పీఎస్సీపై విచారణ మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా పడిన అనంతరం తిరిగి ప్రారంభమైంది.

TS High Court: గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు పిటిషన్ రేపటికి వాయిదా

హైదరాబాద్: గ్రూప్ 1 ప్రిలిమ్స్ (Group 1 Prelims) రద్దు పిటిషన్ (Petition) విచారణను తెలంగాణ హైకోర్టు (TS High Court) రేపటి (బుధవారం)కి వాయిదా వేసింది. టీఎస్పీఎస్సీ (TSPSC)పై విచారణ మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా పడిన అనంతరం తిరిగి ప్రారంభమైంది. బయోమెట్రిక్ విధానం (Biometric System) ఎందుకు పెట్టలేదని న్యాయస్థానం మరోసారి ప్రశ్నించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షపై పూర్తి వివరాలు సమర్పించాలని, అలాగే బయో మెట్రిక్‌పై పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.

బయో మెట్రిక్ విధానంలో సాంకేతికత, సమయం లేకపోవడం వల్ల పెట్టలేకపోయమని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. బయో మెట్రిక్ విధానం వల్ల సమస్యలు ఉన్నాయని.. మొదటిసారి నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లోనూ బయో మెట్రిక్ సమస్యలు వచ్చాయని ఏజీ తెలిపారు. దీనిపై స్పందించిన పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ మిగతా పరీక్షలకు బయో మెట్రిక్ విధానం అమలు అవుతునప్పుడు.. గ్రూప్ 1కు మాత్రమే సమస్య వస్తుందన్నారు. కానిస్టేబుల్ పరీక్షకు 6 లక్షల మందికి బయో మెట్రిక్ తీసుకున్నారని న్యాయవాది తెలిపారు. దీంతో ఏ ఏ పరీక్షల్లో బయో మెట్రిక్ ఎంత మందికి వాడారనే వివరాలు ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈ మేరకు వాయిదా వేసింది.

అంతకుముందు విచారణలో టీఎస్పీఎస్సీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగాలు రాక చాలామంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రాజ్యాంగబద్ధ వ్యవస్థ అయి ఉండి పరీక్షల నిర్వహణలో పదేపదే టీఎస్పీఎస్సీ విఫలమవుతుందని మండిపడింది. మొదటిసారి పేపర్ లీకేజ్‌తో పరీక్ష రద్దు చేశారని, రెండోసారి నిర్వహించే సమయంలోనూ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్ 1 రీ పరీక్షలో బయోమెట్రిక్ పెట్టకపోవడానికి కారణాలేంటని హై కోర్టు ప్రశ్నిస్తూ విచారణను మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేసింది.

Updated Date - 2023-09-26T15:41:33+05:30 IST