Mallareddy: మోదీపై మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-02-10T22:39:57+05:30 IST
తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే, తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే, తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేద విద్యార్థులకు విద్యాదానం చేస్తుంటే ఐటీ అధికారులు తమ సంస్థలపై దాడులు చేశారని మల్లారెడ్డి మండిపడ్డారు. ఐటీ, ఈడీ దాడులు తనపై చేస్తే ఏం దొరుకుతాయని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (BJP MLA Etala Rajender), మాజీ ఎంపీ వివేక్‌పై (former MP Vivek) ఐటీ (IT), ఈడీ (ED) దాడులు చేస్తే చాలా దొరుకుతాయని మల్లారెడ్డి సూచించారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కూడా మల్లారెడ్డి విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోదీ (Modi) చాయి ఆమ్మి.. ముఖ్యమంత్రి అయ్యారని.. ఆ తర్వాత దేశానికి ప్రధాని అయ్యారని మంత్రి అన్నారు. ఇప్పుడు తన అలవాటు ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారంటూ ఎద్దేవా చేశారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మాట్లాడిన మంత్రి మల్లారెడ్డి ప్రభుత్వంపై, కేసీఆర్ పాలనపై, కేటీఆర్ గురించి తనదైన శైలిలో మాస్ డైలాగులు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో రామచంద్రుల పాలన నడుస్తోందని... రాముడు అంటే రామారావు.. చంద్రుడు అంటే కేసీఆర్.. అంటూ కేసీఆర్, కేటీఆర్‌ను ఆకాశానికెత్తేశారు. ఒకప్పుడు రామజ్యం అనేది విన్నాం.. ఇప్పుడు తెలంగాణకు ఐటీ రాజ్యం అనే పేరు తెచ్చిన ఘనత కేటీఆర్‌కే దక్కుతుందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఉద్యమ చంద్రుడు ఇవాళ సూర్యుడు అయ్యారని, ఇప్పుడు మండుతున్న సూర్యుడిని తట్టుకోగలరా? అని మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు. త్వరలో కేసీఆర్ పీఎం అవుతారని.. కేటీఆర్ సీఎం అవుతారని మల్లారెడ్డి జోస్యం చెప్పారు.