దడపుట్టిస్తున్న కూరగాయల ధరలు

ABN , First Publish Date - 2023-07-24T01:10:33+05:30 IST

ఏమి కొనేటట్టు లేదు... ఏమి తినేటట్టు లేదు అన్నట్లు మార్కెట్‌లో బియ్యం, నూనె, పప్పులు, ఉప్పులే కాదు... కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య, పేద ప్రజలకు అందనంత ఎత్తున ఉన్నాయి.

దడపుట్టిస్తున్న కూరగాయల ధరలు

- దిగిరానంటున్న టమాట

- ఘాటెక్కిన మిర్చి

- ఆకుకూరలు ధర కూడా ఎక్కువే

కరీంనగర్‌ టౌన్‌, జూలై 23: ఏమి కొనేటట్టు లేదు... ఏమి తినేటట్టు లేదు అన్నట్లు మార్కెట్‌లో బియ్యం, నూనె, పప్పులు, ఉప్పులే కాదు... కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య, పేద ప్రజలకు అందనంత ఎత్తున ఉన్నాయి. దీంతో కూలీనాలీ చేసుకొని బతికే బడుగుజీవులు, అరకొర వేతనాలతో బతుకీడిస్తున సామాన్య, పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రెండు నెలలుగా కూరగాయల ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి.. సాధారణంగా వేసవి ప్రారంభం నుంచి వర్షాకాలం వరకు కూరగాయల దిగుబడి తగ్గడంతో రేట్లు కాస్తా ఎక్కువ ఉంటాయి.

ఫ తగ్గిన దిగుబడి

ఈసారి ఏప్రిల్‌, మే నెలలో కురిసిన అకాల వర్షాలు, ఆ తర్వాత వర్షాలు ఆలస్యమవడంతోపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో కూరగాయల దిగుబడి తగ్గిపోయింది. దీంతో వ్యాపారులు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూరగాయలను తీసుకువచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. దూరప్రాంతాల నుంచి కూరగాయలను తీసుకు వస్తుండడంతో రవాణా, ఇతర చార్జీల భారంపడి కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. ఓవైపు వర్షాలు... మరోవైపు ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో స్థానిక కూరగాయల పంటల సాగుకు తీవ్ర నష్టం వాటిల్లింది. దేశవ్యాప్తంగా కూడా కూరగాయల దిగుబడి ఈ యేడు గణనీయంగా తగ్గిపోయింది. కరీంనగర్‌ మార్కెట్లో ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలను తీసుకువచ్చి మార్కెట్లలో కూరగాయలను విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది మార్చి, ఏప్రిల్‌ వరకు 200 రూపాయలకు పది కిలోల టమాట ధర ఉండగా ఈసారి దిగుబడి తగ్గడంతో వంద రూపాయలకు చేరింది. అన్ని వంటకాల్లో సాధారణంగా వినియోగించే టమాట, మిర్చి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. వంకాయలు, బీరకాయులు, బెండకాయలు, సోరకాయలు, చిక్కుడు వంటి కూరగాయలే కాకుండా ఆకు కూరల ధరలు కూదా విపరీతంగా పెరిగాయి. మరోవైపు కోడిగుడ్డు, చికెన్‌, మటన్‌, చేపల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. సాధారణ బియ్యం క్వింటాల్‌కు .3,500 నుంచి నాలుగు వేల రూపాయలకు పెరుగడం, లీటర్‌ నూనె ప్యాకెట్‌ ధర 110 రూపాయలకుపైగా ఉండడం, కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటడంతో సామన్య ప్రజలు కపుడునిండా తినే పరిస్థితి లేకుండా పోయింది. గ

ఫ పట్టించుకోని ప్రభుత్వం

పెరుగుతున్న ధరలను కట్టడి చేయాల్సిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతోపాటు దేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సబ్సిడీ ధరలకు టమాట, ఇతర కూరగాయలను అందిస్తుంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టక పోవడం దురదృష్టకరమని ప్రజలు వాపోతున్నారు. ధరలు పెరగడంతో చాలా మంది టమాట, మిర్చి వాడకాన్ని తగ్గించారు. జిల్లాకు ఎక్కువగా మదనపల్లి ప్రాంతం నుంచి టమాట, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి మిర్చి తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ఇంతకు ముందు కరీంనగర్‌కు చేరువలోని గోపాల్‌పూర్‌, పొరండ్ల, లింగాపూర్‌, నుస్తులాపూర్‌, చెంజర్ల గ్రామాల్లో ఎక్కువగా కూరగాయాలు సాగు చేసేవారు. ప్రస్తుతం ఆయా గ్రామాల్లో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో చాలా విక్రయించారు. ఉన్న భూముల్లో మరి కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీ, ప్రోత్సాహకాలు లేక పోవడంతో రైతులు కూరగాయల సాగువైపు మొగ్గు చూపడం లేదు.

కరీంనగర్‌ రైతు బజార్‌లో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి....

----------------------------------------------------------------------------------------------

కూరగాయల పేర్లు హోల్‌సేల్‌ (కిలో)ధర రిటేల్‌

------------------------------------------------------------------------------------------

టమాట 100 140 నుంచి 160

వంకాయ 50 60

బెండకాయ 50 60

పచ్చిమిర్చి 100 140

కాకర 60 80

బీరకాయ 100 120

కాలీఫ్లవర్‌ 60 80

క్యాబేజీ 30 50

క్యారేట్‌ 60 80

దొండకాయ 35 50

ఆలుగడ్డ 30 40

గోరుచిక్కుడు 50 60

దోసకాయ 40 60

సోరకాయ 50 60

చిక్కుడు 70 80

చామగడ్డ 70 60

పాలకూర 50 60

చుక్కకూర 50 60

తోటకూర 50 60

ఫ దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగాయి

- మంద రాయమల్లు, రైతు, గోపాల్‌పూర్‌

దేశవ్యాప్తంగా ఈయేడు కూరగాయల దిగుబడి తగ్గిపోయింది. అకాల వర్షాలు, ఎండల తీవ్రత అధికంగా ఉండడం ఓ కారణమైతే కూరగాయల సాగు చాలా మేరకు తగ్గింది. ప్రభుత్వం కూరగాయల సాగుకు ఎలాంటి సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు. వరి ధాన్యం మద్దతు ధర ఎక్కువగా ఉండడం వంటి కారణాలతో రైతు కూరగాయల సాగును తగ్గించారు. పాలీహౌస్‌, గ్రీన్‌హౌస్‌లను ప్రభుత్వం ప్రోత్సహించి సబ్సీడీలు ఇస్తే కూరగాయల సాగు పెరుగుతుంది. స్థానిక రైతులు కూరగాయలను మార్కెట్‌లో అమ్మితే రవాణా, హమాలీ చార్జీలు తగ్గి ధరలు దిగి వస్తాయి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవలసిన అవసరముంది.

Updated Date - 2023-07-24T01:10:33+05:30 IST