సహజ న్యాయానికి కట్టుబడి రీసర్వే నిర్వహించాలి
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:55 AM
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వేను సహజ న్యాయానికి, చట్టపరమైన సూత్రాలకు కట్టుబడి నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు.

అమలాపురం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వేను సహజ న్యాయానికి, చట్టపరమైన సూత్రాలకు కట్టుబడి నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం మూడు రెవెన్యూ డివిజన్లకు చెందిన తహశీల్దార్లు, ఉప తహశీల్దార్లు, సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ అధికారులతో రీసర్వేపై శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తొలివిడత పైలెట్ ప్రాజెక్టు దాదాపు పూర్తి కావస్తున్నదని జేసీ తెలిపారు. రెండో దశలో ప్రతీ మండలంలో రెండు గ్రామాలను ఎంపికచేసి రీసర్వే నిర్వహించాలని సూచించారు. పైలెట్ ప్రాజెక్టు కింద రీసర్వే చేసిన గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ఉత్పన్నమైన సమస్యలను గుర్తించి రెండో విడతలో అటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రీసర్వే లక్ష్యాన్ని భూ యజమానులకు వివరణంగా తెలియచేయాలన్నారు. అనంతరం ఆర్డీవోలు పి.శ్రీకర్, డి.అఖిల, కె.మాధవి పలు అంశాలపై మాట్లాడారు. రెవెన్యూ జిల్లా అధికారి బీఎల్‌ఎన్ రాజకుమారి మాట్లాడుతూ పాస్‌బుక్ రూపం మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు.