Share News

ఎయిడ్స్‌ నివారణకు కృషి చేయాలి

ABN , First Publish Date - 2023-12-01T22:41:55+05:30 IST

ఎయిడ్స్‌ నివారణకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని, ఎయిడ్స్‌/ హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తుల పట్ట వివక్షను వీడాలని జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి గంట కవితాదేవి అన్నారు.

ఎయిడ్స్‌ నివారణకు కృషి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి గంట కవితాదేవి

- వ్యాధిగ్రస్తులపై వివక్ష వీడాలి

- సీనియర్‌ సివిల్‌ జడ్జి గంట కవితాదేవి

- మల్దకల్‌లో అవగాహన ర్యాలీ

గద్వాల న్యూటౌన్‌, డిసెంబరు 1 : ఎయిడ్స్‌ నివారణకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని, ఎయిడ్స్‌/ హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తుల పట్ట వివక్షను వీడాలని జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి గంట కవితాదేవి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డీఎంహెచ్‌వో కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి గంట కవితాదేవి హాజరై మాట్లాడుతూ ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులను అందరితో సమానంగా చూడాలని సూచించారు. వారి అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేయాలన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ శశికళ మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 86 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయన్నారు. 1194 మంది ఏఆర్‌టీ ద్వారా మందులు తీసుకుంటున్నారని, 300 మంది అసరా పెన్షన్లు పొందుతున్నారని తెలిపారు. జిల్లా అసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిశోర్‌కుమార్‌ మాట్లాడుతూ ఎయిడ్స్‌ బాధితులకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన అన్ని సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. వ్యాధి నియంత్రణకు సలహాలు, సూచనలు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం వైద్యులు, విద్యార్ధులకు ప్రశంసాపత్రాలను అందిం చారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ సిద్దప్ప, డీఆర్‌డీఏ, జడ్పీ సీఈవో కాంతమ్మ, డీపీఎం డాక్టర్‌ మల్లికార్జున్‌, ప్రోగ్రాం అఽసిస్టెంట్‌ కృష్ణసాగర్‌, హెచ్‌ఈవో మధుసూదన్‌రెడ్డి, డీఈవో సిరాజుద్దీన్‌, డీఎస్‌వో రేవతి, జిల్లా సంక్షేమాధికారి ముషాయిదాబేగం, డాక్టర్‌ స్రవంతి పాల్గొన్నారు.

ఎయిడ్స్‌ నిర్మూలన అందరి బాధ్యత

మల్దకల్‌ : ఎయిడ్స్‌ నిర్మూలన ప్రతీ ఒక్కరి బాధ్యతని ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ రామాంజ నేయులు అన్నారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎయిడ్స్‌ వ్యాధి నివారణ, హెచ్‌ ఐవీలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు శుక్ర వారం మల్దకల్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థులు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులను సమాజం నుండి వెలివేయకుండా, వారి జీవిత కాలాన్ని పెంచుకొనేలా మనోస్థైర్యాన్ని ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు దేవసేనారెడ్డి, శ్రీనాథ్‌, తిమ్మోతి, రవి ప్రకాష్‌, ఆంజనేయులు, జయరాం, ఇఫ్తాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-12-01T22:41:56+05:30 IST