హాత్ సే హాత్ జోడో యాత్రను విజయవంతం చేద్దాం
ABN , First Publish Date - 2023-01-08T22:25:51+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 26 నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేపట్టే హాత్‌సే హాత్ జోడో పాదయాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వాకిటి శ్రీహరి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

- డీసీసీ అధ్యక్షుడు వాకిటి శ్రీహరి
నారాయణపేట, జనవరి 8 : రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 26 నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేపట్టే హాత్‌సే హాత్ జోడో పాదయాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వాకిటి శ్రీహరి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం నారాయణపేట డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో జిల్లాలోని అన్ని గ్రామాలు, వార్డుల్లో హాత్‌సే హాత్ జోడో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ నాయకులు, మహిళా సంఘం అధ్యక్షుడు, డివిజన్ నాయకులు, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు పార్టీ అనుబంధ సంస్థల నాయకులు విధిగా పాల్గొనాలన్నారు. యాత్రలో ఇంటింటికీ వెళ్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కాంగ్రెస్ హయాంలో అన్నీ వర్గాలకు జరిగిన లబ్ధి గురించి వివరించి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు ప్రజల మద్దతు కూడగట్టాలన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముఖ్య ఉద్దేశ్యాన్ని వివరించి, రాష్ట్రంలో ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి సాధనకై కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న అన్నీ కమిటీలు రద్దు అయ్యాయని, కొత్తగా ఈనెల 12వ తేదీలోపు నూతన కమిటీలు, అనుబంధ కమిటీలను ఎన్నుకొని 20 నాటికి పూర్తి స్థాయి జిల్లా కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల దృష్ట్యా అందరి ఆమోదంతో పార్టీ కోసం పనిచేసే వారిని కమిటీల్లో నియమిస్తామన్నారు. అంతకుముందు అన్ని మండలాల ముఖ్య నాయకులతో వాకిటి శ్రీహరి సన్నాహక సమావేశం నిర్వహించి పాదయాత్రపై నాయకుల అభిప్రాయం తెలుసుకున్నారు. నూతనంగా ఎన్నికైన మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ప్రసన్నరెడ్డిని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో నర్సిములు, ఎండీ గౌస్, సదాశివారెడ్డి, రాజప్పగౌడ్, రవీందర్‌రెడ్డి, ప్రసన్నరెడ్డి, మహిమూద్, కురేషి, బోయ శరణప్ప, సలీం, లిఖి రఘు, కావలి నరహరి, వీరన్న, నర్సింహా, జ్ఞానేశ్వర్, చెన్నయ్య, గణేష్, సాగర్, రవి, లింగం, జలీల్‌బేగ్, లక్ష్మయ్య పాల్గొన్నారు.