సిద్దిపేట జిల్లాలో తొలిరోజు ప్రశాంతం
ABN , First Publish Date - 2023-04-04T00:30:33+05:30 IST
జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.
పదో తరగతి పరీక్షలు ప్రారంభం
14,183 మంది విద్యార్థులకు 9 మంది గైర్హాజరు
29 పరీక్షా కేంద్రాల్లో ఫ్లయింగ్‌స్క్వాడ్ బృందాల తనిఖీ
సిద్దిపేట క్రైం, ఏప్రిల్ 3 : జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో 84 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లను చేశారు. విద్యార్థులందరూ పరీక్షా కేంద్రాలకు గంటన్నర ముందు నుంచే చేరుకోవడం కనిపించింది. నిర్ణీత సమయానికి ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు. మొదటిరోజు కావడంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు కూడా కేంద్రాల వద్దకు తరలివచ్చారు. పరీక్ష సమయానికి అరగంట ముందు నుంచి విద్యార్థులను కేంద్రంలోనికి అనుమతించారు. మొదటిరోజు ప్రథమ భాషా పరీక్ష జరిగింది. జిల్లాలో 14,183 మంది విద్యార్థులకుగాను 9మంది గైర్హాజరయ్యారు. ఫ్లయింగ్‌స్క్వాడ్ బృందాలు జిల్లాలో 29 పరీక్షా కేంద్రాలను సందర్శించినట్లు విద్యాశాఖ అధికారి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. సిద్దిపేట పట్టణం మెదక్ రోడ్డులోని బాలుర హైస్కూల్, హైదరాబాద్ రోడ్డులోని కాకతీయ టెక్నోస్కూల్ పరీక్షా కేంద్రాలను అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్ సందర్శించారు. బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బందికి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించామని, పరీక్షలు జరిగే సమయంలో నలుగురు లేదా అంతకంటే ఎక్కువమంది గుమిగూడవద్దని సూచించారు. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు జరగడానికి జిల్లా యంత్రాంగం పోలీస్ శాఖ అన్ని చర్యలను చేపట్టిందని మహేందర్ తెలిపారు.