MLA Sitakka: సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్యే సీతక్క ఫైర్.. ఆమె ఏమన్నారంటే..
ABN , First Publish Date - 2023-08-26T12:49:04+05:30 IST
అమలు కాని పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసగించే ప్రయత్నం చేస్తున్నారని ఏఐసీసీ మహిళా
ఏటూరునాగారం(ములుగు): అమలు కాని పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసగించే ప్రయత్నం చేస్తున్నారని ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క(Mulugu MLA Dhanasari Sitakka) విమర్శించారు. మండల కేంద్రంలోని క్రాస్‌రోడ్డు వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. కాంగ్రెస్ నియోజవర్గ కోఆర్డినేటర్ ఇర్సవడ్ల వెంకన్న, మండల అధ్యక్షుడు చిటమట రఘు ఆధ్వర్యంలో పలువురు ఈ సందర్భంగా సీతక్క సమక్షంలో పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతం పలికిన ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలను మోసగిస్తున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్నారు. రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడించి కాంగ్రెస్ సత్తాను చాటాలన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఒరిగిందేమీ లేదని విమర్శించారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, బీఆర్‌ఎస్ గద్దె దిగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ. 500కే గ్యాస్, వృద్ధులకు రూ. 4 వేల పెన్షన్, ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం, 24 గంటల ఉచిత విద్యుత్, ఏకకాలంలోనే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, సొంత భూమి ఉన్న రైతులకు ఎకరానికి రూ. 15వేల సాయం, కౌలు రైతులకు కూడా అదే రూ. 15వేల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. భూమి లేని ఉపాధిహామీ రైతు కూలీలకు రూ. 12వేలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ఎమ్డీ. అయ్యూబ్‌ఖాన్, లాలయ్య, దేవేందర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ బాలరాజు, మండల యూత్ అధ్యక్షుడు వసంత శ్రీనివాస్, వంగపడ్ల రవి, ఉప సర్పంచ్ కర్ల అరుణ, అక్షిత్, ఎమ్డీ.గౌస్, సత్యం, మామిడి రాంబాబు, లక్ష్మి, విజయకుమార్, సిరాజ్, చింత రమేష్, గుండెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.