Muthireddy : పల్లాపై విరుచుకుపడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
ABN , First Publish Date - 2023-08-28T15:41:26+05:30 IST
బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సొంత పార్టీకి చెందిన కీలక నేత పల్లా రాజేశ్వరరెడ్డిపై విరుచుకుపడ్డారు. చేర్యాల పట్టణం వీరభద్ర గార్డెన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. భూ కబ్జా లకు పాల్పడినట్లు తనపై ఆరోపణలు చేస్తున్న విపక్షాలకు సవాల్ విసిరారు.
సిద్దిపేట : బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సొంత పార్టీకి చెందిన కీలక నేత పల్లా రాజేశ్వరరెడ్డిపై విరుచుకుపడ్డారు. చేర్యాల పట్టణం వీరభద్ర గార్డెన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. భూ కబ్జా లకు పాల్పడినట్లు తనపై ఆరోపణలు చేస్తున్న విపక్షాలకు సవాల్ విసిరారు. తాను ఎక్కడైనా భూ కబ్జాకు పాల్పడినట్లు నిరూపిస్తే ప్రాణత్యాగానికి సైతం సిద్ధమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు సేవ చేయడం నేర్పారు కానీ, భూ కబ్జాలు నేర్పలేదన్నారు. తాను ఎక్కడ భూ కబ్జా చేశానో నిరూపించాలని.. లేదంటే వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు.
ఇక పల్లా గురించి ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘పల్లా రాజేశ్వర్ రెడ్డి, జనగామ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులను డబ్బులతో కొనుగోలు చేస్తూ పార్టీని మలినం చేస్తున్నారు. ఇక్కడి క్యాడర్ ను పల్లా రాజేశ్వర్ రెడ్డి అయోమయానికి గురి చేస్తున్నారు. నియోజకవర్గంలోనే కాదు, తెలంగాణ బాగు కోసం సిఎం కేసీఆర్ అందరినీ ఏకం చేసి పార్టీలోకి తీసుకుంటే వారిని కుక్కలు నక్కలు అని అవమనపరిచారు. వారినే కాదు సీఎం కేసీఆర్‌ను సైతం పల్లా అవమాన పరిచారు.స్వయంగా దొడ్డి కొమురయ్య వరసుడుకి నీ కాలేజీలో సిట్ ఇవ్వమంటే ఇవ్వలేదు.. నువ్వేం ప్రజా సేవ చేస్తావు? తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏమిటి ? ఉద్యమంలో మా పైన ఎన్నో కేసులు ఉన్నాయి. జనగామ ప్రజలతో సంబందం లేని వ్యక్తివి, నీవు ఎలా సేవా చేస్తావొ చెప్పాలి’’ అని పేర్కొన్నారు.