మోత్కూరులో ఆధ్యాత్మిక శోభ
ABN , First Publish Date - 2023-03-06T00:48:46+05:30 IST
మోత్కూరులో ఈ నెలంతా ఆధ్యాత్మిక సందడి నెలకొననుంది.

మోత్కూరు, మార్చి 5: మోత్కూరులో ఈ నెలంతా ఆధ్యాత్మిక సందడి నెలకొననుంది. ఈ నెల 6నుంచి రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, 8 నుంచి నూతనంగా నిర్మించిన రామాలయంలో సీతారామచంద్రస్వామి విగ్రహాలు, ధ్వజస్థంభం ప్రతిష్ట, ఈ నెల 22న ప్రత్యేక తరహాలో ఉగాది పండుగ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వరుస కార్యక్రమాలతో ఈ నెలంతా ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోను న్నారు. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలో ఈ నెల 6 నుంచి 14 వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రామచంద్రుడు బంగారు లేడిని వేటాడటానికి వెళ్లినప్పుడు ఓ సూర్యోదయాన ఇక్కడ వెలిసిన శివలింగానికి పూజ చేసి వెళ్లాడని, అందుకే ఈ ఆలయానికి రామలింగేశ్వరస్వామి ఆలయంగా పేరొచ్చిందని చెబుతారు. సాధారణంగా దేవాలయాల ప్రధాన ప్రవేశ ద్వారాలు తూర్పు దిక్కు ఉంటుండగా ఈ ఆలయ ప్రవేశ ద్వారం పడమర దిక్కు ఉంది. ఆల యంలో గర్భగుడికి ఎదురుగా ఎతైన నంది విగ్రహం, ఆలయం ముందు ఎత్తైన రాతి స్తంభాల ద్వారం, ఆలయ ప్రవేశ ద్వారంపై కల్యాణ మండపం ఉన్నాయి. ప్రజలు కూర్చుని కల్యాణోత్సవాన్ని తిలకించడానికి తగినంత స్థలం లేక ఆలయం ముందు మరో కల్యాణ మండపం నిర్మించారు.
నేటి రాత్రి స్వామి వారి కల్యాణోత్సవం
ప్రతి ఏటా కాముని పౌర్ణమికి స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహి స్తారు. సోమవారం (ఈనెల 6న) రాత్రి రామలింగేశ్వర స్వామివారిని పల్లకిలో పట్టణమంతా ఊరేగింపు నిర్వహించి ఈ నెల 7న తెల్లవారు జా మున స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. 8న రాత్రి గరుఢసేవ, 10న రాత్రి రథోత్సవం, 12న రాత్రి స్వామివారిని ఊరేగింపు నిర్వహించి, 13న ఉదయం సూర్యోదయాని అగ్నిగుండాలు, 14న దోపోత్సవం నిర్వహిస్తారు.
8 నుంచి సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు
మోత్కూరు మునిసిపాలిటీ కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయంలో దాతలు, భక్తుల సహకారంతో నూతనంగా రామాలయం నిర్మించారు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో శ్రీసీతారామచంద్రస్వామి విగ్రహాలు, ధ్వజస్థంభం ప్రతిష్ట ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలు రకాల ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వరుసగా శ్రీరామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, సీతారాముల విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతున్నందున పట్టణమంతా లౌడ్‌స్పీకర్లు అమర్చారు. ఆలయాలను సుందరంగా అలంకరించారు.
22న ప్రత్యేక తరహాలో ఉగాది వేడుకలు
రామలింగేశ్వరస్వామి, సీతారామచంద్రస్వామి ఉత్సవాలు ముగిసిన వారం రోజుల్లోనే ఉగాది పండుగ వస్తున్నది. మోత్కూరులో ఉగాదిని ప్రత్యేక తరహాలో జరుపుకుంటారు. పట్టణంలోని అన్ని కుటుంబాల మహిళలు భక్తి శ్రద్ధలతో ముత్యాలమ్మ గ్రామ దేవతలకు బోనాలు వండి ప్రదర్శనగా తీసుకెళ్లి నైవేద్యం సమర్పిస్తారు. ఎడ్ల బండ్లు, కార్లు, లారీలు, ట్రాక్టర్లు లాంటి వాహనాలను కడిగి సుందరంగా అలంకరించి ప్రదర్శనగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణకు చేరుకుని బోనాల చుట్టు ప్రదక్షణగా తిప్పుతారు. మిగతా చోట్ల జరుపుకున్నట్టుగానే ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం తదితర కార్యక్రమాలు ఉంటాయి. ఉగాదికి మందు మటన్‌తో విందులు చేసుకోవడం ఇక్కడ ప్రత్యేకం.