Amit Shah: అమిత్‌షాకు నిర్మా స్వాగతం..!

ABN , First Publish Date - 2023-03-13T02:44:21+05:30 IST

బీజేపీకి వ్యతిరేకంగా నగరంలో మరోసారి వ్యంగ్యంతో కూడిన హోర్డింగ్‌ వెలిసింది. అమిత్‌షా.. సీఐఎ్‌సఎఫ్‌ రైజింగ్‌ డే పరేడ్‌లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతున్నట్లు పేర్కొంటూ గుర్తు తెలియని వ్యక్తులు దీనిని ఏర్పాటు చేశారు.

Amit Shah: అమిత్‌షాకు నిర్మా స్వాగతం..!

బీజేపీలో చేరిన నేతల ముఖాలతో హోర్డింగ్‌

హైదరాబాద్‌ సిటీ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): బీజేపీకి వ్యతిరేకంగా నగరంలో మరోసారి వ్యంగ్యంతో కూడిన హోర్డింగ్‌ వెలిసింది. అమిత్‌షా.. సీఐఎ్‌సఎఫ్‌ రైజింగ్‌ డే పరేడ్‌లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతున్నట్లు పేర్కొంటూ గుర్తు తెలియని వ్యక్తులు దీనిని ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌లోని జేబీఎస్‌ బస్టాండ్‌ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ హోర్డింగ్‌పై ‘వాషింగ్‌ పౌడర్‌ నిర్మా’ అని రాసి, ఆ ప్రకటనలోని బాలిక ముఖం స్థానంలో ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతల ముఖాలను మార్ఫింగ్‌ చేసి పెట్టారు. పలు ఆరోపణలతో సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసిన హిమంత్‌ బిశ్వశర్మ, నారాయణ రాణే, సువేందు అధికారి, సుజనా చౌదరి, అర్జున్‌ ఖోత్కర్‌, సింధియా, ఈశ్వరప్ప, విరూపాక్షప్పల ముఖాలను ఇందులో ఉంచారు. బీజేపీలో చేరగానే వీరంతా ‘నిర్మా వాషింగ్‌ పౌడర్‌’తో ఉతికిన బట్టల మాదిరిగా శుభ్రమయ్యారన్న అర్థం వచ్చేలా ఈ హోర్డింగ్‌ను ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-03-13T02:44:21+05:30 IST