ఎల్‌ఆర్‌ఎస్‌ ఏమైంది?

ABN , First Publish Date - 2023-01-04T23:32:55+05:30 IST

ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఎదురు చూపులు తప్పడం లేదు. వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ అధికారులు పూర్తి చేసినా ప్రభుత్వం నుంచి ఇంత వరకు తదుపరి ఆదేశాలు రాకపోవడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే గానీ అనుమతి లేని స్థలాలను క్రమబద్ధీకరించేందుకు చేసుకున్న దరఖాస్తుల్లో కదలిక వచ్చే అవకాశం కనిపించడం లేదు.

 ఎల్‌ఆర్‌ఎస్‌ ఏమైంది?

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల్లో కదలిక ఎప్పుడో ?

లేఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు 37,223 దరఖాస్తులు

మునిసిపాలిటీల్లో 21,041,

గ్రామ పంచాయతీల్లో 16,182 అభ్యర్థనలు

గడువు దాటి రెండేళ్లవుతున్నా కానరాని చర్యలు

రెగ్యులరైజేషన్‌ కోసం దరఖాస్తుదారులకు తప్పని ఎదురు చూపులు

ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఎదురు చూపులు తప్పడం లేదు. వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ అధికారులు పూర్తి చేసినా ప్రభుత్వం నుంచి ఇంత వరకు తదుపరి ఆదేశాలు రాకపోవడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే గానీ అనుమతి లేని స్థలాలను క్రమబద్ధీకరించేందుకు చేసుకున్న దరఖాస్తుల్లో కదలిక వచ్చే అవకాశం కనిపించడం లేదు.

వికారాబాద్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : అనుమతి లేని స్థలాలను క్రమబద్ధ్దీకరించేందుకు దరఖాస్తులు స్వీకరించి రెండేళ్లు గడిచిపోయినా ఇంత వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అక్రమ లేఔట్లు, అనుమతి లేని ప్లాట్లను క్రమబద్ధీరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2020, అక్టోబరు 31వ తేదీ వరకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. మునిసిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీల పరిధిలోనూ ఊహించని సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం జిల్లాలో 37,223 మంది ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా, గ్రామ పంచాయతీల పరిధిలో 16,182 దరఖాస్తులు, నాలుగు మునిసిపాలిటీల పరిధిలో 21,041 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో అప్పట్లో 435 అనధికార లేఔట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నాలుగు మునిసిపాలిటీ ల పరిధిలో 214 అక్రమ లేఔట్లు ఉండగా, 15 మండలాల్లో 59 గ్రామ పంచాయతీల పరిధిలో 221 అక్రమ లేఔట్లు ఉన్నట్లు పంచాయతీ, మునిసిపల్‌ అధికారులు తేల్చారు. పరిగి మునిసిపల్‌ పరిధిలో 117, వికారాబాద్‌ మునిసిపల్‌ పరిధిలో 81, తాండూరు మునిసిపల్‌ పరిధిలో 11, కొడంగల్‌ మునిసిపల్‌ పరిధిలో 5 అక్రమ లేఔట్లు ఉండగా,. పరిగి మునిసిపాలిటీలో 8,214, వికారాబాద్‌లో 3,018, తాండూరులో 900, కొడంగల్‌ మునిసిపాలిటీ పరిధిలో 480 అక్రమ ప్లాట్లు ఉన్నట్లు అఽధికారులు గుర్తించారు. కాగా, మునిసిపల్‌, పంచాయతీ అధికారుల దృష్టికి రాని అక్రమ ప్లాట్ల యజమానులు ఎంతో మంది ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. మునిసిపాలిటీల పరిధిలోని అక్రమ లేఔట్లలో మొత్తం 12,675 ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించగా, అక్రమ ప్లాట్లను క్రమబద్దీకరించుకునేందుకు 21,041 దరఖాస్తులు రావడం విశేషం. అత్యధికంగా తాండూరులో 12,347 దరఖాస్తులు రాగా, పరిగిలో 4,239, వికారాబాద్‌లో 4,041, కొడంగల్‌లో 414 దరఖాస్తులు వచ్చాయి. అదే పంచాయతీల పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం గతంలో ఎన్నడూలేని విధంగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో 247 పంచాయతీల పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం 16,182 దరఖాస్తులు వచ్చాయి. లేఔట్‌ క్రమబద్దీకరణకు దరఖాస్తు ఛార్జీ కింద రూ.10 వేలు, ప్లాట్‌ క్రమబద్దీకరణకు రూ.1,000 రుసుము చెల్లించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పత్రాలన్నీ సక్రమంగా ఉన్నట్లు అధికారులు భావిస్తే... ప్లాట్లు పరిశీలించి నిబంధనల ప్రకారం రోడ్లకు అవసరమయ్యే స్థలం ప్లాట్‌ నుంచి మినహాయించుకున్న తరువాత మిగతా ప్లాట్‌కు ఎంత ఛార్జీ చెల్లించాలనేది తెలియజేయనున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ప్రభుత్వం 2021, జనవరి 31వ తేదీ వరకు పూర్తి చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం నిర్దేశించిన గడువు ముగిసి రెండేళ్లు కావస్తున్నా.. ఇంత వరకు క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

దరఖాస్తులతోనే రూ.4.15 కోట్ల ఆదాయం...

ఇదిలా ఉంటే, మునిసిపాలిటీలు, పంచాయతీలకు ఎల్‌ఆర్‌ఎస్‌ కాసులు కురిపించింది. జిల్లాలో అధికారులు ఊహించిన సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ప్లాట్‌ యజమాని దరఖాస్తు ఛార్జీల కింద రూ.1,000 చెల్లిస్తే, లేఔట్ల యజమానులైతే ఒక్కో లేఔట్‌కు రూ.10 వేలు చెల్లించారు. వచ్చిన దరఖాస్తులతోనే ప్రభుత్వ ఖజానాకు రూ.4,15,83,000 ఆదాయం సమకూరింది. లేఔట్లు, ప్లాట్లు క్రమబద్దీకరణ ప్రక్రియ పూర్తి చేస్తే ప్రభుత్వానికి వందల కోట్లలో ఆదాయం సమకూరనుంది. ఈ నిధులతో మునిసిపాలిటీలు, పంచాయతీల పరిధిలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే గానీ ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల్లో కదలిక వచ్చే అవకాశం కనిపించడం లేదు. అక్రమ లేఔట్లలో యజమానుల నుంచి నేరుగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకోని వారికి ఎదురు చూపులు తప్పడం లేదు. కొనుగోలు చేసిన ప్లాట్లకు సంబంధించి మొత్తం డబ్బులు చెల్లించినా ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోవడంతో యజమానులు కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్‌ చేయలేని పరిస్థితి ఏర్పడింది.

Updated Date - 2023-01-04T23:32:56+05:30 IST