Vinaya Bhaskar: మా సహనాన్ని పరీక్షించొద్దు.. సహనం కోల్పోతే మేమేంటో చూపిస్తాం..

ABN , First Publish Date - 2023-08-27T12:55:10+05:30 IST

‘మా సహనాన్ని పరీక్షించవద్దు, సహనం కోల్పోతే మేమేంటో చూపించాల్సి వస్తుంది’ అని ప్రతిపక్ష పార్టీలను

Vinaya Bhaskar: మా సహనాన్ని పరీక్షించొద్దు.. సహనం కోల్పోతే మేమేంటో చూపిస్తాం..

హనుమకొండ(వరంగల్): ‘మా సహనాన్ని పరీక్షించవద్దు, సహనం కోల్పోతే మేమేంటో చూపించాల్సి వస్తుంది’ అని ప్రతిపక్ష పార్టీలను వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయభాస్కర్‌(Dasyaam Vinayabhaskar) హెచ్చరించారు. శనివారం హనుమకొండలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వినయభాస్కర్‌ మాట్లాడుతూ.. మూడురోజుల కిందట తన క్యాంపు కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు భౌతిక దాడులకు పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు దాడుల సంస్కృతిని మానుకోవాలని హితవుపలికారు. లేదంటే తామేంటో చూపిస్తామని హెచ్చరించారు. సోషల్‌ మీడియాలో అబద్దపు ప్రచారాలు చేస్తున్న ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు సూచించారు. 2014 తర్వాత జరిగిన అభివృద్ధి ఏంటో ప్రజలకు తెలుసని వినయభాస్కర్‌ తెలిపారు. అభివృద్ధి విషయంలో చర్చకు సిద్దమని ఆయన సవాల్‌ విసిరారు. ప్రతిపక్షాలు విమర్శించే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తన కుటుంబ సభ్యులని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం మనదేనని ధీమా వ్యక్తం చేశారు.

DASYAM.jpg

బీఆర్‌ఎస్‌ శ్రేణులు రాబోయే వంద రోజులు నిబద్ధతతో పని చేయాలని వినయభాస్కర్‌ సూచించారు. కార్పొరేటర్లు, డివిజన్‌ పార్టీ అధ్యక్షులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎటువంటి పనులు ఇంకా చేయాలో తన దృష్టికి తీసుకురావాలన్నారు. అక్టోబర్‌ 1నుంచి పార్టీ శ్రేణులు నియోజకవర్గంలో పర్యటించి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించాలన్నారు. సోమవారం విష్ణుప్రియ గార్డెన్స్‌లో జరిగే సమావేశంలో పార్టీ శ్రేణులు పాల్గొనాలన్నారు. తనకు మరోసారి ఎన్నికల బరిలో నిలిచే అవకాశం కల్పించిన కేసీఆర్‌కు మద్దతు తెలపడంతోపాటు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చిన ప్రతీ ఒక్కరికి వినయభాస్కర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో రైతు రుణ విముక్తి కమిషన్‌ చైర్మన్‌ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్‌ సంగంరెడ్డి సుందర్‌రాజ్‌, నేతలు మర్రి యాదవరెడ్డి, అజీజ్‌ఖాన్‌, దర్శన్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-27T12:55:12+05:30 IST