Ambati Rambabu: పిన్నెల్లి అరెస్టుపై అంబటి కొత్త రాగం.. స్వయంగా ఆయనే వెళ్లి..
ABN , Publish Date - Jun 27 , 2024 | 06:00 PM
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కొత్త రాగం అందుకున్నారు. పోలీసులు పిన్నెల్లిని అదుపులోకి తీసుకోలేదని...
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) అరెస్టుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) కొత్త రాగం అందుకున్నారు. పోలీసులు పిన్నెల్లిని అదుపులోకి తీసుకోలేదని, స్వచ్ఛందంగా ఆయనే లొంగిపోయారంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందే పిన్నెల్లిని ఓడించాలని ప్లాన్ చేశారని.. ఆ పథకం ప్రకారమే పనులు కానిచ్చారని ఆరోపించారు. పిన్నెల్లి కుటుంబాన్ని వేధించాలని చూస్తున్నారని.. కుట్రపూరితంగా ఆయనపై కేసులు పెట్టారని పేర్కొన్నారు.
కేవలం పిన్నెల్లిని వేధించడమే కాదు.. తమ వైసీపీ నాయకులపై కూడా కేసులు పెడతారని, అప్పుడు తాము లీగల్‌గా పోరాడుతామని అంబటి రాంబాబు తెలిపారు. వైసీపీ చాలా బలమైన రాజకీయ పార్టీ అని, తమపై ఎన్ని కేసులు పెట్టినా మరింతగా రాటుదేలుతామే తప్ప భయపడేదే లేదని అన్నారు. జిల్లాల్లో పార్టీ ఆఫీస్‌ల నిర్మాణానికి స్థలాలు ఇచ్చేందుకు.. చంద్రబాబు హయాంలోనే జీవోలు ఇచ్చారని గుర్తు చేశారు. టీడీపీ ఎంపీలు, మంత్రులు తమ పార్టీ ప్రాంగణానికి వెళ్లి, ప్రెస్‌మీట్లు పెట్టి మరీ కూల్చేస్తామని ఎలా అంటారని ప్రశ్నించారు. మీరు తీసుకొచ్చే సంప్రదాయాలు మీకే ప్రమాదాన్ని తీసుకొస్తాయని రాంబాబు టీడీపీని హెచ్చరించారు.
ఇదిలావుండగా.. మే 13వ తేదీన పోలింగ్ రోజు రెంటచింతల మండలంలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి ఓ ఈవీఎంను ధ్వంసం చేసిన విషయం అందరికీ తెలిసింది. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వడం, ఆ వీడియో బయటకు రావడంతో.. పిన్నెల్లిపై 506, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ఎన్నికల వేళ పాల్పడిన నేరాలకు సంబంధించి హైకోర్టు తాత్కాలిక ఉపశమనం కల్పించడంతో పిన్నెల్లి ఇన్నాళ్లూ అరెస్ట్ కాలేదు. ఇటీవల ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో.. పోలీసులు పిన్నెల్లిని నరసరావుపేటలో అదుపులోకి తీసుకున్నారు.
Read Latest Andhra Pradesh News and Telugu News