Share News

Revenue conference : అర్జీలే అర్జీలు

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:34 AM

జిల్లాలో భూసమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సులు శుక్రవారం అట్టహాసంగా మొదలయ్యాయి. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులకు బాధితులు వినతిపత్రాలను సమర్పించారు. అక్కడికక్కడే రికార్డులను పరిశీలించి, వారికి న్యాయం చేయడానికి ప్రయత్నించారు. తొలిరోజు 32 ...

 Revenue conference : అర్జీలే అర్జీలు
Whip Kalava speaking at the revenue conference held in Udegol

రెవెన్యూ సదస్సులకు ఫిర్యాదుల వెల్లువ

తొలిరోజు 32 మండలాల్లో 456 వినతులు

అనంతపురం టౌన, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో భూసమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సులు శుక్రవారం అట్టహాసంగా మొదలయ్యాయి. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులకు బాధితులు వినతిపత్రాలను సమర్పించారు. అక్కడికక్కడే రికార్డులను పరిశీలించి, వారికి న్యాయం చేయడానికి ప్రయత్నించారు. తొలిరోజు 32


మండలాలలోని 35 రెవెన్యూ గ్రామాలలో సదస్సులు నిర్వహించారు. మొత్తం 456 మంది వినతిపత్రాలు సమర్పించారని డీఆర్వో మలోలా తెలిపారు.

ఆ చట్టం రద్దుతో రైతులకు ఊరట: కాలవ

కణేకల్లు: ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని రద్దు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు ఊరట కలిగించారని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు అన్నారు. ఉడేగోళంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. జగన ప్రభుత్వం ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం ద్వారా పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తిని తమ అనుకూలురకు అప్పజెప్పేందుకు కుట్ర చేసిందని అన్నారు. దీనిపై చంద్రబాబు రైతులలో చైతన్యం తెచ్చారని అన్నారు. వైసీపీ హయాంలో రీసర్వే పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. తమ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరిస్తుందని అన్నారు. ఉడేగోళం గ్రామం జలజీవన, స్వచ్ఛభారతలో వందశాతం ఫలితాలు సాధించి, జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీగా నిలవడం హర్షణీయమని అన్నారు. సర్పంచ లావణ్య, క్లస్టర్‌ ఇనచార్జి మారుతిప్రసాద్‌లను అభినందించారు. తహసీల్దార్‌ ఫణికుమార్‌, ఎంపీడీఓ శ్రీనివాసులు, టీడీపీ నాయకులు లాలెప్ప, హనుమంతరెడ్డి, ఆనంద్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

అక్రమార్కులను వదిలిపెట్టం : పరిటాల సునీత

చెన్నేకొత్తపల్లి: వైసీపీ హయాంలో భూ కబ్జాలకు పాల్పడ్డవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత హెచ్చరించారు. కనుముక్కలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆమె పాల్గొన్నారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. యజమానులకు తెలియకుండా భూములను అమ్మడం, ఆనలైనలో రికార్డులు మార్చేయడం వంటి అక్రమాలలో వీఆర్వో మహేశ్వరరెడ్డి పాత్ర ఉందని అన్నారు. ఆయన చర్యలు తీసుకోవాలని ధర్మవరం ఆర్డీఓ మహేశను కోరారు. కుటుంబ తగాదాలను స్వయం గా పరిష్కరించుకోవాలని ప్రజలకు సూచించారు. వీఆర్వోపై అనేక ఫిర్యాదులు వచ్చాయని, విచారణ నివేదికను కలెక్టర్‌కు పంపుతామని ఆర్డీఓ తెలిపారు. వీఆర్వోపై కచ్చితంగా చర్యలు ఉంటాయని అన్నారు. సదస్సులో తహసీల్దార్‌ సురేశకుమార్‌, ఎంపీడీఓ శివశంకరప్ప, టీడీపీ సీనియర్‌ నాయకుడు ఎల్‌ నారాయణచౌదరి, మండల కన్వీనర్‌ ముత్యాల్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దండు ఓబులేసు, మాజీ ఎంపీపీ అంకే అమరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

కబ్జాలపై ఫిర్యాదు చేయండి: దగ్గుపాటి

అనంతపురం రూరల్‌: భూకబ్జాలపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ బాధితులకు సూచించారు. అనంతపురం రూరల్‌ పంచాయతీ కార్యాలయంలో తహసీల్దార్‌ హరికుమార్‌ అధ్యక్షతన జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన ప్రసంగించారు. జేసీ శివనారాయణ్‌ శర్మ, ఆర్డీఓ కేశవనాయుడు హాజరయ్యారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఎక్కువ శాతం భూ ఆక్రమణలపై అర్జీలు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వంలో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున భూకబ్జాలు జరిగాయని ఎమ్మెల్యే అన్నారు. అమాయకులను బెదిరించి భూములు లాగేసుకున్నారని అన్నారు. భూ కబ్జాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియ్‌సగా ఉన్నారని, ఎంతటి వారినైనా జైలుకు పంపుతామని అన్నారు. నియోజకవర్గంలో సర్వేయర్ల కొరత ఉందని జేసీ దృష్టికి తీసుకెళ్లారు. మండలానికి రెగ్యులర్‌ సర్వేయర్‌ను నియమించాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, అంగనవాడీ భవనాలకు స్థలాలు కేటాయించాలని కోరారు. వంకలలో ఆక్రమణలు తొలగించాలని కోరారు.

సమస్యలను పరిష్కరిస్తాం: జేసీ

‘మీ గ్రామంలో మీ సమస్యల పరిష్కారానికి మీ భూమి-మీ హక్కు నినాదంతో ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని జేసీ శివనారాయణ శర్మ అన్నారు. భూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. కోర్టు పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు మాత్రం తమకు అవకాశం ఉండదని అన్నారు. అలాంటి వాటిని కోర్టు పరిధిలోనే పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఎం ఆనంద్‌, ఎంపీడీఓ దివాకర్‌, పంచాయితీ కార్యదర్శి శ్రీధర్‌రావు, సర్పంచు ఉదయశంకర్‌, ఎంపీటీసీ ఆశాజ్యోతి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 07 , 2024 | 12:34 AM