Payyavula Keshav: ఎన్నేళ్లో వేచిన ఉదయం..!
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:58 PM
ఆయనది మూడు దశాబ్దాల రాజకీయం. ఎన్టీఆర్ పిలుపుతో 1994లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. అప్పటికి ఆయన వయస్సు 29 ఏళ్లు. యువకుడిగా రాజకీయాల్లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఉన్నత విద్యావంతుడు కావడంతో విషయ పరిజ్ఞానం పెంచుకున్నారు. ఎంబీఏ పూర్తి చేసిన ఆయన నోటి వెంట మాట వచ్చిందంటే తూటాలా పేలుతుంది. భాషపై పట్టు.. యాస, ప్రాసను సమపాళ్లలో పండించగల దిట్ట. మైక్ తీసుకున్నారంటే మాటాల్లో వాడి.. వేడి స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనే ..
మంత్రిగా పయ్యావుల ప్రమాణం
ఉరవకొండలో విజయం.. పార్టీకి అధికారం
1994 తరువాత బద్ధలైన బ్యాడ్ సెంటిమెంట్
అనంతపురం, జూన్ 12(ఆంధ్రజ్యోతి): ఆయనది మూడు దశాబ్దాల రాజకీయం. ఎన్టీఆర్ పిలుపుతో 1994లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. అప్పటికి ఆయన వయస్సు 29 ఏళ్లు. యువకుడిగా రాజకీయాల్లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఉన్నత విద్యావంతుడు కావడంతో విషయ పరిజ్ఞానం పెంచుకున్నారు. ఎంబీఏ పూర్తి చేసిన ఆయన నోటి వెంట మాట వచ్చిందంటే తూటాలా పేలుతుంది. భాషపై పట్టు.. యాస, ప్రాసను సమపాళ్లలో పండించగల దిట్ట. మైక్ తీసుకున్నారంటే మాటాల్లో వాడి.. వేడి స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనే ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (Payyavula Keshav). అసెంబ్లీ టైగర్ అని అభిమానులు, సహచర నాయకులు పొగుడుతుంటారు. రాజకీయంగా ఎన్నో ఎత్తు పళ్లాలను చూసిన
కేశవ్.. మంత్రి అయ్యేందుకు ఏకంగా 30 ఏళ్లు పట్టింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఉరవకొండలో చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళం సభలో స్థానిక ఎమ్మెల్యే హోదాలో పయ్యావుల కేశవ్ చెప్పిన మాటలు అక్షర సత్యం అయ్యాయి. ‘సెంటిమెంట్‌ను బ్రేక్ చేయడం ఖాయం. 1994 రిపీట్ అవుతుంది’ అని కేశవ్ ధీమాగా అన్నారు. అదే నిజమైంది. అచ్చం అప్పటిలాగే కేశవ్ గెలిచారు.. పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదనంగా మంత్రి పదవి వరించింది.
ఎన్టీఆర్ పిలుపుతో...
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పిలుపుతో పయ్యావుల కేశవ్ 1994లో రాజకీయ ఆరంగ్రేటం చేశారు. ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి వై.శివరామిరెడ్డిపై విజయం సాధించారు. ఆ తరువాత 1999 ఎన్నికల్లో పయ్యావుల ఓటమి చవిచూశారు. 2004, 2009 ఎన్నికల్లో వరుస విజయాలు అందుకున్నారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో పయ్యావుల ఓడిపోయారు. ఆ తరువాత 2019, 2024 ఎన్నికల్లో వరుస విజయాలను అందుకున్నారు. ఇప్పటికి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పయ్యావుల.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1994 నుంచి 2024 వరకూ జరిగిన ఏడు సార్వత్రికలో కేవలం రెండుసార్లు పయ్యావుల ఓటమి చెందారు.
సెంటిమెంట్‌కు బ్రేక్ పడిందిలా..
ఉమ్మడి ఆంధ్రప్రదేశలోని అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం నుంచి 1994 ఎన్నికల్లో పయ్యావుల తొలిసారి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత 1999 ఎన్నికల్లో పయ్యావుల ఓడిపోయారు కానీ, టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2004, 2009 ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ గెలుపొందారు. టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2014లో పయ్యావుల ఓటమి చెందారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019లో కేశవ్ గెలుపొందారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది. తాజా ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ విజయం సాధించారు. కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పటి వరకూ కొనసాగిన సెంటిమెంట్‌కు బ్రేక్ పడింది.
వివిధ హోదాల్లో..
1997 నుంచి 1999 వరకూ టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా పయ్యావుల కేశవ్ పనిచేశారు. 2002-09 వరకూ పార్టీ విప్‌గా కొనసాగారు. 2009-12 వరకూ అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్ కమిటీ మెంబర్‌గా ఉన్నారు. 2004-14 వరకూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. 2015లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ చీప్ విప్‌గా పనిచేశారు. 2019 నుంచి ఆయన పీఏసీ చైర్మనగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి మంత్రి పదవి చేపట్టారు.
కుటుంబ రాజకీయ నేపథ్యం..
తండ్రి వారసత్వం పుచ్చుకుని.. పయ్యావుల కేశవ్ రాజకీయాల్లో ప్రవేశించారు. 1994లో టీడీపీ అభ్యర్థిగా ఆరంగేట్రం చేశారు. పయ్యావుల కేశవ్ తండ్రి పయ్యావు వెంకటనారాయణ కాంగ్రెస్ పార్టీ తరఫున 1975లో రాయదుర్గం నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకుముందు ఆయన డీసీసీ అధ్యక్షుడిగా, రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు సమితి అధ్యక్షుడిగానూ పనిచేశారు.
39 ఏళ్ల తర్వాత మంత్రి పదవి
ఉరవకొండ నియోజకవర్గానికి 39 ఏళ్ల తర్వాత మంత్రి పదవి దక్కింది. ఇక్కడి నుంచి గెలిచిన గుర్రం నారాయణప్ప 1985లో మంత్రి అయ్యారు. ఆ తరువాత ఎవరినీ అదృష్టం వరించలేదు. ఇన్నేళ్ల తరువాత టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్‌కు మంత్రివర్గంలో స్థానం లభించింది. 1994లో కేశవ్ తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత మరో నాలుగుసార్లు గెలిచారు. ఉరవకొండ నియోజకవర్గం నుంచి వరుసగా ఏడుసార్లు ఆయన పోటీ చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా, కేశవ్ ఓటమి చెందారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చారుగాని.. మంత్రి పదవి దక్కలేదు. ఈసారి మాత్రం నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తూ.. కేశవ్‌కు మంత్రి పదవి ఇచ్చారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....