Share News

AMILINENI: కళ్యాణదుర్గం కంచుకోటలో టీడీపీదే విజయం

ABN , Publish Date - May 11 , 2024 | 12:08 AM

కళ్యాణదుర్గంలో టీడీపీ విజయం ఖాయమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ప్రజావేదిక వద్ద వివిధ గ్రామాల నుంచి భారీఎత్తున టీడీపీలోకి చేరారు. వీరందరికీ అమిలినేని కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు.

AMILINENI: కళ్యాణదుర్గం కంచుకోటలో టీడీపీదే విజయం
టీడీపీలోకి చేరిన వారితో అమిలినేని సురేంద్రబాబు

కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు

కళ్యాణదుర్గం, మే 10: కళ్యాణదుర్గంలో టీడీపీ విజయం ఖాయమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ప్రజావేదిక వద్ద వివిధ గ్రామాల నుంచి భారీఎత్తున టీడీపీలోకి చేరారు. వీరందరికీ అమిలినేని కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామానికి చెందిన 13 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన తొమ్మిది వైసీపీ కుటుంబాలు చేరాయి. నియోజకవర్గంలోని భవన నిర్మాణ కార్మికులంతా కలసి సురేంద్రబాబుకు మద్దతు తెలిపారు. మున్సిపల్‌ పరిధిలోని మసీదులకు అమిలినేని వెళ్లి మైనార్టీలతో కలసి టీడీపీకి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. టీడీపీకే తమ మద్దతు అని వారు వారు అభయం ఇచ్చారు. ప్రజావేదిక వద్ద బసవేశ్వరస్వామి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


విరక్తి మఠం పీఠాధిపతి కళ్యాణస్వామి ఆశీస్సులను అమిలినేని తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రజలందరు టీడీపీకి బ్రహ్మరథం పడుతూ అపూర్వ స్వాగతం పలుకుతున్నారన్నారు. ప్రతి గ్రామంలో రోజురోజుకు ప్రజాబలం పెరుగుతోందన్నారు. వైసీపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా వచ్చేది టీడీపీయేనని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో కళ్యాణదుర్గం నియోజకవర్గమంతా అస్తవ్యస్థ పరిపాలనకు తెరలేపారన్నారు. ఎక్కడ చూసినా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసేవారే కనిపిస్తున్నారన్నారు. నియోజవకర్గంలో టీడీపీకి ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నారు. మున్సిపాలిటీ అంతా దుర్గంధమయంగా మారిపోయి అస్తవ్యస్తంగా తయారైందన్నారు.


మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాల్టీగా తీర్చిదిద్ది ఆదాయ వనరుగా మార్చడమే తన ప్రధాన ధ్యేయమన్నారు. సూపర్‌సిక్స్‌ పథకాలు అన్ని వర్గాల ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయన్నారు. భావితరాల భవిష్యత్తు అభివృద్ధి పథంలో వుండాలంటే విజన వున్న నాయకుడు చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్నారు. అందరూ కలిసికట్టుగా చంద్రబాబును సీఎంగా గెలిపించుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పల్లెప్రాంతాలన్నీ అభివృద్ధి లేక అధ్వానస్థితికి చేరుకున్నాయన్నారు. ఇలా వుండటానికి కారణం ఒక్క వైసీపీ పరిపాలనే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అభివృద్ధిని ఆలోచించి సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకునే దిశగా వుండాలన్నారు. అప్పుడే మన ఊరు మన ప్రాంతం అభివృద్ధి చెందేందుకు అవకాశం వుంటుందన్నారు. వైసీపీ మేనిఫెస్టోలో బొమ్మలు తప్ప అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా లేవన్నారు. 13వ తేదీన ఓటు అనే ఆయుధంతో ప్రతి ఒక్కరు టీడీపీని ఆదరించి గెలిపించాలని కోరారు.

Updated Date - May 11 , 2024 | 12:08 AM