YS Jagan: లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. ఏమన్నారంటే..
ABN , Publish Date - Sep 20 , 2024 | 03:59 PM
YS Jagan Reacts on Tirumala Issue: తిరుమలలో నెయ్యి కల్తీ వివాదంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ఇదంతా చంద్రబాబు అల్లిన కట్టుకథ అని ఆరోపించారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని.. తప్పుడు ఆరోపణలతో భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.. ఇంకా చాలా కామెంట్స్ జగన్ చేశారు.. పూర్తి కథనం మీకోసం..
అమరావతి, సెప్టెంబర్ 20: తిరుమల ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ వస్తున్న ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఖండించారు. ఒక సీఎం ఇలా అబద్ధాలు ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా? అని నిలదీశారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన జగన్.. తిరుమల లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీ జరిగినట్లు వంద రోజుల తరువాత ఎందుకు బయటకొచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే కల్తీ జరిగినట్లు తేలిందన్నారు. దశాబ్దాలుగా లడ్డూ తయారీ విధానంలో ఒకే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
100 రోజుల పాలనలో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేకపోయారని.. వారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొత్త వివాదాన్ని తెరమీదకు తీసుకువచ్చారని జగన్ ఆరోపించారు. లడ్డూ తయారీకి వాడే నెయ్యి కల్తీ అయ్యిందంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలు కట్టుకథ అని అన్నారు. చంద్రబాబు హయాంలోనూ క్వాలిఫై అవ్వని నెయ్యిని రిజెక్ట్ చేశారని జగన్ గుర్తు చేశారు. నెయ్యిలో జంతు కొవ్వు కలిపారని చెప్పడం న్యాయమేనా? అని ప్రశ్నించారు. శాంపిల్స్ క్వాలిఫై అని రిపోర్ట్ వచ్చిన తరువాతే నెయ్యి ట్యాంకర్‌ను తిరుమలకు పంపిస్తారని జగన్ వివరించారు.
ప్రతి విషయంలోనూ డైవర్షన్ పాలిటిక్సే కనిపిస్తున్నాయని కూటమి ప్రభుత్వం తీరుపై జగన్ విమర్శలు గుప్పించారు. ఆటవిక పాలనపై ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తే మదనపల్లి ఫైల్స్ దగ్ధం పేరుతో డైవర్షన్ చేశారని.. స్కాముల్లో తనను అరెస్ట్ చేశారంటూ ఐఏఎస్, ఐపీఎస్‌లను వేధిస్తున్నారని జగన్ ఆరోపించారు. ముంబై నుంచి హీరోయిన్‌ను తీసుకొచ్చి మరో డైవర్షన్‌కు తెర తీశారని జగన్ ఆరోపించారు.
ఆ భగవంతుడిని కూడా రాజకీయాలకు వాడుకోవడం ఏంటని అన్నారు జగన్. లడ్డూ తయారీ చేసే నెయ్యిలో జంతువుల కొవ్వు అనేది కట్టుకథ అని అన్నారు. ఇంతటి నీచమైన పనిని ఎవరైనా చేస్తారా? అని ప్రశ్నించారు. ఒక ముఖ్యమంత్రి ఇలా పచ్చి అబద్ధాలు చెప్పడం ఏంటన్నారు. ప్రతి 6 నెలలకు ఓసారి నెయ్యి సరఫరా కోసం టెండర్లు పిలుస్తారని.. నెయ్యి నాణ్యత నిర్ధారణ పరీక్షను ఎవరూ మార్చలేదన్నారు. దశాబ్దాలుగా జరుగుతున్న పద్ధతుల్లోనే తిరుమలలో లడ్డూ తయారీ జరుగుతోందని జగన్ స్పష్టం చేశారు.
ఏళ్లుగా కొనసాగుతున్నట్లుగానే.. ఒకే విధానంలో లడ్డూ తయారీ సామాగ్రి కొనుగోలు ప్రక్రియ జరుగుతుందన్నారు జగన్. నెయ్యి తెచ్చే ప్రతి ట్యాంకర్ NABL సర్టిఫికెట్ తీసుకుని రావాల్సి ఉంటుందన్నారు. ప్రతి ట్యాంకు శాంపిళ్లను మూడుసార్లు టెస్ట్ చేస్తారని.. మూడు టెస్టులు పాసైతేనే ఆ సామాగ్రిని టీటీడీ అనుమతిస్తుందని జగన్ చెప్పారు. చంద్రబాబు జరగనిది జరిగినట్లు అబద్ధాలు చెబుతున్నారని జగన్ విమర్శించారు. జులై 12న శాంపిల్స్ తీసుకున్నారని.. అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే ఉన్నారు కదా? అని జగన్ ప్రశ్నించారు. జులై 17న NDDBకి నెయ్యి శాంపిల్స్ పంపించారని.. NDDB ఆ రిపోర్ట్‌ను జులై 23న అందజేసిందన్నారు. మరి జులై 23న రిపోర్ట్ వస్తే ఇప్పుడు చంద్రబాబు మాట్లాడడం ఏంటని జగన్ అన్నారు.