Share News

Jagan vs Sharmila: ఎవరు ఎవరికి అన్యాయం చేశారు.. ఇద్దరి వాదనల్లో నిజమెంత..?

ABN , Publish Date - Oct 30 , 2024 | 04:12 PM

కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కోసం ఎందుకు పనిచేస్తుందనే విషయాన్ని వైసీపీ మర్చిపోయిందా.. లేదంటే షర్మిలను రాజకీయంగా దెబ్బతీయడానికి జగన్ అసత్య ప్రచారాన్ని చేస్తున్నారా.. అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది. షర్మిల నిజంగానే జగన్‌కు అన్యాయం చేస్తుందా.. లేదంటే జగన్ తన సోదరి షర్మిల, తల్లి విజలక్ష్మికి అన్యాయం ..

Jagan vs Sharmila: ఎవరు ఎవరికి అన్యాయం చేశారు.. ఇద్దరి వాదనల్లో నిజమెంత..?
Jagan and Sharmila

వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కుట్రపన్నారంటూ వైసీపీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. జగన్ సోదరి షర్మిల, తల్లి విజయలక్ష్మి టీడీపీ కోసం పనిచేస్తున్నారంటూ పోస్టులు, కామెంట్లు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కోసం ఎందుకు పనిచేస్తుందనే విషయాన్ని వైసీపీ మర్చిపోయిందా.. లేదంటే షర్మిలను రాజకీయంగా దెబ్బతీయడానికి జగన్ అసత్య ప్రచారాన్ని చేస్తున్నారా.. అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది. షర్మిల నిజంగానే జగన్‌కు అన్యాయం చేస్తుందా.. లేదంటే జగన్ తన సోదరి షర్మిల, తల్లి విజలక్ష్మికి అన్యాయం చేశారా.. షర్మిలకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడని నేతలంతా ప్రస్తుతం జగన్‌కు మద్దతుగా గొంతు ఎందుకు వినిపిస్తున్నారు. ఈ ప్రశ్నలన్నీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.


2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి రావడంలో జగన్ సోదరి, రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల పాత్రను ఎవరూ తీసిపారేయలేరనేది సుస్పష్టం. తన అన్నయ్యను సీఎం చేయడం కోసం షర్మిల రాష్ట్రమంతా పర్యటించి.. వైసీపీ తరపున ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఎవరూ ఊహించని విధంగా ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఆ తర్వాత తన గెలుపు కోసం కష్టపడిన చెల్లి షర్మిలను జగన్ పక్కనపెట్టేయడంతో ఫ్యామిలీ వార్ మొదలైనట్లు ప్రచారం జరిగింది. తాజాగా షర్మిల తల్లి విజయలక్ష్మి విడుదల చేసిన బహిరంగ లేఖలో 2019లో జగన్ ఆస్తుల విభజన ప్రతిపాదన తీసుకొచ్చారనే విషయాన్ని ప్రస్తావించారు. ఈ ఒక్క విషయంతోనే షర్మిల రాజకీయంగా ఎదిగితే తన కుటుంబానికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందనే ఆలోచనతోనే జగన్ ఆ ప్రతిపాదనను తీసుకొచ్చారా అనే అనుమానాలు కలుగకమానవు.


షర్మిలను తప్పించేందుకేనా..

2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం కృషి చేయడంతో పాటు సొంత సోదరి కావడంతో ఆమెకు జగన్ ఏదైనా పదవిని ఇచ్చి ఉండాల్సింది. షర్మిలకు ప్రభుత్వంలో ఏదైనా పదవి ఇస్తే.. తాను రాజకీయంగా ఎదిగితే జగన్ తర్వాత పార్టీలో షర్మిల ప్రాధాన్యత పెరుగుతుందనే ఉద్దేశంతోనే ఆమెను రాజకీయంగా ఎదగకుండా జగన్ ప్లాన్ చేశారా అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. ఆస్తుల పంపకం ప్రతిపాదనను తీసుకురావడంతో పాటు పార్టీలో ఎలాంటి పదవి ఆశించకుండా ఉండేందుకే షర్మిలకు ఆస్తుల పంపకంలో ఎక్కువ వాటాను ఆశ చూపించారా అనే అనుమానం కలుగుతోంది. ఏపీ రాజకీయాల్లో షర్మిల ప్రవేశించకుండా.. ఆమె తెలంగాణలో ఓ సొంత పార్టీని ఏర్పాటుచేశారు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరించారు.


2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత జగన్ ఆస్తుల పంపకంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల తర్వాత పార్టీ గెలుపు కోసం శ్రమించిన చెల్లిని పక్కకుపెట్టిన జగన్ షర్మిలకు అన్యాయం చేసినట్లు కాదా, తనకు ఇస్తానని చెప్పి ఒప్పందం చేసుకున్న ఆస్తిలో వాటాను సోదరికి దక్కకుండా చేసేందుకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడం ద్వారా సోదరి షర్మిల, తల్లి విజయలక్ష్మికి జగన్ అన్యాయం చేయలేదా.. వీటిని పక్కకు పెట్టి.. తనకు దక్కాల్సిన వాటా దక్కకుండా చేసేందుకు కుట్రలకు తెరలేపిన జగన్‌ బాగోతాన్ని బయటపెట్టిన షర్మిల జగన్‌కు అన్యాయం చేసినట్లా.. ఇద్దరి వాదనల్లో ఎవరిది నిజం.. ఎవరిది అబద్ధం అనేది ప్రస్తుతం తేలాల్సి ఉంది. కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేసు విచారణ తర్వాత ఆస్తుల వివాదంలో ఎవరి వాదన కరెక్ట్.. ఎవరి వాదన తప్పు అనేది తేలనుంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 30 , 2024 | 04:12 PM