Ayyanna Patrudu: జగన్‌కు తల్లి, చెల్లి, బాబాయి అనే తేడా లేదు.. షర్మిలను అంతమొందించినా ఆశ్చర్యపోనక్కర్లేదు..
ABN , Publish Date - Jan 31 , 2024 | 03:56 AM
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి తల్లి, చెల్లి, బాబాయి... అనే తేడా లేదని, షర్మిలను అంతమొందించినా ఆశ్చర్యపోనక్కర్లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్‌కు తల్లి, చెల్లి, బాబాయి తేడా లేదు
కేంద్రం షర్మిలకు భద్రత పెంచాలి
నా ప్రాణాలకూ ముప్పు ఉంది..
టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు
విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి తల్లి, చెల్లి, బాబాయి... అనే తేడా లేదని, షర్మిలను అంతమొందించినా ఆశ్చర్యపోనక్కర్లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రాణాలకు ముప్పు ఉందన్నారు. విశాఖ నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కొద్దిరోజులుగా సీఎం జగన్‌పై ఆయన సోదరి షర్మిల అనేక ఆరోపణలు చేస్తున్నారన్నారు. తండ్రి ఆస్తిలో వాటా కోసం షర్మిల పట్టుబడుతున్నారని, కొద్దిరోజులుగా జగన్‌ను లక్ష్యంగా చేసుకుని అనేక విషయాలు బహిర్గతం చేశారని అన్నారు. అందుకే షర్మిలకు భద్రత పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. తనకు కూడా ప్రాణహాని ఉందని అయ్యన్న ఆందోళన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్, ఎస్పీలను కలిసి తన రివాల్వర్ లైసెన్స్ రెన్యువల్‌కు ఆమోదం తెలపాలని కోరామన్నారు. నాలుగున్నరేళ్లలో ఉత్తరాంధ్రకు జగన్ ఏమీ చేయలేదని, విశాఖ-భీమిలి బీచ్‌రోడ్డులో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను దోచుకున్నారని ఆయన ఆరోపించారు. అనకాపల్లి లోక్‌సభ స్థానానికి టీడీపీ తరఫున తన కుమారుడు విజయ్ దరఖాస్తు చేశారని, ప్రస్తుతం హైకమాండ్ దాన్ని పరిశీలిస్తుందని చెప్పారు. తన కుమారుడు సమర్థుడని, అందుకే ఆయనకు అవకాశం ఇవ్వాలని హైకమాండ్‌ను కోరామన్నారు.